వైసీపీ ఆక్రమణల నుంచి చెరువు భూమికి విముక్తి
ABN , Publish Date - Jul 15 , 2024 | 01:33 AM
గుడుపల్లె మండలం శెట్టిపల్లె పంచాయతీ కప్పలనత్తం అప్పయ్య చెరువు భూమికి వైసీపీ నేతల ఆక్రమణల నుంచి విముక్తి లభించింది.
14కెపిఎం జిడిపి6:
గుడుపల్లె, జూలై 14: గుడుపల్లె మండలం శెట్టిపల్లె పంచాయతీ కప్పలనత్తం అప్పయ్య చెరువు భూమికి వైసీపీ నేతల ఆక్రమణల నుంచి విముక్తి లభించింది. కప్పలనత్తం ఊరి సమీపంలోని ప్రధాన రహదారికి సమీపంలో 6.79 ఎకరాల్లో అప్పయ్య చెరువు ఉంది. ఈ చెరువు భూమిపై వైసీపీ నేతల కన్నుపడింది. కుప్పం వైసీపీ నేతల అండదండలతో కొందరు వైసీపీ నేతలు రెండు ఎకరాల వరకు చెరువు భూమిని చెదును చేసి ప్లాట్లుగా ఏర్పాటు చేశారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం.. ఈ నెల 4వ తేదీన కుప్పంలో కలెక్టరు సుమిత్ కుమార్ నిర్వహించిన గ్రీవెన్స్‌లో శెట్టిపల్లె సర్పంచ్ ఎల్లప్పతో కలిసి గ్రామస్థులు ఈ చెరువు ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. ఇక, రెవెన్యూ అధికారులు ఆదివారం చెరువు భూమిని సర్వే చేయడానికి పూనుకొన్నారు. దీంతో వైసీపీ నేతలు కప్పనత్తం వెళ్లే దారికి ముళ్లకంపలు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు రావడం గమనించి వైసీపీ నేతలు పరారయ్యారు. ఈ తర్వాత అధికారులు సర్వేచేసి సుమారు రెండు ఎకరాల భూమి అక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆక్రమిత చెరువు భూమిలో కందకం తవ్వారు. వైసీపీ నాయకుల చెర నుంచి అప్పయ్య చెరువు భూమికి విముక్తి కలిగిందంటూ గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు.