Share News

మానవత్వమే శాపమైంది!

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:53 AM

రోడ్డు ప్రమాదం బారిన పడిన వారిని ఆదుకుందామనుకోవడమే ఆ దంపతుల పాలిట శాపమైంది.పోలీసు వాహనం ఢీకొట్టి భార్య దుర్మరణం పాలవగా భర్త చేయి విరగ్గొట్టుకుని ఆస్పత్రిలో చేరాల్సివచ్చింది. ప్రమాదానికి కారణమైన ఎస్‌ఐ వాహనం కనీస బాధ్యత మరచి అక్కడినుంచి పారిపోవడం పట్ల తీవ్ర విమర్శలు రేగాయి.

మానవత్వమే శాపమైంది!
ఎస్‌ఐ వాహనం ఢీకొని గాయపడ్డ కిరణ్‌కుమార్‌ - చనిపోయిన స్వప్న(పాతచిత్రం)

ఓ పాఠశాల కరస్పాండెంట్‌ దుర్మరణం

ఏర్పేడు ఎస్‌ఐ తీరుపై దుమారం

శ్రీకాళహస్తి, జూన్‌ 10: రోడ్డు ప్రమాదం బారిన పడిన వారిని ఆదుకుందామనుకోవడమే ఆ దంపతుల పాలిట శాపమైంది.పోలీసు వాహనం ఢీకొట్టి భార్య దుర్మరణం పాలవగా భర్త చేయి విరగ్గొట్టుకుని ఆస్పత్రిలో చేరాల్సివచ్చింది.ప్రమాదానికి కారణమైన ఎస్‌ఐ వాహనం కనీస బాధ్యత మరచి అక్కడినుంచి పారిపోవడం పట్ల తీవ్ర విమర్శలు రేగాయి.శ్రీకాళహస్తి మండలం సూరావారిపల్లికి చెందిన చెంచుబాబు, అదే గ్రామం దళితవాడకు చెందిన మంగయ్య(50) సొంత పనుల నిమిత్తం ఆదివారం రాత్రి కారులో వెంకటగిరికి బయల్దేరారు.ఎంపేడు వద్ద ఏర్పేడు - వెంకటగిరి రహదారిపై కారు అదుపు తప్పి పక్కన కల్వర్టును ఢీకొనడంతో కారు నడుపుతున్న చెంచుబాబు స్వల్పంగా గాయపడ్డాడు. వెనుక సీటులో కూర్చున్న మంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి మంగయ్య మృతదేహాన్ని కారు నుంచి వెలుపలకు తీసి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి నగరం భవానీనగర్‌కు చెందిన న్యాయవాది కిరణ్‌కుమార్‌,ఆయన సతీమణి స్వప్న(42) వెంకటగిరి వెళ్లి తిరిగివస్తూ ఈ ప్రమాదాన్ని గమనించారు.తిరుపతి నగర శివారులోని తనపల్లిలో పాఠశాలను నడుపుతున్న స్వప్న పాఠశాలకు అవసర మైన బెంచీలు వెంకటగిరిలో అమ్మకానికి ఉండటంతో కారులో అక్కడికి భర్తతో కలిసి వెళ్లారు.తిరుపతికి తిరిగి వస్తుండగా ఎంపేడు వద్ద రోడ్డుపై ఒకరు విగతజీవిగా పడి ఉండడం, చుట్టూ కొందరు జనాలు ఉండటం గుర్తించి కారు ఆపి కిందకు దిగారు.క్షతగాత్రులకు సాయం అవసరం వుందేమో అనుకుని అక్కడికి వెళ్లారు.వెంకటగిరిలో ఎస్‌ఐగా పనిచేసిన జిలానీ ఇటీవల ఏర్పేడుకు బదిలీ అయ్యారు.వెంకటగిరిలోనే ఉంటూ ఏర్పేడుకు రోజూ వచ్చిపోయే వాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎస్‌ఐ జిలానీ బొలేరో కారులో ఏర్పేడు నుంచి వెంకటగిరికి బయల్దేరాడు.ఎంపేడు వద్ద రోడ్డు ప్రమాదాన్ని, గుమికూడిన మనుషులను గమనించకుండా బొలేరో దూసుకెళ్లిన క్రమంలో స్వప్న రోడ్డుపై కొంతదూరం ఎగిరిపడింది. అలాగే ఆ కారు ఢీకొని ఆమె భర్త కూడా గాయపడ్డాడు. శ్రీకాళహస్తి మండలం గంగలపూడి దళితవాడకు చెందిన యువకుడు సురేష్‌ అటు వెళుతూ ఈ ఘటనను చూశాడు. దంపతులను ఢీకొన్న వాహనం కొంతదూరం ముందుకు వెళ్లి ఆగింది. అయితే అందులో నుంచి ఎవరూ దిగలేదు. అనంతరం స్పందించిన సురేష్‌ హుటాహుటిన దంపతులను వారి కారులోనే ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన ఎస్‌ఐ వాహనం అక్కడి నుంచి వేగంగా ముందుకు సాగిపోయింది. సురేష్‌ క్షతగాత్రులైన దంపతుల కారులోనే వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. కొంతదూరం ముందుకు వెళ్లిన తరువాత ప్రమాదానికి కారణమైన పోలీసు వాహనం వేగంగా వెళ్లడాన్ని వీడియో తీశాడు. ఆ వాహనంలోని నెంబరు ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అనంతరం దంపతులను వెంకటగిరి ఆస్పత్రిలో చేర్పించాడు. పరీక్షించిన వైద్యులు స్వప్న అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుడిచెయ్యి విరిగిన కిరణ్‌కుమార్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి సురేష్‌ తరలించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్‌ పోలీసులు మంగయ్య మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కల్వర్టును కారు ఢీకొన్న ప్రమాదంపై మొదట కేసు నమోదు చేశారు. అనంతరం సోమవారం ఉదయం చికిత్స అనంతరం కిరణ్‌కుమార్‌ శ్రీకాళహస్తి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేశారు. వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.

ఇదేం అమానుషం?

పోలీసు వాహనం కారణంగా జరిగిన ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందడం స్థానికంగా కొందరు చూశారు. ఘటన జరిగిన దగ్గర ఒక కంటైనర్‌ ఫాం హౌస్‌ ఉంది. అందులో రోడ్డుపై దృశ్యాలను నిక్షిప్తం చేసేలా రెండు సీసీ కెమెరాలున్నాయి.వెంకటగిరిలో కోడిపందేలు, పలు అసాంఘిక కార్యకలాపాల్లో ఎస్‌ఐ జిలానీ తలదూర్చినట్లు చాలాకాలంగా ఆరోపణలున్నాయి. ఇలాంటి కారణాలతోనే కొద్ది నెలల క్రితం ఏర్పేడుకు ఆయన బదిలీ అయ్యారు. ఆదివారం రాత్రి రోడ్డుపై ప్రమాదాన్ని చూశాక ఆగి సాయం చేయాల్సిన బాధ్యత ఎస్‌ఐపై ఉంది. కానీ కనీసం గమనించకుండా మనుషులపై వాహనం దూసుకెళ్లింది. కొంతదూరంముందుకు వెళ్లి ఆగిన వాహనం ముందుకు వేగంగా వెళ్లిపోవడాన్ని అందరూ గమనించారు.అయితే పోలీసు శాఖలోని కొందరు అధికారులు ఈ ఘటనకు మసిపూసే ప్రయత్నం ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం వరకు రోడ్డు ప్రమాదం బయటకు పొక్కకుండా విఫలయత్నం చేశారు. ఆ తరువాత చేసేదేమీ లేక కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసు వాహనం నెంబరుతో మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అంతటితో ఆగకుండా ఎస్‌ఐ జిలానీ వాహనం ఢీకొన్న ఘటన నిజమేనని దంపతులు రోడ్డు దాటుతుండగా జరిగిందని... ఎస్‌ఐ జిలానీయే వారిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని వైద్యశాలకు తరలించి కాపాడే ప్రయత్నం చేశాడని శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ అజయ్‌కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేయడం విమర్శలపాలైంది.

శభాష్‌ సురేష్‌

ప్రమాదం పట్ల సురేష్‌ స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. రోడ్డుపై ఘటన చూసిన వెంటనే హుటాహుటిన దంపతులను వారి కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు.పోలీసు వాహనం నెంబరును గుర్తు పెట్టుకున్నాడు. ఆ వాహనం ముందు వెళుతుండగా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతోనే ఎస్‌ఐ దురాగతం వెలుగులోకి వచ్చింది. సురేష్‌ అంతటితో ఆగకుండా మృతురాలి కుటుంబానికి అండగా నిలిచాడు. పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బందువులు తీసుకునే వరకు వారి వెంటే ఉండి సాయం చేశాడు.

Updated Date - Jun 11 , 2024 | 01:53 AM