Share News

పట్టణ ప్రజలపై జగనన్న పన్ను పోటు

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:53 AM

ఎన్నికల వేళా జగనన్న పన్ను పోటు పొడిచారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆస్తి పన్ను పెంచుకుంటూ... పోతున్నారు

పట్టణ ప్రజలపై  జగనన్న పన్ను పోటు

ఎన్నికల వేళా జగనన్న పన్ను పోటు పొడిచారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆస్తి పన్ను పెంచుకుంటూ... పోతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ నుంచి పట్టణ ప్రజలపై 15 శాతం ఆస్తి పన్ను పెరిగింది. ఇలా పన్నులు పెంచేస్తే ఎలాగంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెంచుతున్న పన్నుల కారణంగా ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు. టీడీపీ హయాంలో ఉన్న పన్ను విధానాన్ని వైసీపీ మార్చేసింది. అద్దె విలువ ఆధారిత పన్ను నుంచి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానానికి 2021-22 నుంచి జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. భవనంతో పాటు చుట్టూ ఖాళీ వదిలితే దానికి ప్రస్తుతం పన్ను విధిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీలకు గణనీయంగా ఆదాయం పెరగ్గా, సామాన్యులపై భారం పడింది. ముందుగా భూమి, భవనం విలువలో 0.13 శాతాన్ని ఆస్తి పన్నుగా నిర్ణయించారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అదంతా ఒకసారి కాకుండా ఏటా 15 శాతం పెంచుకునేలా ప్రతిపాదించారు. ఇలా ఏటా 15 శాతం ఆస్తి పన్ను పెరుగుతూ వస్తోంది. నివాస భవనాలకు 0.15, వాణిజ్య భవనాలకు 0.30, ఖాళీ స్థలాలకు 0.20 శాతం వంతున పన్ను విధిస్తున్నారు. ఈ నెల 1 నుంచి 15 శాతం పన్ను నాలుగోసారి పెరిగింది. జిల్లాలోని ఓ నగర, నాలుగు పురపాలిక సంస్థల ప్రజల మీద సుమారు రూ.5.80 కోట్ల భారం అదనంగా పడనుంది.

తాజాగా రూ.31 కోట్ల పన్నులు వసూలు

ప్రస్తుతం జిల్లాలోని ఓ నగర, నాలుగు పురపాలిక సంస్థల నుంచి రూ.38.85 కోట్ల పన్ను వసూలు లక్ష్యం ఉండగా, ఏప్రిల్‌ 1 నుంచి ఆ లక్ష్యం రూ.44.65 కోట్లుగా మారింది. అంటే రూ.5.80 కోట్లు పెరిగింది. ఈ భారం ఇక పట్టణ ప్రజలు మోయక తప్పదు. మార్చి నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే, వడ్డీ మాఫీ అవుతుందని ఆయా మున్సిపాలిటీల అధికారులు రూ.38.85 కోట్ల వసూళ్ల లక్ష్యంలో రూ.31 కోట్లు వసూలు చేశారు. ఒక్క చిత్తూరు మున్సిపాలిటీ నుంచే అత్యధికంగా రూ.18.57 కోట్లను రాబట్టారు.

అప్పట్లో ఐదేళ్లకోసారి.. ఇప్పుడు ఏటా..

పాత పద్ధతిలో ఐదేళ్లకోసారి ఆస్తి పన్ను సవరించాలన్న నిబంధన ఉన్నా అది అమలయ్యేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో ఇళ్లకు, 2007లో వాణిజ్య భవనాలకు సవరించారు. వైసీపీ ప్రభుత్వం ఏటా 15 శాతం ఆస్తి పన్ను పెంచేందుకు ఉత్తర్వులు ఇవ్వడం, స్థానిక సంస్థలు ఆమోదముద్ర వేయడంతో ప్రజల మీద భారం పడుతోంది. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని తీసుకొచ్చి అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన విధానంతో ఏటా పన్ను పెరుగుతూ వస్తోంది. ఈ నెల నుంచి పెంపునకు ఇప్పటికే అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. మొదటి ఆరు నెలలకు సంబంధించిన డిమాండ్‌ నోటీసుల జారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో భవన యజమానులు గగ్గోలు పెడుతున్నారు. దీని కారణంగా అద్దెలు కూడా పెంచాల్సి వస్తోంది. పట్టణాల్లో అద్దెకు ఉంటున్నవారి మీద కూడా పరోక్షంగా భారం పడుతోంది. దీనికితోడు రిజిస్ట్రేషన్‌ వాల్యూ, ఫీజులను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతున్న నేపథ్యంలో.. వాల్యూతో సంబంధమున్న ఆస్తి పన్ను కూడా ఇక నుంచి క్రమంగా పెరుగుతూ ఉంటుంది.

Updated Date - Apr 06 , 2024 | 01:53 AM