Share News

అంగన్‌వాడీ వర్కర్ల వినూత్న నిరసన

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:04 AM

జిల్లాలో అంగన్‌వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె మంగళవారం 21వ రోజుకు చేరుకుంది.

 అంగన్‌వాడీ వర్కర్ల వినూత్న నిరసన
చంద్రగిరిలో దున్నపోతుకు వినతిపత్రం

తిరుపతి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంగన్‌వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె మంగళవారం 21వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినూత్న రీతిలో ప్రభుత్వానికి నిరసనలు తెలిపారు.తిరుపతి నగరం సహా చంద్రగిరి, పుత్తూరు, సత్యవేడు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి పట్టణాలు, కోట మండల కేంద్రంలో అంగన్‌వాడీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం దున్నపోతు చందంగా వ్యవహరిస్తోందన్న అర్ధం వచ్చేలా తిరుపతి, చంద్రగిరి, గూడూరు, సూళ్ళూరుపేట, పుత్తూరు, సత్యవేడు తదితర పట్టణాల్లో ఉద్యోగులు దున్నపోతులకు, బర్రెలకు వినతి పత్రాలు అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కాగా కోట మండల కేంద్రంలో ఉద్యోగులు పొర్లు దండాలు పెట్టి నిరసన తెలియజేయగా నాయుడుపేటలో సోది చెప్పి, వెంకటగిరిలో అంబేడ్కర్‌ చిత్ర పటానికి వినతులు అందజేసి ఉద్యోగులు తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 01:04 AM