Share News

అద్వితీయ విద్యాసంస్థ తిరుపతి ఐఐటీ

ABN , Publish Date - Feb 23 , 2024 | 02:08 AM

ఓవైపు శ్రీవెంకటేశ్వర స్వామి, మరోవైపు శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ఆశీస్సులు పొందుతున్న తిరుపతి ఐఐటీ దేశంలోని మిగిలిన ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే అద్వితీయ విద్యా సంస్థ అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కొనియాడారు.

అద్వితీయ విద్యాసంస్థ తిరుపతి ఐఐటీ
ఐఐటీ స్నాతకోత్సవంలో వర్చువల్‌ పద్ధతిలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ప్రసంగం

  • స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌

ఏర్పేడు, ఫిబ్రవరి 22 : ఓవైపు శ్రీవెంకటేశ్వర స్వామి, మరోవైపు శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ఆశీస్సులు పొందుతున్న తిరుపతి ఐఐటీ దేశంలోని మిగిలిన ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే అద్వితీయ విద్యా సంస్థ అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కొనియాడారు. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు సమీపంలో వున్న తిరుపతి ఐఐటీ 4వ మరియు 5వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన ఢిల్లీ నుంచీ వర్చువల్‌ విధానంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువ విద్యార్థులకు నాణ్యమైన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో మోదీ ప్రభుత్వ నిబద్ధతకు ఐఐటీలే నిదర్శనమన్నారు. ఆరోగ్యకరంగా ఎదిగే ప్రక్రియలో తిరుపతి ఐఐటీ నిస్సందేహంగా ఒక రఽపధాన లబ్ధిదారని మంత్రి అభివర్ణించారు. స్వల్ప వ్యవధిలోనే తిరుపతి ఐఐటీ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ సాధించిందని, అలాగే ఐఐటీ నవవిష్కార్‌, ఐ హబ్‌ ఫౌండేషన్‌ వంటివి ఏర్పాటు చేయడంలో చొరవ చూపిందని ప్రశంసించారు. తిరుపతి ఐఐటీ సెంటర్‌ ఆఫ్‌ ఎగ్జలెన్స్‌ ప్రధానంగా స్మార్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌, ఈవీ టెక్నాలజీస్‌ వంటి అంశాలపై దృష్టి సారించిందని, దేశంలోని పట్టణ రవాణా రంగంలో పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో తిరుపతి ఐఐటీకి చెందిన ఈ విభాగాలు గేమ్‌ ఛేంజర్‌ కాబోతున్నాయన్నారు. స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫుడ్‌ టెక్నాలజీస్‌, ప్రిసెషన్‌ అగ్రికల్చర్‌ రంగాల్లో తిరుపతి ఐఐటీ దృష్టి సారించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.తిరుపతి ఐఐటీ బాలికలు ఎంచుకుంటున్న ప్రధాన గమ్యస్థానంగా మారడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ఇతర ఐఐటీల కంటే ఇక్కడే ఎక్కువ సంఖ్యలో బాలికలు చదువుకుంటున్నారని, ఇది నారీ శక్తికి నిదర్శనమన్నారు. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ అనేది తమ ప్రభుత్వ నిర్ణయమని, లోక్‌సభలోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మూడొంతుల సీట్లు మహిళలకు రిజర్వు చేయడం అందులో భాగమేనన్నారు. నిర్ణయాత్మక శక్తిగా మహిళలను అభివృద్ధి పరచడమే దాని ఉద్దేశమన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంచే దిశగా ఐఐటీల నుంచీ వెలుపలికి వచ్చిన విద్యార్థినులు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా పట్టభద్రులవుతున్న రెండు బ్యాచ్‌ల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి విద్యార్థుల ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ఐఐటీ బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌, మరియు జిందాల్‌ స్టీల్‌ వర్క్స్‌ సంస్థ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అతిధిగా రావడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు ప్రపంచస్థాయికి ఎదగాలని కోరారు. ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ ఐఐటీ పనుల ప్రారంభంలో ఈ ప్రాంతంలో తిరగడానికి భయపడేవారమని గుర్తు చేసుకున్నారు.విద్యార్థులకు సరిపడే కళాశాల భవనాలు, హాస్టల్‌ భవనాలు, లేబరేటరీలు, క్యాంటీన్లు, మీటింగ్‌ హాళ్లు, తరగతిగదులతో ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణం కళాశాలలో ఉందన్నారు.పీఆర్వో చమన్‌ మెహతా, ఎన్‌ఎ్‌సఎ్‌స పోగ్రాం ఆఫీసర్‌ మహేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

575 మందికి పట్టాల ప్రదానం

స్నాతకోత్సవాలను పురస్కరించుకుని క్యాంప్‌సలో మొత్తం 575మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.ఐఐటీ డైరెక్టర్‌ కె.ఎన్‌.సత్యనారాయణతో కలిసి సజ్జన్‌ జిందాల్‌ ఈ పట్టాలను అందజేశారు. బీటెక్‌ పూర్తి చేసిన 355 విద్యార్థులకు, ఎంటెక్‌ పూర్తి చేసిన 106 మంది విద్యార్థులకు, ఎమ్మెస్సీ ముగించిన 74 మందికి, ఎంఎస్‌ పూర్తి చేసిన 17 మందికి, పీహెచ్‌డీ పూర్తి చేసిన 21 మందికి, డ్యూయల్‌ డిగ్రీ చేసిన ఇద్దరికి చొప్పున మొత్తం 575 మందికి పట్టాలు అందజేశారు. 2021-22 బ్యాచ్‌ 4వ స్నాతకోత్సవానికి సంబంధించిన మొత్తం బీటెక్‌ గ్రాడ్యుయేట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సౌమిత్రో వ్యాపారికి ప్రెసిడెంట్‌ గోల్డ్‌ మెడల్‌, లంకిరెడ్డి ప్రభాత్‌రెడ్డికి గవర్నర్‌ ప్రైజ్‌ లభించాయి. అలాగే 2022-23 బ్యాచ్‌ 5వ స్నాతకోత్సవానికి సంబంధించి బీటెక్‌ గ్రాడ్యుయేట్లలో అత్యుత్తమ ప్రతిభ చాటిన దేబాషీ దాస్‌ అనే విద్యార్థిని ప్రెసిడెంట్‌ గోల్డ్‌ మెడల్‌, నోబుల్‌ సాజి మాఽథ్యూ్‌సకు గవర్నర్‌ ప్రైజ్‌ లభించాయి.

Updated Date - Feb 23 , 2024 | 02:08 AM