మంత్రి రోజాకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:03 AM
మంత్రి రోజాకు నగరి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ వైసీపీ నాయకులు అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు.

తిరుపతి(తిలక్‌రోడ్), మార్చి 5: మంత్రి రోజాకు నగరి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ వైసీపీ నాయకులు అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు.తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడమాలపేట జడ్పీటీసీ మురళీధర రెడ్డితో పాటు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు రెడ్డివారి భాస్కర రెడ్డి, ఏలుమలై, రవి, శేఖర్‌రాజు,వాసుదేవరెడ్డి, మునీంద్ర, లక్ష్మీపతిరాజు, శ్రీధర్‌రాజు, సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి ఆస్తులమ్ముకుని కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. తనకు ఐదుగురు అన్నదమ్ములు అని ప్రతి సభలో ఊదరగొట్టిన రోజా ఇపుడు తమనే ఇబ్బందులపాల్జేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన రోజాకు బాసటగా నిలిచామని, ఐరన్‌లెగ్‌గా పేరు పొందిన రోజాను గోల్డెన్‌లెగ్‌గా మార్చి 2014లో ఎమ్మెల్యేని చేశామన్నారు.నగరి నియోజకవర్గాన్ని తన అక్రమార్జనకు అడ్డాగా చేసుకున్న మంత్రి రోజా తమను పక్కకు నెట్టేసిందన్నారు. నగరి ప్రజలు ఆమె పట్ల సానుకూలంగా లేరన్నారు. వైసీపీ అధిష్ఠానం ప్రజాభీష్టంతో పాటు క్యాడర్ విజ్ఞప్తిని మన్నించి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇతరులకు కేటాయిస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. అలాకాదని రోజాకే సీటు కేటాయిస్తే ఓడిస్తామని హెచ్చరించారు. తమపై నిందారోపణలు చేస్తున్న మంత్రి రోజా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.