Share News

కుప్పం నేలపై నడిస్తే అరిగిపోతావా

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:56 AM

కుప్పం నేలపై నడిస్తే అరిగిపోతావని రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేసుకుని తిరిగావంటూ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ చేశారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీ నీవా కాలువను మంగళవారం సాయంత్రం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

కుప్పం నేలపై నడిస్తే అరిగిపోతావా
నీళ్లులేని హంద్రీ నీవా కాలువలో కబడ్డీ ఆడుతున్న టీడీపీ శ్రేణులు

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో హంద్రీ నీవాకు నీళ్లిస్తామని హామీ

రామకుప్పం/వి.కోట, మార్చి 26: కుప్పం నేలపై నడిస్తే అరిగిపోతావని రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేసుకుని తిరిగావంటూ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ చేశారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీ నీవా కాలువను మంగళవారం సాయంత్రం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను సీఎంగా ఉండి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు 90 శాతం చేపట్టి వి.కోట వరకు నీళ్లు తెచ్చా. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయకుండా సినిమా సెట్టింగులతో కుప్పానికి నీళ్లిచామని ప్రజలను మభ్యపెట్టారు. నీతి, నిజాయితీకి మారుపేరైన కుప్పం ప్రజలను నీటి డ్రామాతో మోసగించడానికి మనసెలా వచ్చింది’ అంటూ సీఎంను ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలు కుప్పం ప్రజలు నమ్మరన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కుప్పానికి హంద్రీ, నీవా ద్వారా పూర్తి స్థాయిలో నీరిచ్చి అన్ని చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. ‘నాడు తాను అమలు చేసిన ఇజ్రాయెల్‌ తరహా బిందుసేద్యం ప్రాజెక్టును.. తండ్రి (వైఎస్‌) ఆపేశారు. నేడు కొడుకు (జగన్‌) వచ్చి కుప్పాన్ని సర్వ నాశనం చేయడమే కాకుండా, సంపదను కొల్లగొట్టారు’ అంటూ పోల్చి చెప్పారు. ‘నేను కుప్పం కంటే ముందే పులివెందులకే నీళ్లిచ్చా. అది నీకు.. నాకు ఉన్న తేడా. నీతో పాటు నీ అనుచరవర్గం కుప్పంలో దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తున్నారనడానికి నిదర్శనం గుండిశెట్టిపల్లె సమీపంలోని బసవేశ్వరస్వామి భూములను కొట్టేయాలని చూడటమే. ఇలాంటివి ఎప్పటికీ జరగనివ్వను’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. గుడుపల్లె మండలం యామిగానిపల్లె వద్ద రూ.364 కోట్లతో.. శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద రూ.170 కోట్లతో రిజర్వాయర్ల నిర్మాణానికి పనులు మంజూరు చేశామన్నారు. ఇప్పుడు వీళ్లు మంజూరు చేసినట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా, రాజుపేట వద్ద 15-20 అడుగుల లోతున్న హంద్రీ నీవా కాలువలోకి చంద్రబాబు దిగారు. దిగేటప్పుడు.. మళ్లీ ఎక్కేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది, నాయకులు సాయం అందించేందుకు ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. 74 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా కాలువలోకి దిగి పరిశీలించారు.

Updated Date - Mar 27 , 2024 | 12:56 AM