Share News

Kuppam roads-కుప్పం రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Nov 25 , 2024 | 01:48 AM

కుప్పం రోడ్లకు మహర్దశ ప్రారంభమైంది. ప్రస్తుతానికి రహదారులు-భవనాల శాఖ రోడ్లపై గుంతలు పూడుతున్నాయి. కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల పరిధిలో 510 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు విస్తరించాయి.

Kuppam roads-కుప్పం రోడ్లకు మహర్దశ

ఫ రూ.1.28 కోట్లతో మరమ్మతులు

ఫ మరో రూ.68 కోట్లతో ప్రతిపాదనలు

ఫ వాహన చోదకుల కష్టాలకు చెక్‌

కుప్పం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కుప్పం రోడ్లకు మహర్దశ ప్రారంభమైంది. ప్రస్తుతానికి రహదారులు-భవనాల శాఖ రోడ్లపై గుంతలు పూడుతున్నాయి. కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల పరిధిలో 510 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు విస్తరించాయి. వైసీపీ పాలనలో కనీసం పట్టించుకోక పోవడంతో ఈ రోడ్లలో చాలావరకు నరకప్రాయంగా తయారయ్యాయి. తాము అధికారంలోకి వస్తూనే రోడ్లను బాగుచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకుంటున్నారు. డివిజన్‌ పరిధిలోని గుంతలు పూడ్చడానికి రూ.1.28 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ఇప్పటికే సుమారు 51 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఈ పనులను ఈనెల 2వ తేదీన కుప్పం మండలం వసనాడు గ్రామ పరిధిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ ప్రారంభించారు. తర్వాత వర్షాల వల్ల ఆలస్యమైంది. వానలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో పనులు మళ్లీ మొదలు పెట్టారు.

విజన్‌ డాక్యుమెంట్‌లో ప్రతిపాదనలిలా..

డివిజన్‌ పరిధిలో విస్తరించిన 510 కిలోమీటర్ల రోడ్లలో ఇంకా 459 కిలోమీటర్ల రోడ్లు మిగిలిపోతాయి. వీటి మర్మతులకు రూ.68 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిని కుప్పం విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్ల పనులకు రూ.34కోట్లతో ప్రతిపాదించారు. రూ.18 కోట్ల విలువైన ప్రతిపాదనలు స్టేట్‌ హైవే మరమ్మతులకు సంబంధించినవి. రూ.16 కోట్లతో ఇతర రోడ్ల మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజన్‌ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల కడా పీడీ వికాస్‌ మర్మత్‌ సమర్పించారు. ప్రభుత్వం ఆమోదం పొందితే డివిజన్‌లోని రోడ్లకు మహర్దశ పట్టనుంది. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈ దస్తగిరి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ విజన్‌ డాక్యుమెంట్‌కు గ్రీన్‌సిగ్నల్‌ రాగానే మిగిలిన రోడ్లకు కూడా మరమ్మతులు చేపడతామన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 01:48 AM