తిరుపతి మాజీ కమిషనర్ హరితపై వేటు
ABN , Publish Date - Aug 15 , 2024 | 01:01 AM
అనంతపురం జేసీ నియామకం రద్దు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
తిరుపతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తిరుపతి కార్పొరేషన్లో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో బాధ్యులపై చర్యలు మొదలయ్యాయా? తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి డి. హరితకు అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఇచ్చిన నియామకాన్ని రద్దు చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా ఉన్న బాలసుబ్రమణ్యాన్ని మంగళవారం బదిలీ చేయడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా హరిత ఐటీడీఏ(కేఆర్‌పురం)ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే ఆమె బాధ్యతలు తీసుకోకుండా సెలవులో ఉన్నారు. ఈక్రమంలో గతవారం జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో అనంతపురం జేసీగా నియమించడంతో బాధ్యతలు తీసుకునేందుకు సన్నద్ధం అవుతుండగా టీడీఆర్ బాండ్లపై విచారణ అంశం తెరపైకి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆమె నియామకాన్ని రద్దు చేస్తూ, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో తిరుపతి కమిషనర్‌గా ఉన్నప్పుడు టీడీఆర్ బాండ్ల జారీలో ఆమె పాత్రమై కూడా ఆరోపణలు వచ్చాయి.వ్యవసాయ భూమిని, రెసిడెన్షియల్ ప్లాట్లను కమర్షియల్ స్థలాలుగా చూపి మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం సేకరించారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు టీడీఆర్ బాండ్ల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. అదేవిధంగా స్థల యజమానికి కాకుండా వేరే వ్యక్తుల పేరిట బాండ్లను జారీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. స్థల యజమానులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రోడ్డు విస్తరణ చేయడం, కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా దూకుడుగా వ్యవహరించారని చెబుతారు. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కూడా తన గ్రూప్ థియేటర్స్ గోడను కూల్చడంపై కూడా హైకోర్టు ఆదేశాలను లెక్కచేయలేదంటూ ఆమె కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆస్తుల కోసమే నగరంలో పలు రోడ్లు వేశారన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌లతో అంటకాగారన్న విమర్శలు ఉన్నాయి. వారు చెప్పిందంతా చేయడం వల్లనే ఆమెకు ఇప్పుడు విచారణను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే తాజాగా ‘ఆమె టీడీఆర్ బాండ్ల రూపశిల్పి. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు నేను చూసిన ఐఏఎస్ అధికారుల్లో హరిత అత్యంత అవినీతిపరురాలు’ అని తన ‘ఎక్స్’లో టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి బుధవారం పోస్టు చేయడం విశేషం.