Share News

హైస్కూల్‌ ప్లస్‌ కాదు.. మైనస్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:06 AM

‘హైస్కూల్‌ ప్లస్‌’ అన్నారు. ఉన్నత పాఠశాలల్లోనే జూనియర్‌ కళాశాలలను ప్రారంభించారు. దీనిని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులుగా చెప్పుకొన్నారు. బోధకుల నుంచి సౌకర్యాల కల్పన వరకు నిర్లక్ష్యం చూపారు. ఫలితం చాలా వాటిల్లో అడ్మిషన్లే జరగలేదు. తాజా ఇంటర్‌ ఫలితాల్లో ఈ ఉన్నత పాఠశాలలు అట్టడుగున నిలిచాయి. ‘హైస్కూల్‌ ప్లస్‌ కాదు.. మైన్‌స’గా మారాయి.

హైస్కూల్‌ ప్లస్‌ కాదు.. మైనస్‌
వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో హైస్కూల్‌ ప్లస్‌ ఏర్పాటు చేసిన ఉన్నత పాఠశాల

ఇంటర్‌ ఫలితాల్లో అట్టడుగున

పలుచోట్ల సున్నా శాతం ఉత్తీర్ణత

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెండేళ్లకే తుస్సుమన్న వైనం

‘హైస్కూల్‌ ప్లస్‌’ అన్నారు. ఉన్నత పాఠశాలల్లోనే జూనియర్‌ కళాశాలలను ప్రారంభించారు. దీనిని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులుగా చెప్పుకొన్నారు. బోధకుల నుంచి సౌకర్యాల కల్పన వరకు నిర్లక్ష్యం చూపారు. ఫలితం చాలా వాటిల్లో అడ్మిషన్లే జరగలేదు. తాజా ఇంటర్‌ ఫలితాల్లో ఈ ఉన్నత పాఠశాలలు అట్టడుగున నిలిచాయి. ‘హైస్కూల్‌ ప్లస్‌ కాదు.. మైన్‌స’గా మారాయి.

- చిత్తూరు (సెంట్రల్‌)

జిల్లాలోని 20 ఉన్నత పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ‘హైస్కూల్‌ ప్లస్‌’ ప్రారంభించారు. మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పించారు. ఉన్నత పాఠశాల వరకు విద్యార్థుల సంఖ్య బాగున్నా.. హైస్కూల్‌ ప్లస్‌లో చేరడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ హైస్కూల్‌ ప్లస్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు.. ఒక్కో గ్రూపులో 40 మంది చొప్పున ఏటా 120 మంది విద్యార్థులు, రెండేళ్లకు 240 మంది ఉండాలి. ఈ లెక్కన 20 ఉన్నత పాఠశాలల్లో రెండేళ్ల కాలంలో 4800 మంది విద్యార్థులు ఉండాలి. కానీ ఉండేది 606 మందే. తొలి విద్యా సంవత్సరంలో 406 మంది చేరగా.. 2023-24లో ఆ సంఖ్య 200 మాత్రమే.

అధ్యాపకులు అంతంతమాత్రమే

ఆయా గ్రూపుల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా అధ్యాపకులను నియమించాలి. కానీ, పలు గ్రూపుల్లో విద్యార్థులు లేకపోవడంతో అధ్యాపకుల నియామకం కూడా అంతంత మాత్రంగానే ఉంది. తెలుగు, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ ఇలా సబ్జెక్టుల వారీగా ఒక్కో పాఠశాలలో 10 మంది చొప్పున జిల్లాలో 200 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ, 124 మంది అధ్యాపకులను నియమించారు. ఉగ్రాణంపల్లిలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో నియామకం చేపట్టలేదు

ఉచితాలు లేనట్లే..!

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అన్ని ఉచిత సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. హైస్కూల్‌ ప్లస్‌లోని విద్యార్థులకు ఆ ఉచితాలు ఎత్తి వేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు రెండేళ్లుగా ఉచిత పాఠ్యపుస్తకాలు అందించలేదు. నోట్‌ పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం ఊసే లేదు.

ఫలితాలపై దారుణ ప్రభావం

ఫ ఎస్‌ఆర్‌ పురం మండలం 49 కొత్తపల్లిమిట్టలోని హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీలో 16 మందికి ముగ్గురే ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బైపీసీలో ముగ్గురికి ఒకరే పాసయ్యారు. ఈ పాఠశాలలో మ్యాథ్స్‌ సబ్జెక్టుకు అధ్యాపకులు లేరు.

ఫ నిండ్రలో సెకండియర్‌ ఇంటర్‌లో 26 మందికి గాను ఇద్దరు మాత్రమే పాసయ్యారు.

ఫ పాలసముద్రం మండలం ఎస్‌ఆర్‌ కండ్రిగ హైస్కూల్‌లో ఫస్టియరులో 9 మందికి గాను ఐదుగురు.. సెకండియర్‌లో 14 మందికి గాను ముగ్గురు ఉత్తీర్ణులయ్యారు.

ఫ చౌడేపల్లె మండలం జడ్పీ బాలికల జూనియర్‌లోని హైస్కూల్‌ ప్లస్‌లో.. ఫస్టియర్‌ ఎంపీసీలో 12 మందికి గాను 9 మంది.. సీఈసీలో 10 మందికి గాను ఆరుగురు ఉత్తీర్ణులయ్యారు.

ఫ పులిచెర్ల మండలం కల్లూరులో సెకండియర్‌ ఎంపీసీలో 8 మందికి నలుగురు.. కార్వేటినగరం బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలోని ఫస్టియర్‌ బైపీసీలో 16 మందికి ఏడుగురు.. సీఈసీలో 19 మందికి ముగ్గురు పాసయ్యారు.

ఫ విజయపురం మండలంలో ఫస్టియర్‌లో 18 మంది.. సెకండియర్‌ ఇంటర్‌లో 21 మంది ఉండగా.. ఏడాదికి ఇద్దరు చొప్పున నలుగురే ఉత్తీర్ణులయ్యారు. బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచిలో ఫస్టియర్‌ బైపీసీలో పది మంది, సీఈసీలో ఎనిమిది మంది చదువుతుండగా.. గ్రూపునకు ఒకరు చొప్పున ఇద్దరే పాసయ్యారు.

అక్కడ సున్నా ఫలితాలు

ఫ సోమలలో ఫస్టియర్‌ ఇంటర్‌లో ఆరుగురు, సెకండియర్‌ ఇంటర్‌లో ఏడుగురు బాలికలు ఉండగా.. వీరంతా ఫెయిలయ్యారు. సున్నా ఫలితాలు వచ్చాయి.

ఫ పులిచెర్ల మండలం కల్లూరులో ఫస్టియర్‌ బైపీసీలో పది మంది, ఎంపీసీలో ఆరుగురు, సెకండియర్‌ బైపీసీలో ఆరుగురు కలిపి 26 మందీ ఫెయిలయ్యారు.

ఫ నిండ్రలో ఫస్టియర్‌ ఇంటర్‌లో ఉన్న 18 మందీ ఫెయిలయ్యారు.

ఔను.. అక్కడ బైపీసీలో అందరూ ఫెయిల్‌!

వెదురుకుప్పం, ఏప్రిల్‌ 13: ఔను అక్కడ బైపీసీ గ్రూపులో ఇంటర్మీడియట్‌ రెండవ సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఫెయిలయ్యారు. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో వెల్లడయ్యాయి. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం జడ్పీ ఉన్నత పాఠశాలను వైసీపీ ప్రభుత్వ హయంలో హైస్కూల్‌ ఫ్లస్‌ కాలేజీగా మార్చారు. కానీ, ఫలితాలు మాత్రం అక్కడ దారుణంగా ఉంది. విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువ కాదండోయ్‌

ఒక్కరూ చేరలేదు

పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇప్పటి వరకు ఒక్క అడ్మిషన్‌ కూడా జరగలేదు. బంగారుపాళ్యం, జీడీ నెల్లూరు, కార్వేటినగరం, పెద్దపంజాణి, సదుం, తవణంపల్లె, వెదురుకుప్పం మండలాల్లోని హైస్కూల్‌ ప్లస్‌లో ఈ ఏడాది ఎవరూ చేరలేదు.

Updated Date - Apr 14 , 2024 | 01:06 AM