Share News

కోలాహలంగా జల్లికట్టు

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:25 AM

ముక్కనుమ సందర్భంగా బుధవారం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె, కురివికుప్పం గ్రామాల్లో జల్లికట్టు నిర్వహించారు.

కోలాహలంగా జల్లికట్టు
బ్రాహ్మణపల్లె జల్లికట్టులో పశువులను నిలువరిస్తున్న యువకులు

బ్రాహ్మణపల్లెలో ఎటు చూసినా జనమే

వెదురుకుప్పం, జనవరి 17: ముక్కనుమ సందర్భంగా బుధవారం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె, కురివికుప్పం గ్రామాల్లో జల్లికట్టు నిర్వహించారు. బ్రాహ్మణపల్లె జల్లికట్టుకు వేలాదిగా జనం తరలి రావడంతో గ్రామం.. జనసంద్రంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు పశువులను బ్రాహ్మణపల్లెకు తీసుకొచ్చారు. ఆయా గిత్తల కొమ్ములకు బహుమతులుగా ఉపయోగించే పట్టీలను కట్టారు. కొన్నింటికి వస్త్రాలను కప్పి వదిలారు. కొందరు ప్రధాన పార్టీల జెండాలనూ కట్టారు. ఇలా.. అల్లిలో వదిలిన పశువులను ఆపేందుకు యువకులు ప్రయత్నించారు. జనసమూహాన్ని చీల్చుకుంటూ గిత్తలు ముందుకు దూసుకు వెళ్లడంతో వాటిని ఆపే ప్రయత్నంలో యువకులు వాటి కింద పడి కొందరు గాయపడ్డారు. పట్టీలను సొంతం చేసుకునే క్రమంలో గిత్తలతో కుస్తీ పడ్డారు. కొందరు యువకులు పట్టీలను సొంతం చేసుకోగా.. మరి కొన్ని గిత్తలు వీరికి దొరకలేదు.

కురివికుప్పంలో..

కురివికుప్పంలోనూ జల్లికట్టు నిర్వహించారు. అల్లిలో వదిలిని కోడెగిత్తలను నిలువరించి, బహుమతులను చేజిక్కించుకునేందుకు యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలువురు గాయుపపడ్డారు. ఎగువ పాతగుంటకు చెందిన 55 ఏళ్ల వ్యక్తిని గిత్త పొడవడంతో అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఆయన అపస్మారక స్థితికి చేరుకోగా.. చికిత్స నిమిత్తం తిరుపతికి బంధువులు తరలించారు. పట్టీలు దక్కించుకున్న యువకులు సంతోషంగా వెనుతిరిగారు.

ఎర్రమట్టిపల్లిలో..

పెనుమూరు: పెనుమూరు మండలం ఎర్రమట్టిపల్లిలో బుధవారం జల్లికట్టు నిర్వహించారు. వీధుల్లో పశువులను పరిగెత్తించారు. వాటిని నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ జల్లికట్టును తిలకించేందుకు చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గ్రామానికి తరలివచ్చారు.

Updated Date - Jan 18 , 2024 | 12:25 AM