Share News

ఓటరు జాబితాలో మీ పేరుందా?

ABN , Publish Date - Mar 26 , 2024 | 02:05 AM

సార్వత్రిక ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ఓటరు జాబితాలో పేరుందో... లేదో చూసుకోవాలి. జనవరిలో విడుదల చేసిన తుది జాబితాకు అదనంగా ఇటీవల నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లను సైతం చేర్చారు.

ఓటరు జాబితాలో  మీ పేరుందా?

కొత్తగా నమోదుకు ఏప్రిల్‌ 15 వరకు గడువు

చిరునామా మార్పుకైతే అవకాశం లేదు

తిరుపతి(కలెక్టరేట్‌), మార్చి 25: సార్వత్రిక ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ఓటరు జాబితాలో పేరుందో... లేదో చూసుకోవాలి. జనవరిలో విడుదల చేసిన తుది జాబితాకు అదనంగా ఇటీవల నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లను సైతం చేర్చారు. 18 ఏళ్లు నిండినవారు ఏప్రిల్‌ 15వ తదీలోపు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ గడువు ఇచ్చింది. అడ్రస్‌ మార్పునకు(షిప్టింగ్‌)కు అవకాశం లేదు. ఒకవేళ పేరులో తప్పుంటే సరిచేసుకోవచ్చు. జిల్లాలో తుది జాబితా తర్వాత ఇటీవల ప్రకటించిన ఓటర్ల సంఖ్య 17,94,730కు చేరుకుంది. తుది జాబితాను పోలింగ్‌ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పటికీ చాలామంది చూసు కోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జాబితాలో ఓటు ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

కొత్త ఓటరు నమోదు ఇలా

ఓటరు నమోదు అయినప్పటికీ ఎన్నికల రోజున జాబితాలో చాలా మంది తమ పేరు లేదని ఆందోళన చెందుతుంటారు. దాని బదులు ముందుగానే మన పేరు చూసుకోవడం మంచిది. ఒకవేళ పేరు కనిపించకపోతే వెంటనే కొత్తగా ఓటరు నమోదకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతను పరిశీలించి అధికారులు ఓటేసే హక్కు కల్పిస్తారు. గ్రామ, వార్డు సచివాలయం, తహసీల్దారు కార్యాలయంలోని బూత్‌స్థాయి అధికారుల(బీఎల్‌వోల)కు దరఖాస్తులు అందజేయాలి. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ సీఈవో ఆంధ్ర వెబ్‌సైట్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. కొత్త ఓటర్ల నమోదుకు ఏప్రిల్‌ 15వరకు గడువు ఇచ్చింది.

ఓటు హక్కుకు దూరంగా యువత

జిల్లాలో 18-19 ఏళ్ల మధ్య ఉన్నవారు 36,162మంది ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. జనాభా అంచనా ప్రకారం 55వేల మందికి పైగా యువత ఉండగా 18,738మంది ఓటరు నమోదుకు దూరంగా ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని ఏప్రిల్‌ 15లోపు ఓటుహక్కు నమోదు చేసుకోవాలని జిల్లా అధికారులు కోరుతున్నారు. ఏప్రిల్‌ 1 నాటికి 18 ఏళ్లునిండిన వారు కూడా కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీశ కోరారు.

Updated Date - Mar 26 , 2024 | 02:05 AM