Share News

తిరుపతి ఉప పోరుకు మరో నలుగురు బలి !

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:50 AM

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి తాజాగా ముగ్గురు పోలీసు అధికారులు, ఓ హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెండ్‌కాగా మరో ఇద్దరు పోలీసు అధికారులు వీఆర్‌కు బదిలీ అయ్యారు.

తిరుపతి ఉప పోరుకు మరో నలుగురు బలి !

ఈసీ ఆదేశాలతో ఇద్దరు సీఐలు సహా ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

వీఆర్‌కు ఇద్దరు సీఐలు

ఎన్నికల్లో అక్రమాలపై విచారణలో నిర్లక్ష్య పర్యవసానం

అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ దాటిపోకూడదని ఆదేశం

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 11: తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి తాజాగా ముగ్గురు పోలీసు అధికారులు, ఓ హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెండ్‌కాగా మరో ఇద్దరు పోలీసు అధికారులు వీఆర్‌కు బదిలీ అయ్యారు.అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా సస్పెన్షన్‌తో మొదలైన కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తాజాగా మరో నలుగురి సస్పెన్షన్‌కు కారణమయ్యాయి.2021వ సంవత్సరంలో జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఇతర ప్రాంతాల ఓటర్లను బస్సుల్లో తరలించి మరీ పోలింగ్‌ చేయించారు.వారికోసం ఏకంగా 34 వేల ఓటరు ఐడీ కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్‌ చేయించారు.ఈ వ్యవహారాన్నంతటినీ చూసీచూడనట్టు వ్యవహరించిన పోలీసులు ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. పైగా కాలక్రమంలో ఆయా కేసులను కొట్టివేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ దర్యాప్తునకు ఆదేశించింది. పోలీసుల బాధ్యతా నిర్వహణపై దర్యాప్తుచేసిన ఉన్నతాధికారులు పలువురు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఫిర్యాదులపై సక్రమంగా దర్యాప్తు చేయలేదని, ఆరోపణలు వచ్చినవారిని విచారించలేదని నిర్ధారించారు. అలాగే దొంగ ఓట్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా దొంగ ఓటర్లకు చెందిన ఎపిక్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు ఇతర వివరాలను కూడా సేకరించి భద్రపరచాల్సి ఉండగా అవేమీ చేయలేదని కనుగొన్నారు. ఎటువంటి విచారణ లేకుండానే ఆయా కేసులను మూసివేసినట్టు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అందుకు బాధ్యులైన పోలీసు అధికారులు, సిబ్బందిపై అనంతపురం రేంజి డీఐజీ చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు.అప్పట్లో ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐగా పనిచేసి ప్రస్తుతం తిరుపతి ఎస్‌బీ సీఐగా పనిచేస్తున్న బీవీ శివప్రసాదరెడ్డి, ఎస్‌ఐగా పనిచేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఎ.జయస్వాములు, అప్పట్లో స్టేషన్‌ రైటర్‌గా పనిచేసిన హెడ్‌కానిస్టేబుల్‌ కె. ద్వారకనాథరెడ్డి, వెస్ట్‌ సీఐగా పనిచేసి ప్రస్తుతం సత్యసాయి జిల్లా వీఆర్‌లో ఉన్న శివప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు. క్రైమ్‌ నంబర్‌ 176/2021 అండర్‌ సెక్షన్‌ 171 (ఎఫ్‌), 188 ఐపీసీ ప్రకారం అప్పట్లో ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి హెడ్‌ కానిస్టేబుల్‌ కె. ద్వారకనాథరెడ్డి తప్పుడు సెక్షన్లతో కేసు నమోదు చేశారని, కేసు ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా ద్వారకనాథరెడ్డి ఫిర్యాదుదారుని, సంబంధిత పోలింగ్‌ ఽఅధికారులను, బీఎల్‌ఓలను, నేరం జరిగిన ప్రదేశంలో ఉన్న పోలీసు సిబ్బందిని, పోలింగ్‌ బూత్‌లో ఉన్న ఇతర ఓటర్లను విచారించడంలో విఫలమయ్యాడని, అలాగే నిందితుల ఓటరు ఐడీ, ఎపిక్‌కార్డులు, ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని అందుకుగాను ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు డీఐజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఎస్‌ఐ జయస్వాములు నేరం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి సాక్షులను విచారిండంలో విఫలమయ్యారని, ఐపీసీ సెక్షన్‌ 171(ఎఫ్‌) ప్రకారం నేరాన్ని నిరూపించడానికి సాక్ష్యాలను సేకరించాల్సిందిపోయి ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా కేసుకు సంబంఽధించిన సెక్షన్ను ఐపీసీ 290కి మార్పుచేసేందుకుగాను న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారని ఉత్తర్వుల్లో వివరించారు. నకిలీ ఎపిక్‌ కార్డులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన కేసులో సెక్షన్‌ మార్చి ఐపీసీ 290 ప్రకారం ఛార్జిషీట్‌ దాఖలు చేయడం దర్యాప్తు తీరు, నిబద్దతను శంకించే విధంగా ఉందని పేర్కొన్నారు. ఇక సీఐ బీవీ శివప్రసాదరెడ్డి హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)గా స్టేషన్‌కు అధిపతి అయినందున కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తూ, కింది అధికారులకు మార్గనిర్దేశం చేయాలి. ఎస్‌హెచ్‌ఓ పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత మాత్రమే కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కేసు వాస్తవాలను పరిశీలించి, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తును ధృవీకరించి, చట్టంలో తగిన సెక్షన్‌కింద ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారంలో అవసరమైన స్థాయిపర్యవేక్షణను అమలు చేయడంలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ బీవీ శివప్రసాద రెడ్డి విఫలమయ్యారని డీఐజీ ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే దొంగ ఓట్లపై నమోదైన ఓ కేసుకు సంబంధించి దర్యాప్తు సక్రమంగా నిర్వహించలేదనే కారణంతో అప్పట్లో తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐగా పనిచేసి ప్రస్తుతం సత్యసాయి జిల్లా వీఆర్‌లో ఉన్న సీఐ శివప్రసాద్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. వీరిని విధులనుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు, అనుమతి లేకుండా వారు హెడ్‌క్వార్టర్స్‌ దాటి పోకూడదని డీఐజీ ఆదేశించారు.ఉప ఎన్నిక సమయంలో అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మరో కేసుకు సంబంధించి దర్యాప్తు చేయకుండానే కేసును మూసివేశారనే కారణంతో ఇద్దరు సీఐలను డీఐజీ వీఆర్‌కు ఆదేశించారు. అప్పట్లో అలిపిరి సీఐగా పనిచేసి ప్రస్తుతం రేణిగుంట రైల్వే సీఐగా పనిచేస్తున్న దేవేంద్రకుమార్‌ను, ప్రస్తుతం సీఐగా ఉన్న అబ్బన్నను అనంతపురం వీఆర్‌కు బదిలీ చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 01:50 AM