Share News

రెస్కో అధికారుల నిర్లక్ష్యంతో హెల్పర్‌ మృతి

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:57 AM

రెస్కో అధికారుల నిర్లక్ష్యంతో హెల్పర్‌ మృతి చెందిన ఘటన కుప్పం మండలం గుడ్లనాయనిపల్లె గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

రెస్కో అధికారుల నిర్లక్ష్యంతో హెల్పర్‌ మృతి
ట్రాన్స్‌ఫార్మర్‌కు వేలాడుతున్న మృతదేహం

కుప్పం, జూన్‌ 8: రెస్కో అధికారుల నిర్లక్ష్యంతో హెల్పర్‌ మృతి చెందిన ఘటన కుప్పం మండలం గుడ్లనాయనిపల్లె గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని అడవిబూదుగూరు గ్రామానికి చెందిన ముత్తుకుమార్‌ (22) కుప్పం రెస్కోలో షిఫ్ట్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. విద్యుత్తు సరఫరాలో లోపం ఏర్పడడంతో గుడ్లనాయనిపల్లె గ్రామ సమీపంలోని సబ్‌ స్టేషన్‌కు వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి మరమ్మతు చేయ సాగాడు. ఇంతలో హఠాత్తుగా విద్యుత్తు సరఫరా కావడంతో ట్రాన్స్‌ఫార్మర్‌పైనే మృతి చెందాడు. గ్రామస్తులు దీన్ని గమనించి, ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టారు. రెండు గ్రామాల వారు ఇది చూసి సబ్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. రెస్కో అధికారుల నిర్లక్ష్యం వల్లే ముత్తుకుమార్‌ మృతి చెందాడని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. సబ్‌ స్టేషన్‌ సమీపంలో గల ప్లాస్టిక్‌ పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా విద్యుత్‌ సరఫరాను ఆపరేట్‌ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రెస్కో అధికారులు సాయంత్రం వరకు అటు తిరిగి చూడకపోవడంతో మరింత ఆగ్రహావేశాలకు లోనై రోడ్డుపైనే బైఠాయించారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఽధర్నా విరమించారు. కాగా, మృతుడు ముత్తుకుమార్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. అతని భార్య బిడ్డకు జన్మనిచ్చి పుట్టింట్లో ఉంది. కుటుంబ పెద్ద మృతితో భార్యాబిడ్డలు దిక్కులేని వారయ్యారు.

Updated Date - Jun 09 , 2024 | 12:57 AM