Share News

ఇదెక్కడి ‘ఆడుదాం ఆంధ్రా’ బాబోయ్‌!

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:41 AM

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణతో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. బుధవారం నుంచి మండలస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రామస్థాయిలోలాగే ఇక్కడా క్రీడాకారుల నుంచి స్పందన పెద్దగా లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రభుత్వం ప్రచారం కలిసొచ్చేలా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇదెక్కడి ‘ఆడుదాం ఆంధ్రా’ బాబోయ్‌!
పెనుమూరులో జగనన్న టీషర్టులు చాలక సరిపోక సాధారణ దుస్తుల్లో వాలీబాల్‌ అడుతున్న క్రీడాకారులు

మండల స్థాయిలో పోటీలు ప్రారంభం

గ్రామస్థాయిలోలాగే ఇక్కడా ముందుకురాని క్రీడాకారులు

కొత్తవారితో రిజిస్ర్టేషన్లు

తీవ్ర ఒత్తిడిలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు

సరిపోని టీ షర్టులు, నాణ్యత లేని కిట్లు

చిత్తూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణతో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. బుధవారం నుంచి మండలస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రామస్థాయిలోలాగే ఇక్కడా క్రీడాకారుల నుంచి స్పందన పెద్దగా లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రభుత్వం ప్రచారం కలిసొచ్చేలా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల స్థాయిలో పలురకాల ఆటలు ఆడించి, ఆ తర్వాత మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసేలా ప్లాన్‌ చేశారు. సరిపడా మైదానాలు లేక పొలాలనే చదును చేసి ఆడించారు. డిసెంబరు 26న తొలిరోజు నిర్వహించిన గ్రామ స్థాయి పోటీలకు క్రీడాకారులు, ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు బలవంతంగా క్రీడాకారులు, ప్రేక్షకులను నమోదు చేశారు. ఆ తర్వాత జరిగిన పోటీల పరిస్థితీ అంతే. ఇక, బుధవారం నుంచి మండల స్థాయి పోటీలు మొదలుపెట్టారు. గ్రామ స్థాయిలో ప్రతిభ చూపించిన క్రీడా బృందాలను మండల స్థాయిలో ఆడించాల్సి ఉంది. అసలు చాలాచోట్ల గ్రామ స్థాయిలోనే పోటీలు జరగకపోవడంతో మండల స్థాయిలో ఆడేవారు కరువయ్యారు. దీంతో సచివాలయ ఉద్యోగులు మరోసారి క్రీడాకారుల్ని నమోదు చేయాల్సి వచ్చింది. బుధవారం తొలిరోజు మండల స్థాయి పోటీలు నిర్వహించగా, నాణ్యత లేని కిట్లతో.. సరిపోని టీషర్టులతో క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. మరికొందరు ఆ టీషర్టులు ధరించడానికి ఆసక్త చూపలేదు. దీంతో పెనుమూరు, సోమల తదితర మండలాల్లో సాధారణ దుస్తులతో పోటీల్లో పాల్గొన్నారు. పెనుమూరు మండలంలో 14 సచివాలయాలుండగా, 5 చోట్ల నుంచి క్రీడాకారులు మండల స్థాయి పోటీలకు రాలేదు. ఇదే పరిస్థితి అన్ని మండలాల్లోనూ ఉంది.

జిల్లా వ్యాప్తంగా మండలాలు, మున్సిపాలిటీలను కలపి 33 యూనిట్లుగా ఏర్పాటుచేసి మండల స్థాయి పోటీలను నిర్వహిస్తున్నారు. మండల స్థాయి పోటీల నిర్వహణకు 127 మైదానాలను సిద్ధం చేశారు. కొన్ని సచివాలయాల నుంచి మండల స్థాయి పోటీలకు జట్లు రాకపోయినా కొత్తవారితో నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన గ్రామ స్థాయి పోటీలకు 72820 మంది రిజిస్ర్టేషన్లు చేసుకోగా, 6120 మంది మాత్రమే పాల్గొన్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఈ రిజిస్ర్టేషన్లన్నీ బలవంతంగా చేశారనే విషయం స్పష్టమవుతోంది.

Updated Date - Jan 11 , 2024 | 12:41 AM