వరదలా పారుతున్న దోపిడీ నిధులు
ABN , Publish Date - May 12 , 2024 | 02:30 AM
ఎన్నికల్లో అధికార పార్టీ నేతల పక్షాన దోపిడీ నిధులు వరదలా వచ్చి పడుతున్నాయి. ఐదేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని యధేచ్చగా వనరులు కొల్లగొట్టిన వైసీపీ నేతలు టోకున రూ. వేల కోట్లు పోగేసుకున్నారు. కొన్ని చోట్ల వనరుల దోపిడీకి తోడు అదనంగా వసూళ్ళు, కమిషన్లు, ఇతర దందాల ద్వారా అక్రమార్జన చేకూరింది. విచ్చలవిడిగా వచ్చిపడిన ఆ డబ్బును ఇపుడు అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో వెదజల్లుతున్నారు.

- ఐదేళ్ళుగా వనరులు కొల్లగొట్టిన వైసీపీ నేతలు
- విచ్చలవిడిగా సంపాదించిన డబ్బును వెదజల్లుతున్న వైనం
- ఓటుకు రూ 2 వేలు నుంచీ రూ.3 వేలు
- కొన్ని చోట్ల రెండో విడత పంపిణీకి సన్నద్ధం
తిరుపతి, మే 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో అధికార పార్టీ నేతల పక్షాన దోపిడీ నిధులు వరదలా వచ్చి పడుతున్నాయి. ఐదేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని యధేచ్చగా వనరులు కొల్లగొట్టిన వైసీపీ నేతలు టోకున రూ. వేల కోట్లు పోగేసుకున్నారు. కొన్ని చోట్ల వనరుల దోపిడీకి తోడు అదనంగా వసూళ్ళు, కమిషన్లు, ఇతర దందాల ద్వారా అక్రమార్జన చేకూరింది. విచ్చలవిడిగా వచ్చిపడిన ఆ డబ్బును ఇపుడు అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో వెదజల్లుతున్నారు. ఓటుకు రూ. 2 వేల నుంచీ రూ. 3 వేలు దాకా పంపిణీ అవుతోంది. ఒక చోట నగదుకు తోడు చీరలు, ముక్కుపుల్లలు, వెండి మెట్టెలు వంటివి అందజేస్తున్నారు. మరో చోట రెండో విడత నగదు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇసుక, సిలికా, క్వార్ట్జ్, గ్రావెల్, మట్టి, భూములు వంటి వాటి దోపిడీ ద్వారా సమకూరిన నిధులు ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు ఆ పార్టీ నేతలు వరదలా ఖర్చు చేస్తున్న తీరు ప్రజలను నివ్వెరపరుస్తోంది.
శ్రీకాళహస్తిలో కరెన్సీ నోట్ల ప్రవాహం
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు కరెన్సీ నోట్లను నీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిలో ఇసుకను ఐదేళ్ళ పాటు యధేచ్ఛగా కొల్లగొట్టేశారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు మండలాల్లో మట్టి తవ్వకాలతోనే రూ. 300 కోట్లు దోచేశారనే ఆరోపణలున్నాయి. అలాగే ఈ నాలుగు మండలాల్లో రూ. వందల కోట్ల విలువైన గ్రావెల్ తవ్వకాలు భారీగా చేపట్టారు. ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో ప్రభుత్వ భూములు పెద్దఎత్తున కబ్జా అయ్యాయి. వాటి విలువా రూ. వందల కోట్లలోనే. అదే విధంగా నాలుగు మండలాల్లో పరిశ్రమల యాజమాన్యాల నుంచీ కూడా భారీగా వసూళ్ళకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ వనరుల దోపిడీతో భారీగా ఆర్జించినందునే వైసీపీ నేతలు ఓటర్లకు రూ. 2 వేల నుంచీ రూ. 3 వేల వంతున నగదు ఇచ్చి అదనంగా మహిళలకు బంగారు ముక్కుపుడక, వెండి మెట్టెలు, చీరలు ఇవ్వగలుగుతున్నారనే టాక్ ప్రజలనుంచీ వినిపిస్తోంది.
సూళ్ళూరుపేటలో నానా రకాల దందాలు
సూళ్ళూరుపేట నియోజకవర్గంలో నానా రకాల దందాలు సాగించి వైసీపీ నేతలు అక్రమంగా డబ్బు పోగేసుకున్నారనే ప్రచారముంది.పెళ్ళకూరులో అక్రమ గ్రావెల్ తవ్వకాలతో శిరసనంబేడు కొండను కరిగించేశారు. తడ మండలం మాంబట్టు వద్ద గ్రావెల్ కొల్లగొట్టారు. సూళ్ళూరుపేట మండలం మన్నారుపోలూరు వద్ద గ్రావెల్ కోసం గుట్టలాంటి మట్టి దిబ్బను మాయం చేశారు. సూళ్ళూరుపేట, నాయుడుపేట, దొరవారిసత్రం మండలాల్లో మట్టి తవ్వకాలు భారీఎత్తున సాగాయి. పెళ్ళకూరు మండలంలో ఇసుక తవ్వకాలు కోర్టు మెట్లెక్కే దాకా సాగాయి. రేషన్ బియ్యం, గుట్కా, గంజాయి వంటి అక్రమ దందాలకు అంతే లేదు. పార్టీ వర్గాల నుంచీ వచ్చిన డబ్బును ఓటర్లకు పంచుతున్న అధికార పార్టీ నేతలు ఈ అక్రమ దందాలతో వచ్చి పడిన డబ్బును ప్రచారాలకు, అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు వాడుతున్నట్టు చెబుతున్నారు.
సత్యవేడును దోచేసిన బడానేత స్వల్ప విదిలింపు
సత్యవేడు నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే నిస్సహాయతను అడ్డం పెట్టుకుని అన్ని వనరులూ దోచేసిన అధికార పార్టీ బడా నేత ఈ ఎన్నికల్లో తన అక్రమార్జనలో స్వల్ప భాగం విదిలిస్తున్నారు. సత్యవేడు, నాగలాపురం, వరదయ్యపాలెం, నారాయణవనం, బీఎన్‌కండ్రిగ, పిచ్చాటూరు మండలాల్లో 33 గ్రావెల్ క్వారీలు నడుస్తుంటే పలు క్వారీలు పరిధికి మించి ప్రభుత్వ, అటవీ భూముల్లోనూ తవ్వకాలు జరుపుతున్నాయి.నారాయణవనం మండలం ఎరికంబట్టు గ్రామంలో గ్రావెల్ తవ్వకాలతో సగం గుట్ట కరిగిపోయింది. సత్యవేడు మండలం ఏఎం వరం, కన్నవరం, జడేరి, అల్లప్పగుంట గ్రామాల్లో కొండలన్నీ తవ్వేశారు. ఆ మండలంలోనే బాలకృష్ణాపురంలో వంద ఎకరాల పశువుల మేత భూముల్లో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. గ్రామస్తులు సుప్రీం కోర్టు దాకా పోరాడి ఆపగలిగారు. నాగలాపురం మండలం వజ్జావారి కండ్రిగలో గుట్ట ఖాళీ అయింది. వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలోని డీకేటీ భూముల్లో భారీగా తవ్వకాలు జరిగాయి. నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం మండలాల్లో అరుణా నదిలో భారీగా ఇసుక దోపిడీ జరిగింది. నాగలాపురం మండలం సురుటుపల్లి, నందనం గ్రామాల్లో ఇసుక తవ్వకాలను ఆపేందుకు గ్రామస్తులు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్రమార్కులకు ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. బీఎన్ కండ్రిగ కాళంగి నదిలో విచ్చలవిడి తవ్వకాలు జరిగాయి. సత్యవేడు మండలం పీవీపురంలో, బీఎన్ కండ్రిగ మండలాల్లో కంకర క్వారీలు అటవీ భూముల్లో కూడా తవ్వకాలు జరిగాయి. మొత్తం మీద నియోజకవర్గంలో రూ. 2-3 వేల కోట్ల దోపిడీ జరిగిందని అంచనా. ఇదంతా ఉమ్మడి జిల్లాకు చెందిన వైసీపీ బడా నేత మనుషులే చేపట్టారని, ఇపుడు ఆ అక్రమార్జనలో కొంత శాతం ఎన్నికల్లో ధారాళంగా ఖర్చు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.
చంద్రగిరిలో చరిత్ర సృష్టిస్తున్న వనరుల దోపిడీ
చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల వనరుల దోపిడీ చరిత్ర సృష్టిస్తోంది. చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల్లో స్వర్ణముఖి నదిలో భారీగా ఇసుక కొల్లగొడుతున్నారు. కేవలం ఇసుకతోనే రూ. 500 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని అంచనా. రామచంద్రాపురం, చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల్లో ఎర్రమట్టి తవ్వకాలు కూడా వైసీపీ నేతలకు భారీ ఆదాయాన్నిచ్చాయనే ప్రచారం వుంది. ఇక తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి మండలాల్లో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, మఠం భూములు కాజేశారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు శ్రీవారి దర్శనాల రూపంలో బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రవాసాంధ్రుల నుంచీ భారీగా విరాళాలు వచ్చి పడుతున్నాయనే ప్రచారముంది. ఈ నిధుల నుంచీ ఎన్నికల్లో వారు పెడుతున్న కొంత శాతం ఖర్చుకే ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి.
తిరుపతిలో అక్రమ నిధుల వరద
తిరుపతి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అక్రమంగా సమకూర్చుకున్న నిదులను ఎన్నికల్లో వరదలా పారిస్తున్నారు. గత ఐదేళ్ళుగా వైసీపీ నేతలు కబ్జాలు, భూముల సెటిల్‌మెంట్లతో భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు నగరంలో వ్యాపారుల వంటి కొన్ని వర్గాల నుంచీ నిర్బంధ వసూళ్ళకు పాల్పడ్డారనే ప్రచారముంది.మున్సిపల్ కార్పొరేషన్, టీటీడీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కమీషన్ల రూపంలో కూడా రూ. వందల కోట్లు పోగేసుకున్నట్టు ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇక దర్శనాల రూపంలో వస్తున్న ఆదాయానికి అంతూపొంతూ వుండడం లేదని సమాచారం. టీడీఆర్ బాండ్లలో అవినీతి విశ్వరూపం అందరికీ తెలిసిందే. ప్రభుత్వమే వాటిని నిలుపుదల చేసే స్థాయిలో అవినీతి జరిగింది. ఇలా వివిధ మార్గాల్లో పోగేసుకున్న అక్రమార్జన నుంచీ స్వల్ప శాతం నిధులనే ఎన్నికల్లో వరదలా పారిస్తున్నారు.
వెంకటగిరి, గూడూరుల్లోనూ అవే పరిస్థితులు
వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని వైసీపీ నేతలు కొల్లగొడుతున్నారు. ఐదేళ్ళుగా జరిగిన ఈ ఖనిజ దోపిడీతో ఆ పార్టీ నేతలు రూ. కోట్లకు పడగలెత్తారు. ఆ నిధుల్లో కొంత మేరకు ప్రస్తుత ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోనే అత్యధికంగా ఓటుకు రూ. 3500 ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక గూడూరు విషయానికొస్తే కోట, చిల్లకూరు మండలాల్లో సిలికా దోపిడీ జరిగింది.వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఇసుక దందా అత్యంత భారీస్థాయిలో కొనసాగింది. గూడూరు మండలంలో గ్రావెల్, క్వార్ట్జ్ తవ్వకాలు పెద్దఎత్తున జరిగాయి. అయితే ఈ దందాలో సీఎం జగన్ సన్నిహితుల ప్రత్యక్ష ప్రమేయం వుందని సమాచారం. దాదాపు నాలుగేళ్ళ పాటు వారి దోపిడీయే జరిగిందని, చివరి ఏడాదిలో సీఎం సన్నిహితుడు మరొకరు రంగంలోకి దిగి భారీగా వెనకేసుకున్నారనే ప్రచారం వుంది. అభ్యర్థి కొత్తవారైనా పార్టీ వర్గాలు చేస్తున్న ఎన్నికల ఖర్చులో మాత్రం సింహభాగం ఈ అక్రమార్జనలోనిదేనన్న ఆరోపణలున్నాయి.