Share News

బాగా పనిచేసిన నేతలకు ర్యాంకులు ఇవ్వండి

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:51 AM

కుప్పం నియోజకవర్గ ప్రజలకు టీడీపీ మెసేజ్‌లు

బాగా పనిచేసిన నేతలకు ర్యాంకులు ఇవ్వండి

కుప్పం, జూన్‌ 11: ఎన్నికలకు ముందు టీడీపీలో బాగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు తగిన గుర్తింపునివ్వడానికి అధిష్ఠానం సిద్ధమైంది. పార్టీలో కష్టపడి పనిచేసిన నాయకులకు ర్యాంకులు ఇవ్వమంటూ టెక్ట్స్‌ మెసేజీలను ఇటు ప్రజలకు, కార్యకర్తలకు పంపుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజులుగా ఈ మెసేజ్‌లు ఉద్దేశించిన వర్గాలకు చేరుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్యబద్దమైన పార్టీ అని పేరు. ప్రజలనుంచి వచ్చిన.. క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకులను గుర్తించి పదవులు కట్టబెడతారని, తద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తారని ఆ పార్టీ గురించి సామాన్య జనం అనుకునే మాట. కానీ, 2019 ఎన్నికల్లో.. పార్టీకోసం, ప్రజలకోసం పనిచేసిన నాయకులకు కాకుండా మాటలు చెప్పి పబ్బం గడుపుకునే వారికే పార్టీ పదవులు వరించాయని అప్పట్లో కార్యకర్తలు వాపోయారు. అందుకే ఈసారి గత వైఖరికి భిన్నంగా టీడీపీ అధిష్ఠానం వెళ్తోంది. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికలకు రెండేళ్ల ముందే పార్టీకోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి ప్రచార బాధ్యతలను అప్పగించింది. పార్టీ పదవులను కూడా అటువంటి వారికే కట్టబెట్టింది. ఇటువంటి వారిలో కొంతమంది సీనియర్‌ నేతలు ఉన్నా, వారి సంఖ్య పరిమితం మాత్రమే. చాలాచోట్ల యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఫలితాలు కూడా పార్టీ అధిష్ఠానంలో వచ్చిన ఈ మార్పునకు తగిన రీతిలోనే ఘనమైన విజయంగా పరిణమించాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. అధికార పీఠం దక్కింది. పార్టీలో పనిచేసిన వారికే పదవులు, బాధ్యతల్లో ప్రాధాన్యం ఇవ్వడానికి అధిష్ఠానం నిర్ణయించింది. అటువంటి వారికే పార్టీ పదవులు అప్పగించడంతోపాటు 2026లో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించడానికి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి ప్రజలకు, కార్యకర్తలకు వస్తున్న టెక్ట్స్‌ మెసేజ్‌లు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ర్యాంకులు ఇలా

సిపి-టిడిపిఎ్‌సఎంఎస్‌ పేరుతో వస్తున్న ఈ టెక్ట్స్‌ మెసేజ్‌ను క్లిక్‌ చేస్తే ఓటీపీ వస్తోంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే ఒక ఫార్మాట్‌ ప్రత్యక్షమవుతోంది. ‘మీ ప్రాంతంలోని నాయకుల వివరాల నమోదు’ పేరుతో ఉన్న ఈ ఫార్మాట్‌లో ‘మీ ప్రాంతంలో 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం బాగా పనిచేసిన కమిటీలలోని నాయకులకు తగితన ర్యాంకులు ఇచ్చి నాయకుడిని ఎన్నుకోండి. ఇతర నాయకుల్ని కింద ఉన్న ‘ఇతర నాయకుల పేర్లు’ అన్న బటన్ని క్లిక్‌ చేసి నాయకుల వివరాలు ఎంటర్‌ చేసి వారికి ర్యాంకులు ఇవ్వండి.’ అన్న సూచన ఉంది. బాగా పనిచేసిన వారికి 1, ఆ తర్వాత బాగా పనిచేసిన వారికి 2 ర్యాంకులు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. టీడీపీ పార్టీకోసం బాగా పనిచేసిన పార్టీ కమిటీలలోని ఇతర నాయకుల పేర్లు సూచించమని కూడా పేర్కొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 07:52 AM