ప్రజలకు దారివ్వు పెద్దిరెడ్డీ.!
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:01 AM
తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో వేసిన రోడ్డుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేసుకున్న గేట్లు తొలగించడానికి జనసేన చేసిన ప్రయత్నం గురువారం ఉద్రిక్తతకు దారితీసింది.

- పబ్లిక్ రోడ్డుకు పెట్టుకున్న గేటు
తొలగింపునకు జనసేన యత్నం
అడ్డుకున్న పోలీసులపై ఆగ్రహం
తిరుపతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో వేసిన రోడ్డుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేసుకున్న గేట్లు తొలగించడానికి జనసేన చేసిన ప్రయత్నం గురువారం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును స్థానికులకు అందుబాటులోకి లేకుండా సొంత ప్రయోజనాల కోసం పెద్దిరెడ్డి వాడుకుంటున్నారంటూ మీడియాలో కథనాలు రావడంతో కిరణ్ రాయల్ నేతృత్వంలో జనసేన పార్టీ శ్రేణులు గురువారం పెద్దిరెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. గేటును తొలగించాలని మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ తామే తొలగించడానికి పూనుకున్నారు.జనసేన అందోళన సమాచారం ముందే తెలుసుకున్న పోలీసులు కిరణ్ రాయల్ తదితరులను పెద్దిరెడ్డి ఇంటి సమీపంలోని బండారు ఆంజనేయస్వామి ఆలయం వద్ద బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ అదితిసింగ్ ఘటనాస్థలానికి రావాలని డిమాండు చేశారు. గేట్లు తెరిపించి అందుబాటులోకి తీసుకురావాలని నినదించారు. దాదాపు గంటపాటు నిరసన చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు రాకపోవడంతో తామే గేట్లు తొలగిస్తామని జనసేన నేతలు కిరణ్ రాయల్, సుభాషిణి తదితరులు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లబోయారు. పెద్దఎత్తున మోహరించిన పోలీసులు జనసైనికులను అడ్డుకుని పోలీసు వ్యానులోకి ఎక్కించేప్రయత్నం చేశారు. ఈక్రమంలో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గేట్లు తొలగించి రెండు కాలనీల వాసులకు దారి కల్పిస్తామని తాము హామీ ఇచ్చామని, అందులో భాగంగా కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు కిరణ్ రాయల్ చెప్పారు. అయినా పట్టించుకోకపోవడంతో తమ నేత పవన్ కల్యాణ్ స్పూర్తితో ప్రజలకిచ్చిన మాట కోసం పెద్దిరెడ్డి కోటకు పెట్టుకున్న గేట్లను తొలగించేందుకు వస్తే పోలీసులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వం మారినా పోలీసులు మారరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంతలో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గేట్లు తొలగించడానికి రెండు రోజులు సమయం కోరడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్, మనోజ్, సాయి, కుమార్, శేషాద్రి పాల్గొన్నారు.