Share News

ఎన్నికలకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:18 AM

ఆర్వోల నియామకం.. సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

  ఎన్నికలకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

చిత్తూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికలకు శనివారం షెడ్యూల్‌ విడుదల కావడంతో.. ఏర్పాట్లకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఆర్వోల నియామకం, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తికాగా, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 1266 ప్రాంగణాల్లో 1771 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో 265, నగరిలో 231, జీడీనెల్లూరులో 256, చిత్తూరులో 226, పూతలపట్టులో 262, పలమనేరులో 288, కుప్పంలో 243 చొప్పున పోలింగ్‌ కేంద్రాలున్నాయి. జిల్లాలోని 23,503 మంది దివ్యాంగ.. 5167 మంది 85 ఏళ్లు పైబడి ఓటర్లకు ఇంటి నుంచే ఓటేసే అవకాశముంది. ఒకవేళ వీరు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి కూడా ఓటేయొచ్చు. అలాంటి వారి కోసం.. మిగిలిన పాక్షిక దివ్యాంగులు, వృద్ధులకోసం ప్రతి పోలింగ్‌ వద్ద ర్యాంపులు, వీల్‌ ఛైర్లను ఏర్పాటు చేస్తున్నారు.

415 సమస్యాత్మక కేంద్రాలు

మొత్తం 415 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. గత ఎన్నికల్లో 90 శాతానికిపైగా ఓట్లు పోలైనా, 10 శాతానికి తక్కువగా పోలైనా, ఒకే అభ్యర్థికి 75శాతం ఓట్లు వచ్చినా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. ఇలాంటి కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లలో ఓ దాన్ని ఏర్పాటు చేస్తారు. ఆయా కేంద్రాల్లో కేంద్ర బలగాలు విధుల్లో ఉంటాయి.

ఎన్నికల విధులకు వలంటీర్లు దూరం

ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ రోజున ఏజెంట్లుగా వలంటీర్లు కూరోచరాదు. ఇక, సచివాలయాల్లో ఏఎన్‌ఎం మినహా మిగిలిన ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే కొందరిని బీఎల్వోలుగా నియమించగా, పోలింగ్‌ రోజున వారంతా కేంద్రంలో ఓటర్లకు సహాయకులుగా వ్యవహరిస్తారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతో పాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను అవసరాన్ని బట్టి మాత్రమే అనుమతి తీసుకుని వినియోగించుకుంటామని కలెక్టర్‌ అన్నారు.

ఎన్నికల విధులకు గైర్హాజరైతే సస్పెన్షన్‌

ఎన్నికల నిర్వహణపై 4800 మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరైతే సస్పెండు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే శిక్షణకు హాజరుకాని 16 మందిని కలెక్టర్‌ షన్మోహన్‌ సస్పెండు చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీసం ఆరుగురు సిబ్బంది ఉండేలా చూసుకోవడంతో పాటు అదనంగా 20 శాతం సిబ్బందిని నియమిస్తున్నారు.

కోడ్‌ అమలుకు బృందాలు

ఎన్నికల కోడ్‌ అమలుకు మున్సిపాలిటీల్లో కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి టీమ్‌లోనూ ఓ పోలీసు అధికారి ఉంటారు. కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి అధికారులతో పాటు సీ-విజిల్‌ యాప్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదును 100 గంటల్లోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యత వహిస్తారు. కలెక్టరేట్‌లో ఎన్నికలకు సంబంధించిన జిల్లా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి అగ్రికల్చర్‌ జేడీ మురళీకృష్ణకు బాధ్యతలు అప్పగించారు.

తాత్కాలికంగా ఆగిన ధ్రువపత్రాల మంజూరు

సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో ప్రింట్‌ తీసుకునే వివిధ ధ్రువపత్రాలు, వెబ్‌సైట్లమీద సీఎం జగన్‌ ఫొటోలు ఉన్నాయి. దీంతో ఆయా ధ్రువపత్రాల మంజూరునూ తాత్కాలికంగా ఆపేశారు. వెబ్‌సైట్లలో ఫొటోలు లేకుండా చేసి, ఫొటోల్లేని కొత్త ధ్రువపత్రాలను తెప్పించి ప్రింట్‌ చేసిస్తారు.

అభ్యర్థుల ఖర్చు లెక్కింపు

ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేవారు రూ.95 లక్షల వరకు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారు రూ.40 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేసుకోవచ్చు. నామినేషన్లు వేసినప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చును లెక్కిస్తారు. అంతకుముందు చేసే ఖర్చును ఆయా పార్టీల ఖాతాల్లో వేస్తారు. ఈ ఖర్చును లెక్కించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.

ప్రచార సమయమిలా..

ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలను ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత అభ్యర్థి ఒకరే ఇంటింటి ప్రచారం చేసి ఓట్లు అడగవచ్చు. ఇక, ప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏ అభ్యర్థి ముందుగా దరఖాస్తు చేసుకుంటారో, అనుమతి మంజూరులో వారికే ప్రాధాన్యం ఉంటుంది. ఈ అనుతుల కోసం జడ్పీ సీఈవో గ్లోరియా ఆధ్వర్యంలో టీమ్‌ను ఏర్పాటుచేశారు.

ఓటుకోసం ఏప్రిల్‌ 1 వరకు దరఖాస్తు

మే నెలలో పోలింగ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ ఒకటో తేది వరకు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏడు రోజుల పాటు దరఖాస్తును ప్రాసెస్‌ చేసి అర్హతను బట్టి ఓటుహక్కును కలిగిస్తారు. వీరంతా మే 13న ఓటు వేయొచ్చు.

రెండు శాతం కొత్త యువ ఓటర్లు

ఈసారి 18-19 ఏళ్ల మధ్య వయసున్నవారు 36,083 మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. వీరిలో 18766 మంది యువకులు, 16317 మంది యువతులున్నారు. జిల్లా ఓటర్లలో 2 శాతం ఉన్న వీరంతా ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు.

చంద్రగిరి నిర్వహణ తిరుపతి యంత్రాంగం బాధ్యత

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన జరిగినా, చిత్తూరు పార్లమెంటులోని చంద్రగిరి నియోజకవర్గం పూర్తిగా తిరుపతి జిల్లాలో కలిసింది. అలాగే రాజంపేట పార్లమెంటు పరిధిలోని పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో కలిసింది. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ బాఽధ్యత పూర్తిగా తిరుపతి కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా తిరుపతిలోనే చేస్తారు. రౌండ్ల వారీగా ఫలితాలు ఎప్పటికప్పుడు చిత్తూరు యంత్రాంగానికి పంపిస్తారు. ఎన్నికల కోడ్‌ అమలు తీరు పర్యవేక్షణ బాధ్యత కూడా పూర్తిగా తిరుపతి యంత్రాంగానిదే. గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్‌ కూడా తిరుపతిలోనే ఇస్తారు. ఇదే తరహాలో పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల తంతు మొత్తాన్ని చిత్తూరు యంత్రాంగం చూస్తుంది. రౌండ్ల వారీగా ఫలితాలను మాత్రం అన్నమయ్య జిల్లా అధికారులకు పంపిస్తారు.

Updated Date - Mar 18 , 2024 | 01:18 AM