Share News

మన ‘స్ట్రాంగ్‌ ’ భద్రమేనా?

ABN , Publish Date - May 31 , 2024 | 01:34 AM

తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్‌ రూములు క్షేత్రస్థాయిలో నలుదిక్కులా పరిశీలిస్తే భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయి.

మన ‘స్ట్రాంగ్‌ ’ భద్రమేనా?
పిట్టగోడకు చేరువలో స్ట్రాంగ్‌ రూమ్‌

తిరుపతి, మే 30(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్‌ రూములు ఏర్పాటుచేసిన తరువాత హింసాత్మక ఘటనలకు వేదికగా మారి రాష్ట్రవ్యాప్తంగా అలజడిని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములు క్షేత్రస్థాయిలో నలుదిక్కులా పరిశీలిస్తే భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయి. ప్రధాన గేటు మినహా మిగిలిన మూడు చోట్ల భద్రత లోపభూయిష్టంగా కన్పిస్తోంది. పిట్టగోడలను తలపిస్తూ ఎగిరి దూకితే స్ట్రాంగ్‌ రూము దగ్గర పడేలా ఉన్నాయి. ఇక్కడ పటిష్టమైన పోలీసు పహారా కూడా లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈనెల 13న ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎం, వీవీప్యాట్‌లను సురక్షితంగా ఉంచేందుకు వర్సిటీలోని ఇంజనీరింగు కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూముకు తరలించారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పిట్టకూడా దూరేందుకు అవకాశం లేకుండా స్ట్రాంగ్‌ రూమ్‌కు భద్రత ఉండాలి. గదికి ఒకే తలుపు ఉండాలి. ఇక్కడికి చేరుకోవడానికి వేరే మార్గం ఉండకూడదు. గదిలో డబుల్‌ లాక్‌ సిస్టమ్‌తో సాయుధ బలగాల పర్యవేక్షణ,. మూడంచెల భద్రత ఉండితీరాలి. 24 గంటలూ సీసీ కెమెరాలు నిఘా తప్పనిసరి. వర్సిటీ మెయిన్‌ గేటు నుంచి దాదాపు కి.మీ దూరంలో స్ట్రాంగ్‌ రూములుంటాయి. ఇక్కడవరకు బాగానే ఉన్నా వర్సిటీ దక్షిణ, పడమర దిశల్లో భద్రత లోపభూయిష్టంగా ఉంది. తుమ్మలగుంట ప్రధాన రహదారి నుంచి చిన్నపాటి పిట్టగోడ దూకితే లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. వంద మీటర్ల దూరంలోనే ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌ కిటికీలు కూడా తెరుచుకుని కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన అధికారులు ప్రధాన గేటు మీద ఫోకస్‌ చేస్తున్నారు తప్ప చుట్టుపక్కల పరిశీలించే పరిస్థితి లేకపోవడంతో భద్రతలో డొల్లతనం కనిపిస్తోంది. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ఇక్కడ ఉండడంతో 4వతేది జిల్లావ్యాప్తంగా పోటీ చేసిన అభ్యర్థులతో పాటు వారి అనుచరగణం ఇక్కడే మోహరించే అవకాశం ఉంది. భద్రత మొత్తం ప్రధాన గేటు వద్ద ఉంటే, ప్రతికూల ఫలితాలు చవిచూసే పార్టీల శ్రేణులు వెనుకవైపు నుంచి చొరబడి హింసాత్మక ఘటనలు సృష్టించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు స్ట్రాంగ్‌ రూముల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవపరం ఎంతైనా ఉంది.

Updated Date - May 31 , 2024 | 01:34 AM