Share News

హలో లోకేశ్‌ సక్సెస్‌

ABN , Publish Date - May 03 , 2024 | 02:40 AM

హలో లోకేశ్‌ కార్యక్రమం యువతలో ఉత్సాహాన్ని నింపింది.

హలో లోకేశ్‌ సక్సెస్‌

చంద్రగిరి, మే 2: హలో లోకేశ్‌ కార్యక్రమం యువతలో ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ జాతీయ ప్రఽధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాలనుంచీ వేలాదిమంది యువతీ యువకులు తరలిరావడంతో సభా ప్రాంగణం కళకళలాడింది. తొలుత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పార్టీ పతాకాలతో తొండవాడనుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.ప్రపంచానికే ఒక విజనరీ నాయకుడైన చంద్రబాబు నాయుడు జన్మించిన నేల ఈ చంద్రగిరి అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన లోకేశ్‌ ప్రసంగంలో రాజకీయ చెణకులు యువతచేత చప్పట్లు కొట్టించాయి.తరువాత పలువురు యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్‌ తనదైన శైలిలో సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. అంతకుముందు బీజీఎస్‌ కల్యాణమండపంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అభ్యర్థులతో లోకేశ్‌ సమీక్షించారు. తాజా రాజకీయ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమై ఫొటోలు దిగారు.అనంతరం పలువురు వైసీపీ నాయకులు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు.

లోకేశ్‌ ప్రసంగమిలా..

‘ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌... ఏదీ వదిలిపెట్టడు ఈ పాపాల పెద్దిరెడ్డి.నేను జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడికి వెళ్లినా ఒకే రకమైన టిప్పర్‌, ఒకే రకమైన జేసీబీ. దానిపై పీఎల్‌ఆర్‌.పాపాల పెద్దిరెడ్డి సామ్రాజ్యం ఏస్థాయికి వెళ్లిందో చూడండి.చిత్తూరు జిల్లాను క్యాన్సర్‌లా పట్టి పీడిస్తున్న ఈ కుటుంబానికి ఓటు ద్వారా రేడియేషన్‌ ఇవ్వండి.’

‘చంద్రబాబు హయాంలో పెట్టుబడుల్లో, గ్రామీణ ఉపాధిలో, మహిళల భద్రతలో, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం నెంబరు వన్‌.జగన్‌ హయాంలో గంజాయి, డ్రగ్స్‌తో పాటు బూమ్‌బూమ్‌, ఆంధ్ర గోల్డ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌ వంటి ప్రమాదకరమైన మద్యానికి, కోడికత్తికి, గులకరాయికి, పరిశ్రమలను పక్క రాష్ర్టాలకు తరిమేయడంలో, పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌, కరెంట్‌ ధరలు పెంచడంలో నెంబరు వన్‌’

‘సీసీసీ అంటే ఏంటో తెలుసా? చంద్రగిరి, చెవిరెడ్డి, చెవిలో పువ్వు. ఐదేళ్లలో 2 వేల కోట్లు సంపాదించాడు చెవిరెడ్డి.ఆయన పనైపోయింది కాబట్టే పక్క జిల్లాకు వెళ్లిపోయాడు. ఇప్పుడు జూనియర్‌ వచ్చి చెవిలోపువ్వు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. రెండుసార్లు ఈ కుటుంబానికి అవకాశమిచ్చారు. మీ జీవితాలు మారాయా? ఒక్క పరిశ్రమైనా, ఉద్యోగమైనా వచ్చిందా?’

‘గతంలో కోడికత్తిలాగే ఈసారి గులకరాయి డ్రామా ఆడారు. కోడికత్తి డ్రామా తర్వాత బాబాయ్‌ శవమయ్యారు. ఇప్పుడు మళ్లీ తాడేపల్లి నుంచి ఏ శవం బయటికి వస్తుందోనని కుటుంబసభ్యులు భయపడుతున్నారు. సొంత తల్లి, చెల్లే జగన్‌ను చూసి భయపడుతున్నారంటే ఇక రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటో’

‘మై డియర్‌ జగన్‌ టైం, డేట్‌ నువ్వు ఫిక్స్‌ చేయ్‌. నేను చంద్రబాబును తీసుకొస్తా. ఇక్కడే తిరుమల ఉంది. నువ్వు ముందు మెట్లు ఎక్కుతావా, లేదా చంద్రబాబు ముందు ఎక్కుతారో చూద్దాం. అప్పుడు ముసిలోడు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు’

Updated Date - May 03 , 2024 | 02:40 AM