వెలుగులీనుతున్న తిరుచానూరు
ABN , Publish Date - Nov 25 , 2024 | 01:58 AM
విద్యుద్దీప కాంతుల్లో తిరుచానూరు వెలిగిపోతోంది. గురువారం నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఆలయం, తిరుమాడవీధులు, పుష్కరిణి, గాలిగోపురం, ఉద్యానవనం తదితర ప్రాంతాలు ఆదివారం రాత్రి విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేస్తున్నాయి.
విద్యుద్దీప కాంతుల్లో తిరుచానూరు వెలిగిపోతోంది. గురువారం నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఆలయం, తిరుమాడవీధులు, పుష్కరిణి, గాలిగోపురం, ఉద్యానవనం తదితర ప్రాంతాలు ఆదివారం రాత్రి విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేస్తున్నాయి. ఇక, రంగవల్లులతో మాడవీధులను తీర్చిదిద్దారు. ఉద్యానవనంలో చలువ పందిళ్లు వేస్తున్నారు. ఫ్రైడే గార్డెన్‌లో ఫల, పుష్ప ప్రదర్శనను తీర్చిదిద్దుతున్నారు. సోమవారం నాటికి ఏర్పాట్లు పూర్తవుతాయని టీటీడీ అధికారులు అంటున్నారు. గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసే వచ్చే నెల 8వ తేది వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఫ ఎల్లుండి లక్ష కుంకుమార్చన
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఈ సందర్భంగా ఆరిజత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. గృహస్తులు (ఇద్దరు) రూ.1,116 చెల్లించి టికెట్ కొని ఈ సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్ద కౌంటర్‌లో కరెంట్ బుకింగ్‌లో ఈ టికెట్లు పొందవచ్చు. అదే రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షాబంధనం, నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం, అనంతరం అంకురార్పణ నిర్వహిస్తారు.
- తిరుచానూరు, ఆంధ్రజ్యోతి