గీత దాటితే.. వేటే!
ABN , Publish Date - Mar 21 , 2024 | 12:41 AM
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ ప్రతిదీ పర్యవేక్షిస్తోంది. కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటోంది.
ప్రతిదీ పర్యవేక్షిస్తున్న ఎన్నికల కమిషన్
ప్రచారాల్లో పాల్గొంటున్న ఉద్యోగులపై కొనసాగుతున్న సస్పెన్షన్లు
వలంటీర్లయితే విధుల నుంచి తొలగింపు
చిత్తూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ ప్రతిదీ పర్యవేక్షిస్తోంది. కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటోంది. ప్రచారంలో పాల్గొంటున్న ఉద్యోగులను సస్పెండు చేస్తుండగా.. వలంటీర్లనైతే విధుల నుంచి తొలగిస్తోంది. ఏ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసినా తమపై కమిషన్ సీరియస్ అవుతుందని అధికారులు కూడా రిస్క్ తీసుకోవడం లేదు. ఇప్పటికే అధికార పార్టీ తరపున పనిచేస్తున్న గుడుపల్లె మండలం చీకటిపల్లె ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, కుప్పం మండలానికి చెందిన టెక్నికల్ అసిస్టెంట్ మురుగేష్, తాజాగా చౌడేపల్లె మండలం బోయకొండ ఆలయంలో కాంట్రాక్టు ఉద్యోగి శంకరను సస్పెండు చేశారు. ఇక, సోమలలో టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారని ఏఎన్‌ఎమ్ (రెగ్యులర్ ఉద్యోగి) లతను కలెక్టర్ సస్పెండ్ చేశారు. పులిచెర్ల మండలం దిగువపోకలవారిపల్లె ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రసాద్ ప్రచారంలో పాల్గొంటున్నారన్న టీడీపీ నాయకుల ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఇక, చిత్తూరు కార్పొరేషన్లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12, గుడిపాలలో ముగ్గురు, పులిచెర్లలో ఇద్దరు, తాజాగా పులిచెర్ల, కార్వేటినగరం మండలాల్లో ఒకొక్కరు చొప్పున, గుడుపల్లెలో ఇద్దరేసి వంతున మొత్తం 39 మంది వలంటీర్లను విధుల నుంచి తొలగించారు. తొలగించిన వలంటీర్లలో ఒకరు పాత తేదీ వేసి తెలివిగా రాజీనామా పత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందించారు. వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మళ్లీ జగన్‌ను గెలిపించుకోవాలని రాజీనామాలో ఉంది. అంటే, వలంటీర్లు ఉద్యోగం పోయినా సరే వైసీపీ ప్రచారాన్ని మాత్రం ఆపడంలేదని తెలుస్తోంది. దీనివెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఏమేరకు ఉందో తెలుస్తోంది. ఇక, పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫొటోలతో రైటింగ్ ప్యాడ్లు పంపిణీపై ఎమ్మెల్యే వెంకటేగౌడను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కోడ్ ఉల్లంఘన జరిగిందంటూ గుర్తు తెలియని వ్యక్తులపై వి.కోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఎన్నికల కమిషన్ సీరియ్‌సగా స్పందిస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులు జాగ్రత్తగా లేకుంటే వారి ఉద్యోగ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈసీ విషయంలో రాజకీయ పార్టీలు చేసేదేమీ ఉండదని గుర్తుంచుకోవాలి.
చర్యలు కఠినంగా ఉంటాయి
రెగ్యులర్ ఉద్యోగులే కాదు.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సహా వలంటీర్లు కూడా ఎన్నికల నియామావళిని కచ్చితంగా అనుసరించాల్సిందే. ఏ మాత్రం గీత దాటితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఎన్నికల కమిషన్ ప్రతి అంశాన్నీ పర్యవేక్షిస్తోంది.
- షన్మోహన్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్