Share News

తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటరు కార్డుల అక్రమ డౌన్‌లోడ్‌ వ్యవహారం

ABN , Publish Date - Apr 09 , 2024 | 12:30 AM

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటరు కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసిన వ్యవహారంలో సస్పెన్షన్‌కి గురైన నాటి తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరీషపై ఈసీ సస్పెన్షన్‌ ఎత్తివేసింది.

తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటరు కార్డుల అక్రమ డౌన్‌లోడ్‌ వ్యవహారం
గిరీష

ప్రాథమిక నిర్ధారణ వల్లే గతంలో వేటు

లోతుగా విచారించాక ఉత్తర్వుల ఉపసంహరణ

అధికారి నిర్లక్ష్యాన్ని అవకాశంగా తీసుకున్న అధికార పార్టీ నేతలు

తిరుపతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటరు కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసిన వ్యవహారంలో సస్పెన్షన్‌కి గురైన నాటి తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరీషపై ఈసీ సస్పెన్షన్‌ ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో తొలుత గిరీష సస్పెన్షన్‌ కూడా ఐఏఎస్‌ వర్గాల్లో కలకలం రేపింది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేసింది. ఈయన తర్వాత వరుసగా పలువురు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు సైతం సస్పెండైన సంగతి తెలిసిందే. ఓవైపు శాఖాపరమైన విచారణ, మరోవైపు పోలీసు దర్యాప్తు జరుగుతుండగానే గిరీషపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక ఏం జరిగిందన్న దానిపై పలు రకాల అభిప్రాయాలు వినిపిస్తుండగా గిరీష పాత్ర, ప్రమేయం లేదని ఈసీ నిర్ధారణకు వచ్చినందునే ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాల సమాచారం.

ప్రాథమిక నిర్ధారణ మేరకే..

లోక్‌సభ ఉప ఎన్నికల నాటికి మున్సిపల్‌ కమిషనర్‌గా ఉండిన గిరీష, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఈఆర్వోగా వ్యవహరించారు. ఈసీ రికార్డుల్లో ఈఆర్వోగా ఆయన పేరే ఉంది. ఎపిక్‌ కార్డులను భారీ సంఖ్యలో డౌన్‌లోడ్‌ చేయాలంటే ఈఆర్వో లాగిన్‌ నుంచే వీలవుతుంది. ఈ కారణంగా ఆయన ప్రమేయం ఉందని ప్రాథమికంగా భావించిన ఎన్నికల కమిషన్‌ తొలుత ఆయన్ను బాధ్యుడిగా పేర్కొంటూ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ గురించి అవగాహన ఉన్న వారంతా గిరీషనే అధికార పార్టీ నేతలకు సహకరించారన్న అభిప్రాయానికి వచ్చారు.

వాస్తవానికి జరిగిందేమిటంటే..

ఎన్నికల నిబంధనల ప్రకారం షెడ్యూలు విడుదలైతే అప్పటికి సంబంధిత జిల్లాలో మూడేళ్లకు పైబడిన అధికారులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఈ నిబంధన కచ్చితంగా వర్తిస్తుంది. ఆ కోణంలో తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూలు వెలువడే నాటికి గిరీష జిల్లాలో నాలుగేళ్లకు పైబడి పనిచేస్తున్నారు. తొలుత రెండేళ్లపాటు జాయింట్‌ కలెక్టర్‌గా, తర్వాత తిరుపతి కమిషనర్‌గా రెండేళ్లు కలిపి నాలుగేళ్లయింది. అయితే ఆశ్చర్యకరంగా ఆయన జిల్లా నుంచి బదిలీ కాలేదు. ఎన్నికల సమయంలో ఇక్కడే కొనసాగారు. కాకపోతే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఈఆర్వోగా వ్యవహరించడానికి తాను నిబంధనల రీత్యా అనర్హుడినని అప్పటి కలెక్టర్‌కు గిరీష నివేదించారు. కలెక్టర్‌ కూడా ఈసీకి సమాచారమిచ్చారు. ఈఆర్వోగా ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని కలెక్టర్‌కు ఈసీ స్వేచ్ఛ ఇచ్చింది. దాంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తుండిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని ఈఆర్వోగా కలెక్టర్‌ నియమించారు. ఆమేరకు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో గిరీష పేరు, ఆయన మొబైల్‌ నెంబరు తొలగించలేదు. సూటిగా చెప్పాలంటే చంద్రమౌళీశ్వర్‌రెడ్డి అనధికారికంగా ఈఆర్వోగా వ్యవహరించారు. సాంకేతికంగా గిరీష బాధ్యత వహించాల్సి వచ్చింది. కొద్దిరోజులు గడిచాక ఈసీ వెబ్‌సైట్‌లో గిరీష అధికారిక మొబైల్‌ నెంబరు తొలగించి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి నెంబరు నమోదు చేశారు. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్‌ మాత్రమే ఈ మార్పుచేర్పులు చేయగలరు.

చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని ఎడాపెడా

వాడేసుకున్న అధికార పార్టీ నేతలు

వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ తిరుపతి డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తుండిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డికి అధికార పార్టీ నేతలు చెప్పింది తూచా తప్పకుండా చేసిపెడతారన్న పేరుంది. చెప్పింది నిబంధనలకు విరుద్ధమైనా సరే.. మారు మాట్లాడకుండా చేసే ఆయన నైజం గమనించిన అధికార పార్టీ నేతలు.. ఈఆర్వో లాగిన్‌ ఐడీని దుర్వినియోగం చేశారు. ప్రైవేటు కంప్యూటర్‌ ఆపరేటర్లను పెట్టుకుని చంద్రమౌళీశ్వర్‌రెడ్డి లాగిన్‌ పాస్‌వర్డు తీసుకుని 36వేల ఎపిక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేయించారు. ఇవేవీ తెలియని ఎన్నికల కమిషన్‌.. ఈఆర్వో గిరీష కాబట్టి ఆయనే బాధ్యుడిగా సస్పెండ్‌ చేసింది.

సాంకేతిక ఆధారాలతో సంజాయిషీ ఇచ్చిన గిరీష

తిరుపతి ఉప ఎన్నికల నాటికి తాను జిల్లాలో నాలుగేళ్లకు మించి పనిచేస్తుండిన విషయాన్ని ఈసీ దృష్టికి గిరీష తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ విషయమై తాను ఈఆర్వోగా వ్యవహరించడానికి వీల్లేదని నాటి కలెక్టర్‌కు రాసిన లేఖను, కలెక్టర్‌ ఇదే విషయాన్ని ఈసీకి తెలిపిన లేఖను కూడా ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. ఈసీ వెబ్‌సైట్‌లో తన అధికారిక మొబైల్‌ నెంబరు కాకుండా చంద్రమౌళీశ్వర్‌రెడ్డి నెంబరు నమోదైన విషయాన్ని కూడా తెలియజేశారు. వీటికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు సమర్పిస్తూ ఉప ఎన్నికల అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సంజాయిషీ ఇచ్చినట్టు తెలిసింది. అప్పటికే లోతుగా విచారించిన ఈసీ సైతం ఈ సంజాయిషీతో సంతృప్తి చెందినట్టు సమాచారం. అందుకే విచారణను పెండింగులో ఉంచి.. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

దర్జాగా సూత్రధారులు.. సతమతమవుతున్న పాత్రధారులు

ఎపిక్‌ కార్డుల వ్యవహారంలో సూత్రధారులైన అధికార పార్టీ నేతలు దర్జాగా తిరుగుతుండగా.. తెలిసి కొందరు, తెలియక కొందరు పాత్రధారులైన అధికారులు మాత్రం ఈసీ చర్యలకు గురై సతమతమవుతున్నారు. ఈసీ వెబ్‌సైట్‌లో ఈఆర్వోగా నమోదైన పాపానికి యువ ఐఏఎస్‌ అధికారి గిరీష సస్పెన్షన్‌కు గురికావడంతోపాటు కెరీర్‌లోనూ, ఐఏఎస్‌ వర్గాల్లోనూ అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాగే అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఈఆర్వో స్థాయిని దుర్వినియోగం చేసినందుకు డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. భవిష్యత్తులో క్రిమినల్‌ చర్యలు కూడా ఎదుర్కొనే అవకాశముంది. తిరుపతి అర్బన్‌ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లు సైతం చర్యలకు గురైన సంగతి తెలిసిందే. ఇక కంప్యూటర్‌ ఆపరేటర్లు పలువురిని తొలగించారు. మండల, జిల్లా స్థాయి అధికారులు ఈసీ చర్యలకు గురి కావడంతో వారి సర్వీసు రిజిస్టర్లలో అవన్నీ నమోదు కానున్నాయి. విచారణ నుంచి బయటపడితే తప్ప భవిష్యత్తులో పదోన్నతులపై కూడా ప్రభావం చూపనుంది. సహచర అధికార, ఉద్యోగ వర్గాల్లో అవమానం మరోటి. పాత్రధారులు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొంటుంటే.. సూత్రధారులైన అధికార పార్టీ నేతలు దర్జాగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. నోరు తెరిస్తే నీతులు, సూక్తులు చెప్పే తిరుపతి కీలక నేత, ఆయన తనయుడు ఈ ఎపిక్‌ కార్డుల కుంభకోణంలో ప్రఽధాన సూత్రధారులన్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. పోలీసు దర్యాప్తు సక్రమంగా కొనసాగితే సూత్రధారులు నిందితులుగా మారే అవకాశముంది. లేనిపక్షంలో కింది స్థాయి చిరుద్యోగులు బలయ్యే ప్రమాదముంది.

Updated Date - Apr 09 , 2024 | 12:30 AM