Share News

రెస్కోలో ‘కృష్ణ’మాయ!

ABN , Publish Date - Jul 15 , 2024 | 01:23 AM

శివుడి ఆజ్జ లేనిదే చీమయినా కుట్టదంటారు. కానీ కుప్పం రెస్కోలో మాత్రం అవినీతిమయమైన ఆజ్ఞలు ఇచ్చేది ఎవరైనా ‘కృష్ణ’మాయ లేనిదే ఫైల్‌ పుటప్‌ కాదు. ఆయన ఫైల్‌ తయారు చేశారంటే ఎవరూ తప్పు పట్టలేనంతగా పకడ్బందీగా ఉంటుందంటారు.

రెస్కోలో ‘కృష్ణ’మాయ!
కుప్పం రెస్కో కార్యాలయం

ఫ కీలక పోస్టులో సర్వంసహాధికారాలు

ఫ అక్రమ పదోన్నతులు, నియామకాలు ఆయన చలవే

ఫ మాజీ, ప్రస్తుత ఎండీల డైరెక్షన్‌లో చెలరేగిపోయిన విధానం

శివుడి ఆజ్జ లేనిదే చీమయినా కుట్టదంటారు. కానీ కుప్పం రెస్కోలో మాత్రం అవినీతిమయమైన ఆజ్ఞలు ఇచ్చేది ఎవరైనా ‘కృష్ణ’మాయ లేనిదే ఫైల్‌ పుటప్‌ కాదు. ఆయన ఫైల్‌ తయారు చేశారంటే ఎవరూ తప్పు పట్టలేనంతగా పకడ్బందీగా ఉంటుందంటారు. ఇక్కడి అక్రమాలన్నీ సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలోని ఆ ఉద్యోగి చేసిన ఫైళ్ల మాయల ద్వారానే జరిగాయి. ఎన్ని విచారణలు జరుగుతున్నా ఆయనను కనీసం తాకలేకపోవడం ‘కృష్ణ’మాయాజాలం మహత్తుకు తార్కాణం.

- కుప్పం

కుప్పం రెస్కో (రూరల్‌ ఎలక్ట్రికల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ)లో వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు, అడ్డగోలు పదోన్నతులు.. ఇలా ఎన్నో అవినీతి చర్యలు చోటుచేసుకున్నాయి. వీటిలో కొన్ని ప్రాథమిక విచారణలో నిర్ధారణ కూడా అయ్యాయి. ఈ అక్రమాలు జరగాలంటే దానికి అనుగుణంగా ఫైళ్లు తయారు కావాలి. పదోన్నతులు, నియామకాలు ఏ బేస్‌ మీద చేస్తున్నారో, కో ఆపరేటివ్‌ సెక్టార్‌ నిబంధనలు అంగీకరిస్తున్నాయో లేదో ఆ ఫైల్స్‌లో పొందుపరచాలి. ఈ వ్యవహారమంతా రెస్కోలోని అడ్మినిస్ట్రేషన్‌ విభాగం చూసుకుంటుంది. ఇదిగో.. ఇక్కడే కీలకమైన పోస్టులో కూర్చున్న ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ చక్రం తిప్పాడు. ‘కృష్ణ’మాయతో సర్వం తానై వ్యవహరించారు. రెస్కోలో జరిగిన ప్రతి అవినీతి చర్య వెనుకా ఆ ఉద్యోగి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం గుడుపల్లె రెస్కోలో బదిలీ మీద వెళ్లిన ఆ ఉద్యోగి.. 2014 మార్చిలో కన్సాలిడేటెడ్‌ పే మీద రెస్కోలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. 2016లో రెగ్యులరైజ్‌ అయ్యారు. వి.కోట సెక్షన్‌లో పనిచేస్తున్నప్పుడు 2018-19లో ఏడాదిపాటు సస్పెండయ్యారు. అప్పట్లో రూ.2.55 లక్షలను దుర్వినియోగం చేశారని ఆ అధికారిపై ఫిర్యాదు వచ్చింది. ఇది నిజమని విచారణలో తేలడంతో సస్పెండయ్యారు. తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేశారు. 2019 సెప్టెంబరులో జూనియర్‌ అసిస్టెంట్‌గానే రీ జాయిన్‌ అయ్యారు. ఏడాదికంతా సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది, కీలకమైన అడ్మినిస్ట్రేషన్‌ సెక్షన్‌లో చక్రం తిప్పడం ప్రారంభించారు. సాధారణంగా రెస్కోలో తర్వాతి కేడర్‌కు పదోన్నతి లభించాలంటే కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలి. జూనియర్‌ అసిస్టెంట్‌నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్న పొందడంలో ఈ నిబంధన ఈ కీలక ఉద్యోగికి వర్తించలేదు. గతంలో నిధుల దుర్వినియోగం కింద సస్పెండైన రికార్డునూ పరిగణనలోకి తీసుకోలేదు. ఇక, తన ఏడాది సస్పెన్షన్‌ కాలాన్ని వివిధ సెలవులుగా (ఎర్న్‌డ్‌, ఆఫ్‌ పే, లాస్‌ ఆఫ్‌ పే) మార్చుకోవడమూ ఆ ఉద్యోగికే సాధ్యమైంది.

సర్వీసు రిజిస్టర్‌ మాయం చేసినా బదిలీతో సరి

కుప్పం రెస్కోలో ఇటీవల ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌ మాయమైంది. మాజీ ఎండీ ఇంటికి చేరిందని, పాత డేట్లతో ఆయన ఉద్యోగుల సర్వీసు, ఇంక్రిమెంట్లు ఇతర విషయాలకు సంబంధించిన ఆపత తేదీలతో సంతకాలు చేయడానికే ఇది జరిగిందని గగ్గోలు పుట్టింది. సర్వీసు రిజిస్టర్‌ మాయం చేయగలిగిన సమర్థులు ఈ కీలక ఉద్యోగి తప్ప మరెవరూ కాదనీ తేలింది. సాధారణంగా ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌ మాయం చేయడం చాలాపెద్ద నేరం. ఇక్కడ నేరం రుజువైనా సరే ఆ ఉద్యోగిని గుడుపల్లె సెక్షన్‌కు బదిలీచేసి వదిలేశారంతే. ఈ చర్య జరిగింది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాకే. ఇందులో ఉన్నతాధికారుల బాధ్యతారహితంగా.. అవినీతికి కొమ్ముకాసేలా వ్యవహరించడం విమర్శలపాలైంది. ప్రస్తుత పాలకులూ దీనిని పట్టించుకోకపోవడం గమనార్హం.

ఎండీల సంపూర్ణ సహకారం

ఇన్ని అవకతవకలు, అవినీతి చర్యలు, అడ్డగోలు వ్యవహారాలకు ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ పాల్పడడం వెనుక మాజీ ఎండీ సుబ్రహ్మణ్యం, ప్రస్తుత ఎండీ ప్రభాకర్‌ సహకారం ఉంది. వీరిద్దరి సర్టిఫికెట్లు, పదోన్నతులు కూడా వివాదాస్పదం కావడం తెలిసిందే. వీటి వెనుకా ఈ కీలక ఉద్యోగి చేతివాటం ఉన్నదన్నది బహిరంగ రహస్యం. ఇక, ఏఏవో ద్వారా వ్యవహారాలు నడిపారు. ఉద్యోగం తీసిస్తానని ఒక నిరుద్యోగినుంచి ఆ ఏఏవో ఏకంగా రూ.8 లక్షలు వసూలు చేశారు. దీనిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది కూడా. భయపడిన సదరు ఏఏవో మూడునాలుగు రోజుల క్రితం ఆ నిరుద్యోగికి రూ.8 లక్షలు వెనక్కు ఇచ్చేశారని సమాచారం. ఇక, నాటి సహకార శాఖాధికారులకూ ఈ కీలక ఉద్యోగిపై మమకారం ఎక్కువే. అందుకనే, సస్పెండైనా పదోన్నతి లభించడం, సర్వీసు రిజిస్టర్‌ మాయం చేసినా బదిలీతో సరిపెట్టారన్న ఆరోపణలున్నాయి. ఇలా ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ అటు సహకారశాఖలో.. ఇటు రెస్కోలో తన ‘కృష్ణ’మాయను ప్రదర్శించారు.

‘కృష్ణ’మాయాజాలంలో జరిగిన కొన్ని అవినీతి చర్యలు

ఫ అక్రమంగా 122 మంది ఉద్యోగుల నియామకం

ఫ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడానికి మూడు రోజుల ముందు 52 మందికి అడ్డగోలు పదోన్నతులు

ఫ రూ.30 లక్షలనుంచి రూ.45 లక్షలదాకా విద్యుత్తు బకాయిలు వసూలు చేసి స్వాహా చేయడం

ఫ మాజీ ఎండీ ఉపయోగించిన సంస్థకు చెందిన వాహనాన్ని బెంగళూరు మెకానిక్‌ షాపులో వదిలేస్తే, రిపేరుకు మాత్రమే రూ.4 లక్షలు వ్యయమవుతుందని తప్పుడు బిల్లులు సృష్టించడం. (అప్పుడెప్పుడో చెల్లించిన రూ.1.50 లక్షలతోనే సరిపెట్టేసుకుని చివరకు ఈ వాహనాన్ని రెండు రోజుల క్రితం సదరు మెకానిక్‌ షాపు వాళ్లు వెనక్కు ఇచ్చేశారు)

ఫ ఇంకా మాజీ ఎండీ వాడుతున్న పాత వాహనం ప్రయాణ దూరాన్ని అధికంగా చూపి ఆమేరకు డీజిలు బిల్లులు పెట్టి స్వాహా చేయడం.

ఫ అర్హతలేని నలుగురికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడం

ఫ అప్పట్లో రెస్కో ఆధ్వర్యంలో నడుస్తున్న జేమ్స్‌ యెన్‌ పాలిటెక్నిక్‌ నుంచి ఒక ఉద్యోగిని రెస్కోలోకి తీసుకుని, అనతికాలంలోనే మూడు మెట్లు ఎక్కించి డీఈగా పదోన్నతి కల్పించడం

విచారణలో నిగ్గు తేల్చాల్సిందే

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రెస్కోలో అవినీతి, అక్రమాలపై విచారణ మొదలు పెట్టింది. కానీ, సంబంధిత అధికారులు గతంలో ఆయా అక్రమ చర్యలు జరుగుతుండగా ప్రేక్షక పాత్ర వహించిన వారే. ఇప్పుడు ప్రభుత్వం విచారణాధికారిగా సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్‌ కె.శ్రీలక్ష్మిని నియమించింది. ఆమె ఈనెల 18న కుప్పం వచ్చి విచారణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన రికార్డులన్నీ ఇవ్వాలని రెస్కో ఉన్నతాధికారికి ఆమె లేఖ రాశారు. విచారణ సమయంలో పైన పేర్కొన్న కీలక ఉద్యోగిని ప్రశ్నిస్తే రెస్కోలో అన్నిరకాలైన అవినీతి, అక్రమాలు పూర్తిగా వెలుగు చూసే అవకాశం ఉంది. అలాగే రెస్కో ఎండీగా తిరుపతి ఎస్పీడీసీఎల్‌ ఈఈ సోమశేఖర్‌ నియమితులయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. రెస్కో గత అక్రమాలపై అప్రమత్తంగా ఉండకపోతే ఆ ఊబిలో నూతన ఎండీ కూడా కూరుకుపోయే ప్రమాదం ఉంది.

Updated Date - Jul 15 , 2024 | 01:23 AM