Share News

అక్రమ మైనింగ్‌ అడ్డుకుంటే కేసులా?

ABN , Publish Date - Mar 22 , 2024 | 02:54 AM

అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటే తమపైనే కేసులు పెడతారా.. అని చౌడేపల్లె మండల టీడీపీ అధ్యక్షుడు గువ్వల రమే్‌షరెడ్డి ప్రశ్నించారు.

అక్రమ మైనింగ్‌ అడ్డుకుంటే కేసులా?
గుంతలమయమైన అమినిగుంట చెరువు- టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న పోలీసులు

చౌడేపల్లె టీడీపీ మండలాధ్యక్షుడి ఆవేదన

చౌడేపల్లె, మార్చి 21: అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటే తమపైనే కేసులు పెడతారా.. అని చౌడేపల్లె మండల టీడీపీ అధ్యక్షుడు గువ్వల రమే్‌షరెడ్డి ప్రశ్నించారు. చౌడేపల్లె పోలీ్‌సస్టేషన్‌ వద్ద గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలంలోని అమినిగుంట చెరువులో వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి మట్టిని అక్రమంగా ఎక్స్‌కవేటర్‌, మూడు టిప్పర్లతో తరలిస్తుంటే గురువారం సాయంత్రం తాము అక్కడికి వెళ్లి అడ్డుకుని.. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ఇంతలా తవ్వేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఇలాచేస్తే భూగర్భ జలాలు అడుగంటి పోతాయి కదా అని శాంతియుతంగా ప్రశ్నించామన్నారు. ఇంతలో సంఘటనా స్థలానికి వచ్చిన పుంగనూరు రూరల్‌ సీఐ కృష్ణారెడ్డి తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అలాగే తమపై కేసులు పెట్టారన్నారు. పైగా ఫేక్‌ అనుమతి పత్రాలను చూపి.. 30 అడుగుల లోతువరకు చెరువును తవ్వేసిన వారిని వదిలి.. తమను పోలీ్‌సస్టేషన్‌లో మూడున్నర గంటలపాటు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌ విచారణ చేసి, చెరువుల ఉనికిని కాపాడాలని కోరారు.

ఆరుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు: ఎ్‌సఐ

ఆరుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డి తెలిపారు. గురువారం అమినిగుంట చెరువులో ఓ రైతుకు వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి మట్టిని తోలుతుంటే టీడీపీ మండలాధ్యక్షుడు గువ్వల రమే్‌షరెడ్డి, పార్టీ నాయకులు గిరిరాజు, పరమేశం, ఆది, పృథ్వి, ప్రకాష్‌ వచ్చి అడ్డుకున్నారన్నారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా వారిని అదుపులో తీసుకుని సెక్షన్‌ 151 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై స్టేషన్‌బెయిల్‌ ఇచ్చి పంపినట్లు పేర్కొన్నారు. మట్టిని తోలుతున్నవారు అనుమతి పత్రాలు చూపించారన్నారు. అందులో ఇరిగేషన్‌ అధికారుల నుంచి 1,500 క్యూబిక్‌ మీటర్ల మట్టి తోలుకునేందుకు అనుమతి ఉందని తెలిపారు.

అనుమతులు ఉన్నాయి: వైస్‌ ఎంపీపీ

మట్టి తోలుకోవడానికి ఇరిగేషన్‌ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయని వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. రైతు నున్న భాస్కర్‌ పొలానికి మట్టిని తోలుకునేందుకు ఇరిగేషన్‌ శాఖ అధికారులకు చలాన్‌కట్టి అనుమతి తీసుకున్నారన్నారు. తాము ఎక్స్‌కవేటర్‌, టిప్పర్లు అద్దెకు ఇచ్చామని పేర్కొన్నారు. ఈవిషయంపై ఇరిగేషన్‌ శాఖ డీఈ గిరిని వివరణ కోరగా.. తాము 1500క్యూబిక్‌ మీటర్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - Mar 22 , 2024 | 02:54 AM