Share News

చిత్తూరు అసెంబ్లీ సీటుకు టీడీపీలో పెరిగిన పోటీ

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:37 AM

రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వేగవంతంగా మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో చిత్తూరు అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నవారి సంఖ్య టీడీపీలో పెరిగింది.

చిత్తూరు అసెంబ్లీ సీటుకు టీడీపీలో పెరిగిన పోటీ

ఫ గురజాల జగన్మోహన్‌కు మెరుగైన అవకాశాలు?

చిత్తూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వేగవంతంగా మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో చిత్తూరు అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నవారి సంఖ్య టీడీపీలో పెరిగింది. వైసీపీలో సిటింగ్‌ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును కాదని విజయానందరెడ్డి పేరు ఖరారైన తర్వాత టీడీపీలో జోష్‌ మరింత పెరిగింది. ఎర్రచందనం స్మగ్లర్‌ అనే ముద్ర బలంగా ఉండడం, సిటింగ్‌ ఎమ్మెల్యే సామాజికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉండడం వంటి కారణాలతో గెలుపు ధీమాతో టీడీపీ ఉంది. ఇది ఆశావహుల మధ్య పోటీని పెంచింది. అయితే టికెట్‌ ఎవరికి ఇచ్చినా ఐక్యంగా ఉండి సహకరించాలనే ఒప్పందంతో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆరుగురు ఆశావహులతో బృందాన్ని ఏర్పాటుచేసి ఈనెల 21 నుంచి ఇంటింటి ప్రచారం కూడా ప్రారంభించారు.

చిత్తూరు నుంచి టీడీపీ టికెట్‌ ఆశిస్తున్న వారిలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గీర్వాణి భర్త చంద్రప్రకాష్‌, మాజీ మేయర్‌ హేమలత, జీజేఎం ట్రస్టు చైర్మన్‌ గురజాల జగన్మోహన్‌ నాయుడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి తొలుత ప్రధానంగా వినిపించిన పేరు డీకే ఆదికేశవుల నాయుడి కుమారుడు డీఏ శ్రీనివాస్‌. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని ఈయన ప్రకటించి, జనవరి 1న స్వగృహంలో విందు కూడా ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఆయన ఏ పార్టీ నుంచి అనేది తేల్చుకోలేదు. అటు వైసీపీ, ఇటు టీడీపీ నాయకులను కలిసిన తర్వాత ఆయన పోటీకి అంతగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఇక, తిరుచానూరు మాజీ సర్పంచి సీఆర్‌ రాజన్‌ పేరు కూడా వినిపించింది. వన్యకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఆయనకు అవకాశం ఇస్తే చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో అధికంగా ఉన్న ఆ వర్గం ఓట్లు టీడీపీకి అనుకూలమవుతాయని అంచనా. అయితే నాన్‌ లోకల్‌ అనే ఫీలింగ్‌ తెరపైకి వస్తుందని అధిష్ఠానం ఇతడి విషయంగా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. చిత్తూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కాజూరు బాలాజీ కూడా చిత్తూరు అభ్యర్థిత్వం ఆశిస్తూ ఉన్నా టీడీపీ అధిష్ఠానం మొగ్గు గురజాల జగన్మోహన్‌పై ఉన్నట్టు ప్రచారం అవుతోంది.

దీటైన అభ్యర్థిగా గురజాల

నియోజకవర్గంలో విపరీతంగా ఖర్చు చేస్తున్న విజయానందరెడ్డిని ఢీకొనే ఆర్థిక స్తోమత ఉండడం, అదే స్థాయిలో జనాల్లోకి వెళ్లగలగడం గురజాల అనుకూలాంశాలు అంటున్నారు. చిరు వ్యాపారులకు వందల సంఖ్యలో తోపుడు బండ్లు ఉచితంగా ఇవ్వడం, ఇబ్బందులున్న వారికి ఆర్థిక సాయం చేయడం, శ్మశాన వాటికకు బర్నింగ్‌ మిషన్‌ వితరణ చేయడం, నియోజకవర్గంలోని 50 వేల కుటుంబాలకు సంక్రాంతి కానుకలు పంచడం వంటి సేవా కార్యక్రమాలతో తక్కువ సమయంలోనే ఈయన చిత్తూరు నగరంలో జనానికి దగ్గరయ్యారు. రకరకాల సర్వేలు, సమాచారం తెప్పించుకున్న తర్వాత పార్టీ అధినేత ఈయన పట్ల సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే సీట్లవారీగా పొత్తులు ఖరారైన తర్వాత గానీ అధికారికంగా ఎవరు టీడీపీ అభ్యర్థి తేలే అవకాశాలు లేవు.

ఎంపీ సీటు కోసం నటుడు సప్తగిరి ప్రయత్నాలు

సినీ నటుడు సప్తగిరి పేరు చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన పూతలపట్టు ఎమ్మెల్యే టికెట్‌ కోసం కూడా ప్రయత్నాలు చేశారు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండదండలు ఈయనకు ఉన్నాయంటున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే టికెట్‌ జర్నలిస్టు మురళీమోహన్‌కు ఖరారైనందున సప్తగిరికి చిత్తూరు ఎంపీ సీటు ఇస్తారని అంటున్నారు. సప్తగిరితోపాటు రక్షణ శాఖలో ఎస్పీ హోదాలో రిటైరైన చిన్నస్వామి (జీడీనెల్లూరు నియోజకవర్గం) కూడా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం అవుతోంది. చిత్తూరు ఎంపీ స్థానం కుప్పం మెజార్టీ కారణంగా నిత్యం టీడీపీనే దక్కించుకునేది. 2019 ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ మాత్రమే టీడీపీకి దక్కడంతో చిత్తూరు ఎంపీ స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి చిత్తూరు ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటామనే ధీమా పార్టీలో బలంగా ఉంది.

Updated Date - Jan 30 , 2024 | 01:37 AM