Share News

కూటమిలో జోష్‌

ABN , Publish Date - May 16 , 2024 | 01:05 AM

ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే భారీ ఓటింగని నేతల అంచనా మెజారిటీ స్థానాలు తమవేనంటూ ధీమా

కూటమిలో జోష్‌

చిత్తూరు, ఆంధ్రజ్యోతి: పోలింగ్‌ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల్లో జోష్‌ కనిపిస్తోంది. రికార్డుస్థాయి ఓటింగ్‌ శాతం తమకే లాభిస్తుందని వీరు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న కసి.. ఓట్లుగా మారాయంటున్నారు. అందుకనే ఎన్నడూలేనంతగా 87.09 శాతం ఓటింగ్‌ జరిగిందని చెబుతున్నారు. పోలింగ్‌ సరళి చూస్తుంటే మెజారిటీ స్థానాలూ తమకే వస్తాయని కూటమి నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

పోలింగ్‌ ముగిసింది. ఓటింగ్‌ సరళిపై ఆయా పార్టీలో నేతలు విపరీతంగా చర్చలు జరుపుతున్నారు. 2019 ఎన్నికల్లో అత్యధికంగా 85.02 శాతం ఓటింగ్‌ నమోదైంది. అప్పటికి ఇదే భారీ ఓటింగ్‌ శాతం. ఇది నాటి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి అనుకూలించింది. నాటి ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కుప్పం మినహా 13 చోట్ల వైసీపీ గెలుపొందింది. తిరుపతి, చిత్తూరు పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించింది. జిల్లాల పునర్విభజన తర్వాత.. చిత్తూరు జిల్లాలో గత ఎన్నికలకన్నా ఇప్పుడు 2.07 శాతం ఎక్కువ (87.09 శాతం) పోలింగ్‌ జరిగింది. ఇదీ ప్రతిపక్ష కూటమికే లాభిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికల ముందే కుప్పం, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో విజయంపై టీడీపీ నమ్మకంగా ఉండింది. ఇప్పుడు పోలింగ్‌ సరళి చూశాక చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరుల్లోనూ గెలుపు సాధిస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులోనూ సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, వైసీపీ గెలిచాయి. ఈసారి ఆ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగరనుందని కూటమి నేతలు అంటున్నారు. ఇంటెలిజెన్స్‌ సర్వేలోనూ ఇదే విషయం వ్యక్తమైనట్లు కూటమి నేతలు చెబుతున్నారు. చిత్తూరు పార్లమెంటు గెలుపుపై వందశాతం నమ్మకంతో ఉన్నారు.

ఇక, వైసీపీ నేతలు కూడా కుప్పం తప్ప అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులే గెలుస్తారని చెబుతున్నారు. కుప్పంలో భారీగా డబ్బు పంపిణీ చేయడంతో చంద్రబాబుకు మెజార్టీ తగ్గుతుందని అంటున్నారు. మహిళలు, వృద్ధులు, గ్రామీణులు తమకు అనుకూలంగా ఓటేశారని వైసీపీ నాయకులు లెక్కలు వేస్తున్నారు.

ఓటింగ్‌ పెరగడానికి కారణాలు

ఐదేళ్లు అన్నిరకాలుగా విసిగిపోయి..

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు 2019 ఎన్నికల్లో కుప్పం మినహా మిగిలిన 13 అసెంబ్లీ, చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాల్లో వైసీపీని గెలిపించారు. కానీ, జిల్లాలో చెప్పకోదగ్గ అభివృద్ధి జరగలేదు. చిత్తూరు జిల్లా విభజన జరిగి రెండేళ్లయినా ఒక్క విద్యా, వైద్య సంస్థలు, పెద్ద పరిశ్రమలు రాలేదు. పేరుకేమో ముగ్గురు మంత్రులున్నా.. ప్రతిపక్షాలపై దాడులు, ఆరోపణలతోనే కాలం వెల్లదీశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల్లో భయాందోళన ఉండడం.. తప్పుల తడకగా భూరీసర్వేలు జరగడం.. పట్టాదారు పాసుపుస్తకాల్లో జగన్‌ ఫొటోను ముద్రించడం.. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని మోసం చేయడం.. ధరలు పెంచేసి నాసిరకం మద్యాన్ని అందుబాటులో ఉంచడం.. ఇసుక ధరలు బాగా పెంచేసి, అందుబాటులో లేకపోవడం.. 9 సార్లు విద్యుత్తు, 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్‌ డీజల్‌ ధరలు అధికంగా ఉండడం.. బటన్లు నొక్కి పథకాల డబ్బులు విడుదల చేసినా, దానికి పది రెట్లు వివిధ రూపాల్లో లాగేయడం.. తదితరాలపై ఆయా వర్గాల ప్రజల్లో అసహనం ఉంది. ఇవన్నీ పోలింగ్‌ శాతం పెరగడానికి ఓ కారణమని విశ్లేషిస్తున్నారు.

ఓటు నమోదు, వినియోగంపై అవగాహన

జిల్లా ఎన్నికల యంత్రాంగం ఓటు నమోదు, వినియోగంపై పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. కలెక్టర్‌ షన్మోహన్‌ ఆధ్వర్యంలో ఈఆర్వోలు ఆయా కాలేజీల్లో రెండు మూడు సార్లు ఓటు నమోదు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. తుది ఓటర్ల జాబితా విడుదలయ్యాక ఆయా మున్సిపాలిటీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో స్వీప్‌ పేరిట ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేశారు. ప్రచార రథాలు, పోస్టర్లు, బ్యానర్లు, సోషల్‌ మీడియా వంటివాటి ద్వారా ప్రచారం చేశారు. వీటివల్లా ఓటింగ్‌ శాతం పెరిగిందనే అభిప్రాయం ఉంది.

రెండు పార్టీలూ పోటీపడి డబ్బుల పంపిణీ

ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడి మరీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. కుప్పం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు సమానంగా పంపిణీ జరిగింది. దీంతో డబ్బు తీసుకున్న ఓటర్లు క్యూలో నిలబడి ఓటేయగా, డబ్బులు ఇచ్చిన నాయకులు వారి ఇళ్లకు వెళ్లి పిలుచుకుని వచ్చి ఓటు వేయించారు. దీంతో పాటు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నవారూ తమ గ్రామాలకు వచ్చి ఓటేశారు. ఆయా పార్టీల నాయకులు కూడా బయటి ప్రాంతాల్లో నివశించేవారి కోసం ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఇలా ఓటింగ్‌ శాతం పెరగడానికి కారణమైన వాటిల్లో అత్యధికం ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధానమని కూటమి నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుస్తారనే బెట్టింగులు జోరందుకున్నాయి.

ఆయా అభ్యర్థుల సొంత సర్వేలు

పోలింగ్‌ రోజే ఆయా పార్టీల అభ్యర్థులు సొంతంగా ఎగ్జిట్‌ పోల్‌ సర్వే చేయించుకున్నారు. ఓటేసి కేంద్రాల నుంచి బయటికి వచ్చే వారితో మాట్లాడి నాడి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. మహిళలు, వృద్ధులు, యువత వంటి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం చేసే సామాజికవర్గాల వారీగా ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపారనేది అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల గణాంకాలు, పోలింగ్‌ శాతం ముందు పెట్టుకుని రాజకీయ పరిశీలకులతో విశ్లేషణ చేయిస్తున్నారు.

Updated Date - May 16 , 2024 | 01:05 AM