Share News

రిజిస్ట్రేషన్ల మాయ!

ABN , Publish Date - May 30 , 2024 | 01:12 AM

గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్‌ బ్యాంకుల రుణాల ఆఫర్లు నకిలీ రిజిస్ర్టేషన్లకు కారణమవుతున్నాయి .రుణం కావాలంటే ఇల్లు లేదా ఇంటి స్థలం తాకట్టు పెట్టాల్సి వస్తుండడంతో బ్యాంకులకు, రుణం అవసరమైన మధ్య తరగతి కుటుంబాలకు మధ్య పుట్టగొడుగుల్లా మీడియేటర్లు పుట్టుకొస్తున్నారు.

రిజిస్ట్రేషన్ల మాయ!
కోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

ఫ నకిలీ స్టాంపులు.. అధికారుల ఫోర్జరీ

సంతకాలతో పని కానిచ్చేస్తున్న ముఠా

కోట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్‌ బ్యాంకుల రుణాల ఆఫర్లు నకిలీ రిజిస్ర్టేషన్లకు కారణమవుతున్నాయి .రుణం కావాలంటే ఇల్లు లేదా ఇంటి స్థలం తాకట్టు పెట్టాల్సి వస్తుండడంతో బ్యాంకులకు, రుణం అవసరమైన మధ్య తరగతి కుటుంబాలకు మధ్య పుట్టగొడుగుల్లా మీడియేటర్లు పుట్టుకొస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కాని ఇల్లు, ఇంటి స్థలాలకు సైతం సర్వే నెంబరు మార్చి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ స్టాంప్‌లు సృష్టించి అటు సబ్‌ రిజిస్ట్రార్‌ను, ఇటు ప్రైవేట్‌ బ్యాంకులనూ బురిడీ కొట్టిస్తున్నారు.వారం క్రితం కోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇలాంటి ఫోర్జరీ ముఠా ఒకటి దొరికిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

కోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. గత నాలుగేళ్లలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో పుట్టుకొచ్చిన కొన్ని సంస్థలు, బ్యాంకులు మధ్యతరగతి జనంపై గురిపెట్టాయి. ఇల్లు, స్థలాలు తాకట్టుపెడితే తక్కువ వడ్డికే రుణాలిస్తామంటూ ఎర చూపుతున్నాయి.ఆకర్షితులైన మధ్య తరగతి కుటుంబాలను అదునుగా చేసుకొని కొంతమంది మీడియేటర్లు తమకు మామూళ్లు ఇస్తే ఎక్కువ రుణం ఇప్పిస్తామంటూ ఆశ పెడుతున్నారు. ఏకంగా అధికారుల స్టాంప్‌లను తయారుచేసి వారి సంతకాలను ఫోర్జరీచేసి మరీ రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు.

నకిలీలు పుట్టుకొస్తున్నదిలా

సాధారణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రైత్వారీ పట్టాభూములు, అధికారిక గ్రామకంఠ భూములు మాత్రమే రిజిస్టరవుతాయి.అసైన్‌మెంట్‌, అనాధీన, ప్రభుత్వ , సీలింగ్‌ , దేవాదాయశాఖ భూములు రిజిస్టర్‌ కావు. అయితే గ్రామాల్లో ఎక్కువభాగం అసైన్డ్‌, అనాధీన భూములే వుండడంతో ప్రైవేట్‌ సంస్థలకు, బ్యాంకులకు మీడియేటర్లుగా ఉన్న వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేయిస్తామంటూ ముందుకొస్తున్నారు.సంబంధిత వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, సర్వేయర్ల అధికారిక స్టాంపులను తయారుచేసుకుని వారే క్షేత్రస్థాయిలో తిరిగి సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లను తయారుచేస్తున్నారు. వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయించి లోన్లు అవసరమైన జనం వద్ద భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు. కొంతమందికైతే రిజిస్ర్టేషన్‌కు అవసరమైన సొమ్ము కూడా అప్పుగా ఇస్తూ అధికమొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ మధ్య తరగతి కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తున్నారు.

వెలుగులోకి నకిలీ స్టాంప్‌లు

కోట మండలంలో ప్రకాశం కాలనీ, చంద్రశేఖరపురం, గూడలి, చిట్టేడు, రుద్రవరం, చిట్టమూరు మండలంలోని ఆరూరు, పెళ్లకూరు, గునపాడు గ్రామాల్లో భూములన్నీ నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ నకిలీ సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు జరిపినట్లు తెలిసింది.సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది ఈ విషయం గ్రహించేటప్పటికి నకిలీ రిజిస్ట్రేషన్ల ముఠా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కోట సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రవీణాదేవిని ఈ విషయమై అడగ్గా నకిలీ స్టాంప్‌లు, ఫోర్జరీ సంతకాలపై నిఘా పెంచామని చెప్పుకొచ్చారు. కొన్ని గ్రామాల్లో స్థలాలపై రిజిస్ట్రేషన్లు ఆపేశామన్నారు.నకిలీలు బయటపడితే కారకులపై కేసులు పెడతామని హెచ్చరించారు..

Updated Date - May 30 , 2024 | 01:12 AM