Share News

ఏకాంత సేవకు ఆదిదంపతులు

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:59 AM

ముగిసిన ముక్కంటి మహాశివరాత్రి ఉత్సవాలు

ఏకాంత సేవకు ఆదిదంపతులు

శ్రీకాళహస్తి, మార్చి 15: ముక్కంటి ఆలయ శివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం రాత్రి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు.ఆలయం మూసే వేళ స్వామివారి సన్నిధిలో చిన్న వెండి పల్లకిని ముస్తాబు చేసి మంగళవాయిద్యాలు, మేళతాళాలు, భక్తుల శివనామస్మరణ మధ్య స్వామి సన్నిధి నుంచి అమ్మవారికి పిలుపునిస్తూ జ్ఞానాంబిక సన్నిధికి తీసుకెళ్లగా అక్కడ అమ్మవారి ఉత్సవమూర్తి పల్లకిలో ఆశీనులయ్యారు. అక్కడినుంచి గురుదక్షిణాముర్తి సన్నిధి నుంచి ప్రదక్షిణపూర్వకంగా పల్లకి స్వామి సన్నిధిలో ఎదురుగా ధ్వజస్తంభం వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న శివయ్య ఉత్సవమూర్తి పల్లకిలో దేవేరికి ఎదురుగా ఆశీనులయ్యారు. ఆదిదంపతులు అధిరోహించిన పల్లకిని అమ్మవారి గర్బాలయంలోని శయన మందిరం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అమర్చిన పడక ఊయలలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు, భక్తులు వెలుపలకు వచ్చి తలుపులు మూయడంతో ఏకాంతసేవ ముగిసింది.ఉత్సమూర్తులకు డ్రైపూట్స్‌ మాలలను, ప్రత్యేక సుగంధభరితమైన పూలమాలలను, పండ్లను భక్తులు సమర్పించారు. అర్చకులు పంపిణీ చేసిన ఏకాంత సేవ ప్రసాదాన్ని స్వీకరించారు.కాగా ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని శుక్రవారం ఉదయం వేద పారాయణ సభ జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల నుంచి వచ్చిన 100మంది వేద పండితులు గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేదాలను పఠించారు.

Updated Date - Mar 16 , 2024 | 12:59 AM