Share News

ఏమిటిది భూమనా?

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:34 AM

తిరుపతి వైసీపీ అభ్యర్థి, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అయిన అభినయ్‌ రెడ్డి భూములన్నీ టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల చుట్టూనే వుండడంపై నగరంలో చర్చ జరుగుతోంది.

ఏమిటిది భూమనా?

అభినయ్‌ ఆస్తులపై నగరంలో చర్చ

టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన స్థలాల చుట్టూనే 6 ఎకరాలు

తుడా చైర్మన్‌గా, టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడే కొనుగోళ్లు

తిరుపతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): తిరుపతి వైసీపీ అభ్యర్థి, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అయిన అభినయ్‌ రెడ్డి భూములన్నీ టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల చుట్టూనే వుండడంపై నగరంలో చర్చ జరుగుతోంది. మరొక విశేషం ఏమిటంటే.. కరుణాకర్‌ రెడ్డి తుడా ఛైర్మన్‌గా ఉన్న సమయం (2005-06)లోనూ, టీటీడీ చైర్మన్‌గా పదవిలో ఉన్నపుడే అభినయ్‌ రెడ్డి పేరిట 21 సార్లు ఆస్తుల కొనుగోళ్లు జరగడం.కరుణాకరరెడ్డి టీటీడీ ఛైర్మన్‌ అయ్యాక (2007-08)లో మూడు సార్లు కొనుగోలు చేశారు. వడమాల పేట మండలం ఎస్వీపురం వద్ద 5.84 ఎకరాలు (ప్రస్తుతం టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చిన ప్రాంతం), సూరప్పకశం టౌన్‌షి్‌ప సమీపంలోని గాజులమండ్యంలో 13.82 ఎకరాలు కలిపి మొత్తంగా 19.66 ఎకరాల భూమిని తుడా ఛైర్మన్‌గా ఉన్నప్పుడే కుమారుడి పేరిట కొన్నారు. 2008లో తిరుపతి రూరల్‌ మండలం కొత్తూరు దగ్గర 1.37 ఎకరాల స్థలం అభినయ్‌ పేరిట కొనుగోలు జరిగింది. తిరుచానూరు గ్రామ లెక్కదాఖలాలో రెండెకరాలు (సర్వే నెంబరు 473/4) 2021లో కరోనా సమయంలో కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నివాసం ఉంటున్న పద్మావతిపురంలో 2011లోనే నాలుగు చోట్ల రెసిడెన్షియల్‌ ఆస్తులను కొనుగోలు చేశారు. 2008లో హైదరాబాదులో 2225 చదరపు అడుగులు కలిగిన ఓ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ అభినయ్‌ ఆస్తుల ఖాతాలో ఉంది. ఇక భార్య పేరిట 2011లో (సెజ్‌ సమీపంలో) వరదయ్యపాళం, పాండూరు దగ్గర 28 ఎకరాల భూమి గిఫ్ట్‌ డీడ్‌ రూపంలో వచ్చింది.

టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల మర్మమిదేనా?

తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం దగ్గర టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన సంగతి తెలిసిందే. దీని సమీపంలోనే అభినయ్‌ పేరిట దాదాపు ఆరెకరాల భూములున్నాయి. టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర రెడ్డి తన కుమారుడి ఆస్తుల విలువ పెంచుకునేందుకే ఇక్కడ టీటీడీ ఉద్యోగులకు స్థలాలను ఎంపిక చేశారన్న విపక్షాల వాదన నిజమేనని అఫిడవిట్‌ బయటపెడుతోందని జనం అంటున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖ లెక్కల ప్రకారం ఈ భూముల్లో హైవేకి ఆనుకుని ఉన్న భాగంలో ఎకరం విలువ రూ1.50కోట్లు కాగా, లోపలి ప్రాంతంలో రూ87.12లక్షలు. మార్కెట్‌ విలువ ఇంతకంటే నాలుగు రెట్లు ఎక్కువవుంటుంది. అభినయ్‌ పేరిట రూ4.62 కోట్ల విలువైన చరాస్తులు, రూ17.05 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా, ఆయన భార్య పేరిట రూ25.18 కోట్ల ఆస్తులు, రూ3.59కోట్ల విలువైన నగలు ఉన్నాయి. రూ86,09,751 అప్పులు, నగదు రూపంలో చేతిలో రూ.80 వేలు, భార్య దగ్గర రూ.50వేలు నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపించారు.

కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయబ్బా?

కరుణాకర రెడ్డికి ఫుల్‌టైం రాజకీయాలు తప్ప వ్యాపారాలు చేసినట్టు (ముప్పై ఏళ్లక్రితం ట్రావెల్స్‌, సిద్ధార్థ జిరాక్స్‌ తప్ప) ఎక్కడా ఆనవాళ్లు లేవు. అభినయ్‌ రెడ్డి కూడా తండ్రి బాటలోనే ఉన్నారు. అఫిడవిట్‌లో మాత్రం మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు, కొన్ని ప్రైవేట్‌ కంపెనీల్లో షేర్లు కొన్నట్టు ఉంది. మరి ఇన్ని ఆస్తులు వీరికి ఎలా వచ్చాయనే చర్చ తిరుపతి జనంలో జోరుగా సాగుతోంది.

Updated Date - Apr 20 , 2024 | 01:34 AM