Share News

‘లైఫ్‌’ కోసం ఆరాటం

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:57 PM

విశ్రాంత ఉద్యోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. మారిన లైఫ్‌ సర్టిఫికెట్‌ మార్గదర్శకాలతో అవస్థలు పడుతున్నారు. కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

‘లైఫ్‌’ కోసం ఆరాటం
లైఫ్‌ సర్టిఫికెట్ల కోసం వేలిముద్రలు వేస్తున్న పెన్షనర్లు

లైఫ్‌ సర్టిఫికెట్ల కోసం విశ్రాంత ఉద్యోగుల పాట్లు

వేలిముద్రలు పడక కార్యాలయాల వద్ద పడిగాపులు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 5: విశ్రాంత ఉద్యోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. మారిన లైఫ్‌ సర్టిఫికెట్‌ మార్గదర్శకాలతో అవస్థలు పడుతున్నారు. కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఏటా తాము బతికేవున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్లు అందించాలి. ఆ ప్రకారం జిల్లాలోని 12,505 మంది పెన్షనర్లు ఏటా లైఫ్‌ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గతంలో సర్టిఫికెట్లతో గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయిస్తే సరిపోయేది. ఇప్పుడు దానిని ఆన్‌లైన్‌ ప్రక్రియగా మార్చారు. జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌ ద్వారా వేలిముద్ర వేస్తే సంబంధిత వివరాలు ఖజానాశాఖకు చేరుతాయి. ఇదో సులభతర మార్గంగా ప్రభుత్వం చెబుతుంది. కానీ వేలిముద్రలు సక్రమంగా పడక పండుటాకులు పడుతున్న అవస్థలు అంతాఇంతా కావు. పెన్షనర్లలో ఎక్కువ మంది 70 సంవత్సరాలు దాటిన వారే. వారి వేలిముద్రలు సక్రమంగా పడడంలేదు. రోజంతా కార్యాలయాల వద్ద ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. వేలిముద్రలు పడనివారు నేరుగా సబ్‌ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళి డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని విశ్రాంత ఉద్యోగులకు సులభంగా ఉన్న పాత విధానాన్నే పునరుద్ధరించాలని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్‌.కేశవులు కోరారు.

నేరుగా లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా సరి

వేలిముద్రలు పడని వారు నేరుగా లైఫ్‌ సర్టిఫికెట్లు ఇచ్చినా సరిపోతుంది. వేలిముద్రలు పడడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ యాప్‌ ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లైఫ్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందులో ఏవైనా ఇబ్బందులుంటే 99516 02382 నెంబరుకు ఫోను చేయండి. ఇంకా కొంతమంది ఈకేవైసీ కూడా చేసుకోలేదు. అటువంటి వాళ్లూ త్వరలో చేసుకోకుంటే పెన్షన్‌ ఆగే పరిస్థితి ఉంది. చిత్తూరుకు రాలేనివారు సమీప ఎస్టీవో కార్యాలయాల్లోనూ చేసుకోవచ్చు. పోస్టాఫీసుల్లోనూ లైఫ్‌ సర్టిఫికెట్లు చేసుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. పోస్టుమాస్టర్‌ను కలిస్తే ఇంటికే వచ్చి చేస్తారు.

- చంద్రశేఖర్‌, సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌, చిత్తూరు.

Updated Date - Jan 05 , 2024 | 11:57 PM