మాజీ మంత్రి అమర్‌కు చేదు అనుభవం
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:58 AM
విమానాశ్రయంలో సీఎంను స్వాగతించేందుకు అనుమతించని సెక్యూరిటీ కలెక్టర్ చెప్పినా వినిపించుకోని వైనం

తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు బుధవారం సాయంత్రం రేణిగుంటలోని విమానాశ్రయానికి వెళ్ళిన మాజీ మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే అమరనాఽథరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.తన స్వగ్రామమైన నారావారిపల్లిలో గురువారం జరిగే తమ్ముడి కర్మక్రియలకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. వారికి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే అమరనాధరెడ్డి విమానాశ్రయానికి వెళ్ళారు. అయితే వెలుపలి గేటు వద్దే ఆయన్ను సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆపేశారు. తాను మాజీ మంత్రినని, అధికార పార్టీ ఎమ్మెల్యేనని అమర్ చెప్పినా వినిపించుకోలేదు. విమానాశ్రయం లోపల వీఐపీ లాంజ్‌లో నిలుచున్న కలెక్టర్ వెంకటేశ్వర్ వెలుపల నిలుచుని వున్న అమరనాధరెడ్డిని గమనించి అక్కడికి చేరుకుని సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి చెప్పి లోనికి తీసుకెళ్ళారు. అయితే టెర్మినల్ నుంచీ ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి వెళుతుండగా అక్కడ మళ్ళీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన ఎమ్మెల్యే అంటూ కలెక్టర్ చెప్పినా అనుమతించలేదు. దీంతో స్వరం పెంచిన కలెక్టర్ తాను జిల్లా మేజిస్ట్రేట్‌నని, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి రన్‌వేపైకి వెళతారని చెప్పినా సిబ్బంది ఏమాత్రం వినిపించుకోలేదు. సీఎం విమానం ల్యాండయ్యే సమయం సమీపిస్తుండడంతో తనకోసం టెర్మినల్ గేటు వద్ద ఆగిపోయిన కలెక్టర్‌ను రన్‌వేపైకి వెళ్ళమని కోరిన అమర్ తాను మౌనంగా విమానాశ్రయం నుంచీ వెలుపలికి వచ్చేశారు. వెంట వచ్చిన అనుచరులు, సహచర నేతల ఎదుట అవమానం జరిగిందంటూ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిసింది.
రన్‌వే పైకి పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలకడానికి తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, వెంకటగిరి, జీడీనెల్లూరు ఎమ్మెల్యేలతోపాటు డాలర్స్ దివాకర్‌రెడ్డి, మబ్బు దేవనారాయణరెడ్డి తదితర టీడీపీ నాయకులు సైతం పలువురు విమానాశ్రయ రన్‌వే పైకి చేరుకున్నారు. వారంతా సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. అయితే ఎమ్మెల్యే అమర్‌ను మాత్రం విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం సీఎంకు విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో వున్న వారు స్వాగతం పలికేందుకు అనుమతి ఇస్తారు. సంబంధిత జాబితా కలెక్టర్ నుంచీ విమానాశ్రయ డైరెక్టర్‌కు వెళితే, డైరెక్టర్ ఆ జాబితాను సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి పంపుతారు. జాబితాలోని వ్యక్తులను వారు విమానాశ్రయం లోపలికి, అలాగే రన్‌వే పైకి అనుమతిస్తారు. కలెక్టర్ కాకుండా సీఎం కార్యాలయం నుంచీ కూడా విడిగా జాబితా వస్తుంది. అందులో పార్టీ ముఖ్యుల పేర్లు వుంటాయి. ఆ జాబితా కూడా కలెక్టర్ నుంచే విమానాశ్రయానికి వెళుతుంది. వాస్తవానికి ఈ జాబితాతో సంబంధం లేకుండా కూడా ఎమ్మెల్యేలను లోనికి అనుమతించాల్సి వుంటుంది. ఇతర ఎమ్మెల్యేలను, పదవులు లేని పార్టీ నాయకులను కూడా రన్‌వే పైకి అనుమతించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది జిల్లాలోనే సీనియర్ ఎమ్మెల్యే అయిన అమరనాఽథరెడ్డిని అడ్డుకోవడం కూటమి పార్టీల వర్గాల్లో చర్చనీయాంశమైంది.