‘తల’ తిరిగే ధరలు!
ABN , Publish Date - Jul 15 , 2024 | 01:30 AM
బోయకొండకు వెళుతున్నామంటే.. పొట్టేలు తల తెస్తావా అని అడగతారు. అమ్మవారికి భక్తులు సమర్పించే పొట్టేలు తలకాయలకు అంత ప్రాధాన్యం. దీనిని టెండరుదారులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఫ బోయకొండలో పొట్టేలు తల రూ.1200 నుంచి 1800
ఫ అమ్మవారి భక్తులను నిలువుదోపిడి చేస్తున్న టెండరుదారులు
చౌడేపల్లె, జూలై 14: బోయకొండకు వెళుతున్నామంటే.. పొట్టేలు తల తెస్తావా అని అడగతారు. అమ్మవారికి భక్తులు సమర్పించే పొట్టేలు తలకాయలకు అంత ప్రాధాన్యం. దీనిని టెండరుదారులు సొమ్ము చేసుకుంటున్నారు. విపరీతంగా ధరలు పెంచి భక్తులను దోచుకుంటున్నారు. చిన్న తల రూ.500, పెద్ద తల రూ.700గా ఆలయ అధికారులు ధర నిర్ణయించారు. కానీ, ఆదివారమైతే రూ.1200 నుంచి రూ.1800 వరకు టెండరుదారులు తలకాయలను అమ్ముతూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. బోయకొండ గంగమ్మకు భక్తులు జంతు బలులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పొట్టేలు బలులిచ్చాక తలను ఆలయానికి ఉచితంగా ఇస్తుంటారు. ఈ తలల సేకరణకు వేలం పాటల ద్వారా ఆలయానికి దాదాపు రూ.కోటి ఆదాయం వస్తుండటంతో పాటు చాలా డిమాండ్ కూడా ఉంది. ఈ క్రమంలో టెండరుదారులు డిమాండును బట్టి పొట్టేలు తలలకు ధర పెడుతున్నారు. నాలుగు రోజుల కిందట ఒక పొట్టేలు తలను రూ.మూడు వేలకు అమ్మారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇక, పొట్టేలు తలను భక్తులకు రూ.100 తో శుభ్రపరిచి ఇవ్వాలని టెండరు ఇచ్చారు. ఈ ధర ప్రకారమే టోకన్ ఇస్తారు. కానీ క్లీన్ చేసేవాళ్లు అదనంగా మరో రూ.150 నుంచి 250 వరకు తీసుకుంటున్నారు. ఇక, పొట్టేలును శుభ్రపరిచి, కటింగ్ చేసివ్వడానికి రూ.400గా ధర నిర్ణయిస్తే.. రూ.600పైనే వసూలు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఆదివారాల్లో ఇలా అధిక వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ ఈవో ఏకాంబరంను వివరణ కోరగా.. తాను కొత్తగా వచ్చానని, అన్ని లోపాలను సరిచేస్తున్నానని తెలిపారు. ఇకపై అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకుంటామన్నారు.