Share News

విద్య, వైద్య కేంద్రంలో ..ఇదీ ఓటరు తీరు

ABN , Publish Date - May 26 , 2024 | 02:15 AM

ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి అన్న చందంగా మారింది తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం.

 విద్య, వైద్య కేంద్రంలో ..ఇదీ ఓటరు తీరు

తిరుపతి, మే 25 (ఆంధ్రజ్యోతి): ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి అన్న చందంగా మారింది తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం. ఈనెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ నియోజకవర్గంలోనే అత్యల్పంగా పోలింగ్‌ జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్‌ నమోదు కాగా తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్‌ నమోదైంది. విద్యావంతులు, ఉద్యోగులు అధికంగా వున్న ఈ నియోజకవర్గంలో ఓటరు తీరును ఇది ప్రతిబింబిస్తోంది.నిజానికి తిరుపతి ఇతర నగరాలతో పోల్చదగింది కాదు. ఎస్వీయూ, పద్మావతీ, వెటర్నరీ, వేదిక్‌ తదితర వర్శిటీలు, ఎస్వీ, పద్మావతీ మెడికల్‌ కళాశాలలు, ఆయుర్వేదిక్‌ కళాశాల, అగ్రికల్చర్‌ కాలేజీ సహా పలు ఉన్నత విద్యా సంస్థలు, స్విమ్స్‌, బర్డ్‌, రుయా, టాటా క్యాన్సర్‌, అరవింద్‌ కంటి ఆస్పత్రి వంటి ఉన్నత వైద్య సంస్థలు, ఇతర ప్రైవేటు విద్యా, వైద్య కేంద్రాలు తిరుపతిని ప్రముఖ విద్యావైద్య కేంద్రంగా మార్చేశాయి. దీనికి తోడు టీటీడీ, కలెక్టరేట్‌, ఇతర ప్రభుత్వ విభాగాలు తోడు కావడంతో విద్యావంతులే కాకుండా ఉద్యోగులు కూడా అత్యధికంగా వున్నారు. మేధావుల సంఖ్యా తక్కువేం కాదు. వేదాంత, సంగీత, సాహిత్య, విద్య, వైద్య రంగాల్లో పేరుమోసిన వారూ అనేక మంది వున్నారు. అయినా రాష్ట్రంలోనే అత్యల్పంగా ఓటింగ్‌ శాతం నమోదు కావడం ఇక్కడి ఓటరు చైతన్య స్థాయిని చెప్పకనే చెబుతోంది. ఏ రాజకీయ పక్షానికి మద్దతుగా నిలుస్తారనే దానితో నిమిత్తం కాకుండా ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికైన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని సామాజిక బాధ్యతను చాటుకోవాల్సిన పై రంగాలకు చెందిన వారే ఓటింగ్‌కు దూరం కావడం గమనార్హం. తిరుపతి కంటే పెద్ద నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో కూడా పోలింగ్‌ ఇక్కడి కంటే కాస్తంత ఎక్కువగా నమోదు కావడం గమనించాల్సి వుంది. ఈ నేపధ్యంలో తిరుపతి నగర ఓటరు చైతన్య రాహిత్యం, బాధ్యతా రాహిత్యం విమర్శలకు తావిస్తోంది.

ఐదు చోట్ల పురుషుల పోలింగ్‌ అధికం

గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో పురుషుల ఓటింగ్‌ శాతం మహిళల కంటే అధికంగా నమోదైంది. సత్యవేడులో పురుష ఓటర్లు 86.08 శాతం ఓటు వేయగా మహిళా ఓటర్లు 84.54 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీకాళహస్తిలో మగ ఓటర్లు 84.17 శాతం మంది పోలింగ్‌లో పాల్గొనగా మహిళా ఓటర్లు 82.40 శాతం మంది ఓటింగ్‌కు హాజరయ్యారు. సూళ్ళూరుపేటలో 84.15 శాతం మంది పురుష ఓటర్లు ఓటు వేయగా 81.77 శాతం మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెంకటగిరిలో పురుష ఓటర్లు 82.26 శాతం ఓటు వేయగా మహిళా ఓటర్లు 79.54 శాతం మంది ఓటు వేశారు. గూడూరులో మగ ఓటర్లు 80.17 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా మహిళా ఓటర్లు 77.68 శాతం మంది ఓటు వేశారు.

చంద్రగిరి, తిరుపతిల్లో మహిళల పోలింగ్‌ అధికం

చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో మహిళల పోలింగ్‌ శాతం పురుషుల కంటే అధికంగా నమోదైంది. చంద్రగిరి నియోజకవర్గంలో మహిళల ఓటింగ్‌ శాతం 79.94 కాగా పురుషుల ఓటింగ్‌ శాతం 79.85గా నమోదైంది.తిరుపతిలో మహిళల పోలింగ్‌ 63.92 శాతం నమోదైతే పురుషుల పోలింగ్‌ 62.73 శాతం నమోదైంది.

Updated Date - May 26 , 2024 | 02:15 AM