కుప్పం.. సమస్యల వలయం
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:55 AM
అయిదేళ్ల వైసీపీ పాలనలో కుప్పం సమస్యల వలయంలో చిక్కుకుంది. ఇక్కడ ప్రజలు ఎన్నెన్నో సమస్యలతో వేగిపోతూ, పట్టించుకునే దిక్కులేక అల్లాడిపోయారు.

ఫ పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు
ఫ పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ
కుప్పం, జూలై 4: అయిదేళ్ల వైసీపీ పాలనలో కుప్పం సమస్యల వలయంలో చిక్కుకుంది. ఇక్కడ ప్రజలు ఎన్నెన్నో సమస్యలతో వేగిపోతూ, పట్టించుకునే దిక్కులేక అల్లాడిపోయారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం కుప్పంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన జనం దీన్నే రుజువు చేశారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని మండల సచివాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని కలెక్టర్ సుమిత్‌కుమార్ నిర్వహించారు. సచివాలయంతోపాటు నియోజకవర్గ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం పరిసరాలు కూడా జనంతో నిండిపోయాయి. వీరిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ప్రజలనుంచి 600 వినతులు అందితే వాటిలో ఏకంగా 436 వినతులు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. నియోజకవర్గంలో అయిదేళ్ల పాలనలో ఆ రెవెన్యూ యంత్రాంగం ఎంత భ్రష్టు పట్టిందో ఇది తేటతెల్లం చేస్తోంది. భూ ఆక్రమణలు, భూముల సబ్ డివిజన్ చేయడం, చెరువులు, కుంటలు కబ్జా.. వంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇక, విద్యాశాఖకు సంబంధించి 5, ఆర్టీఐ 2, ఇరిగేషన్ 3, పీడీడీఆర్‌డీఏ 16, మండల పరిషత్తు 15, పౌర సరఫాల శాఖ 18, హంద్రీ-నీవా కాలువ 3, ఈడీబీసీ వెల్ఫేర్ 1, హౌసింగ్ 27, ఆర్ అండ్ బి 2, దేవాదాయ శాఖ 3, దివ్యాంగుల సంక్షేమ శాఖ 3, డిప్యూటీ ఈవో 1, డీఎల్డీవో 3, సబ్ రిజిస్ట్రార్ 1, ఐసీడీఎస్ 1, డ్వామా 2, ఈడీ ఎస్‌ఈ కార్పొరేషన్, జిల్లా ఉపాఽధి కల్పన, సైనిక్ వెల్ఫేర్, పీవో ఎస్‌ఎ్‌సఏ, మైనర్ ఇరిగేషన్, వ్యవసాయం, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ హాస్టల్స్, స్కిల్ డెవల్‌పమెంట్ శాఖలకు సంబంధించి ఒక్కోటి, ఎస్‌ఈ ఈపీఆర్ 29, ఆర్టీసీ 4, రెస్కో 4, పోలీసు శాఖకు సంబంధించి 8 చొప్పున వినతులు అందాయి. తహసీల్దారు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్య దగ్గరకే వెళ్లి రెవెన్యూ ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టరు ఆదేశించారు. ఈ ప్రక్రియలో అధికారుల తీరుపై ప్రజలనుంచి మళ్లీ ఏవైనా ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక పెన్షన్లకు అర్హులైన వారిని గుర్తించి మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డీఎల్‌డీవో రవికుమార్, సీపీవో సాంబశివారెడ్డి, కుప్పం ఆర్డీవో శ్రీనివాసులుతోపాటు నియోజకవర్గ పరిధిలోని అధికార యంత్రాంగం పాల్గొని ఆయా సమస్యలపై కలెక్టరుకు వివరణ ఇచ్చింది. టీడీపీ నాయకులు పీఎస్ మునిరత్నం, డాక్టర్ సురేశ్‌బాబు, పి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
మాకు బతుకునివ్వండి సారూ!
ఫ వైసీపీ ప్రభుత్వంలో జరగని న్యాయం
ఫ సాయం కోసం కలెక్టరుకు గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ కుటుంబ సభ్యురాలి వినతి
వైసీపీ నేత, ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయం మాజీ ఛైర్మన్ ఎన్.పార్థసారథి కుటుంబం రోడ్డున పడింది. ఛైర్మన్ పదవికోసం వైసీపీ నేతలకు అప్పులు చేసి కప్పం చెల్లించిన ఆయన, చివరకు రైలుపట్టాలపై శవమై తేలారు. ఆదుకుంటామన్న వైసీపీ నేతలు మాట తప్పడంతో పార్థసారథి కుటుంబ సభ్యురాలు భాగ్యలక్ష్మి ప్రభుత్వ సాయం కోసం గురువారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చి కలెక్టర్‌కు వినపత్రిం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్థసారథి ఆలయ ఛైర్మన్‌గా పనిచేశారు. కరోనా సమయంలో జాతర జరిపే అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెందారు. 2022లో కేఏ మంజునాథ్‌కు చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆ ఏడాది జాతర జరిపించే అవకాశం తనకు ఇచ్చి.. తర్వాత ఎవరికైనా పదవి ఇవ్వాలని వైసీపీ నేతలను పార్థసారథి కోరినా పట్టించుకోలేదు. అదే ఏడాది ఏప్రిల్ 5న రైలు పట్టాలపై ఆయన శవమై తేలారు. ఆలయ ఛైర్మన్ పదవిని ఆయన వైసీపీ నేతలకు లక్షలు ఇచ్చి కొనుక్కున్నారని ఆ వెంటనే గుప్పుమంది. వైసీపీ నేతలకు డబ్బులిచ్చే క్రమంలో అప్పుల పాలై, ఆ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారమైంది. ఆమేరకు ఆయన చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ప్రచారానికి జడిసిన వైసీపీ పెద్దలు పార్థసారథి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి కొంత ఆర్థికసాయం చేశారు. రూ.15 లక్షలు సాయం చేస్తానని ఎమ్మెల్సీ భరత్ హామీ ఇచ్చారు. ఆ హామీలేవీ నెరవేరినట్లు కనిపించడంలేదు. అందుకే భాగ్యలక్ష్మి కలెక్టర్‌ను కలిసి ఆర్థిక సాయంకోసం అర్థించారు. వైసీపీ నేతలు చేసిన అరాకొరా ఆర్థిక సాయం కుటుంబ జరుగుబాటుకు ఏమాత్రం సరిపోవడంలేదని ఆమె చెప్పుకొచ్చారు. పార్థసారథికి ఉన్న రెండు ఇళ్లూ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రూ.10 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు చెప్పారు. అప్పట్లో కలెక్టర్‌కు ఎమ్మెల్సీ భరత్ రాసిన లేఖలో ఈ విషయం స్పష్టంగా ఉంది. కాగా, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ పార్థసారథి భార్య అయిన భాగ్యలక్ష్మి పేరుతో కలెక్టరుకు ఆమె రాసుకున్న లేఖలో ఆయన అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని, తన కుటుంబం జరుగుబాటుకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయాలని విన్నవించుకున్నారు. వైసీపీ కార్యకర్తలకే కాదు.. వారి ప్రభుత్వంలో నోరులేని నాయకులకూ అన్యాయం జరిగిందన్న వ్యాఖ్యలు అక్కడ వినిపించాయి. మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వమే ఉన్నా, ఆ పార్టీ నాయకులవల్ల అన్యాయమై పోయిన పార్థసారథి కుటుంబానికి కనీస ఆర్థిక సాయం అందకపోవడం, ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలను కూడా ఆలోచింపజేస్తోంది.
‘అమరావతి’ కోసం రూ.5,116 విరాళం
రాజధాని అమరావతి నిర్మాణానికి గుడుపల్లె మండలం పొగురుపల్లెకు చందిన ఎం.శంకర్‌రెడ్డి రూ.5,116 విరాళంగా ఇచ్చారు. కుప్పంలో గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి చెక్కు అందించారు. ఈ కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, డ్వామా పీడీ ఎస్.రాజశేఖర్, కుప్పం ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.