Share News

టీడీపీలో జోష్‌

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:24 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కొత్త జోష్‌ నెలకొంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో అభ్యర్ధులను ఖరారు చేసిన టీడీపీ అధిష్ఠానం, తాజాగా చిత్తూరు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది.

టీడీపీలో జోష్‌
విజయవాడలో జరిగిన వర్క్‌షా్‌పకు హాజరైన జిల్లా నాయకులు

ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై స్పష్టత

తాజాగా వారికి చంద్రబాబు దిశానిర్దేశం

చిత్తూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కొత్త జోష్‌ నెలకొంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో అభ్యర్ధులను ఖరారు చేసిన టీడీపీ అధిష్ఠానం, తాజాగా చిత్తూరు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. దీంతో పాటు అభ్యర్థులతో చంద్రబాబు విజయవాడలో శనివారం నిర్వహించిన వర్క్‌షా్‌పలో దిశానిర్దేశం చేశారు. చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్‌, గాలి భానుప్రకాష్‌, మురళీమోహన్‌, థామస్‌ తదితరులు జిల్లా నుంచి హాజరయ్యారు. సోమవారం నుంచి కుప్పం, పలమనేరులో చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాల నాయకులు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ జోరుగా జనంలోకి వెళ్తోంది.

వేవ్‌ ఉందని నిర్లక్ష్యం వద్దు

టీడీపీ, జనసేన, బీజేపీ వేవ్‌ ఉందని, సులువుగా గెలిచిపోతామనే నిర్లక్ష్యం వద్దు.. మరింత శ్రమించాలి. మిత్రపక్షాలతో సమన్వయం ముఖ్యం. వైసీపీ నేతల తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపించండి. కోడ్‌ ఉల్లంఘనల మీద సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయండి. మన న్యాయవాద బృందాల సేవలను వినియోగించుకోండి.

- జిల్లా అభ్యర్థులు, నేతలతో చంద్రబాబు

ఫ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి లక్ష మెజార్టీ లక్ష్యంగా ఎన్నికల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో శ్రేణులు శ్రమిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ వ్యూహాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య సీఎం జగన్‌ హంద్రీనీవా నీళ్లను వదిలిన తీరు వెనుక నిజాలను బయటపెట్టి ఇదంతా డ్రామా అని టీడీపీ నేతలు నిరూపించారు.

ఫ పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఒకటికి రెండుసార్లు ఇంటింటి ప్రచారం చేశారు. వైసీపీ తరఫున మళ్లీ వెంకటేగౌడకు టికెట్‌ రావడం టీడీపీకి అనుకూలిస్తుందని అమర్‌ వర్గం భావిస్తోంది.

ఫ పూతలపట్టు నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులు కంకణం కట్టుకున్నారు. అభ్యర్థి మురళీమోహన్‌ పార్టీలో సీనియర్లను కలుపుకొని పోతున్నారు. పార్టీకి దూరంగా ఉన్నవారిని మళ్లీ ఆహ్వానించి గెలిపించాలంటూ కోరుతున్నారు.

ఫ జీడీనెల్లూరులో అనేకమార్లు వైసీపీ తమ అభ్యర్థిని మార్చడం, వైసీపీలో వర్గాలు ఉండడం టీడీపీకి అనుకూలించే అంశాలు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి థామస్‌ ప్రచారంలో దూసుకుపోతున్నా.. పార్టీలో సీనియర్లను కలుపుకొని పోవడం లేదని, తద్వారా చాలామంది పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

ఫ చిత్తూరులో గురజాల జగన్మోహన్‌ను గెలిపించుకునేందుకు మిత్రపక్షాల నాయకులంతా సిద్ధమయ్యారు. వైసీపీ అభ్యర్థి, ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డిని ఎలాగైనా ఓడించాలని చిత్తూరు పాలనలో ముద్ర వేసిన రాజకీయ కుటుంబాలన్నీ ఏకమయ్యాయి.

ఫ పుంగనూరులో టీడీపీ శ్రేణులు కసి మీద ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఈ ఐదేళ్లలో చేసిన అక్రమాలతో పాటు తమను అక్రమ కేసులతో వేధించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. చల్లా రామచంద్రారెడ్డిని గెలిపించుకోవాలని శ్రమిస్తున్నారు. ఇక్కడ బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఫ నగరిలో రోజా మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా ఆమె కోసం పనిచేయబోమని బహిరంగంగా చెబుతుండటం టీడీపీకి అనుకూలించే అంశాలు. దీనికితోడు భానుప్రకాష్‌ తండ్రి ముద్దుకృష్ణమనాయుడిని తలపిస్తూ గ్రామాల్లో తిరుగుతున్నారు.

ఫ చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్‌రావు ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులతో కలిసి పర్యటిస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారిగా పనిచేసిన ఈయన అందరినీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్నారు. 1984 నుంచి 2019 వరకు పదిసార్లు చిత్తూరు లోక్‌సభకు ఎన్నికలు జరగ్గా ఏడుసార్లు టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్‌, ఓ సారి వైసీపీ గెలిచింది.

Updated Date - Mar 24 , 2024 | 12:24 AM