Share News

అంతా రాజకీయం

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:21 AM

పండుటాకులకు పింఛన్ల విషయంలోనూ రాజకీయం చేస్తున్నారు. పింఛన్లకు వలంటీర్లను దూరం చేస్తూ ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ కుటిలయత్నం చేస్తోంది.

అంతా రాజకీయం
పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వృద్దులు, తదితరులు

ఫ రెండో రోజూ పింఛన్ల కోసం పండుటాకుల అవస్థలు

ఫ సచివాలయాల్లో బారులు

చిత్తూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పండుటాకులకు పింఛన్ల విషయంలోనూ రాజకీయం చేస్తున్నారు. పింఛన్లకు వలంటీర్లను దూరం చేస్తూ ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ కుటిలయత్నం చేస్తోంది. టీడీపీ వల్లనే ఈ కష్టాలంటూ నమ్మించేందుకు పండుటాకులను ఇబ్బంది పెడుతోంది. ‘పింఛను కోసం ఇప్పుడే వచ్చేయండి. శుక్రవారమే ఆఖరు. ఆ తర్వాత ఇవ్వరు. ఇప్పుడొచ్చి తీసుకోకుంటే ఈ నెల పింఛను పోయినట్లే’ అంటూ పెన్షన్‌దారుల జాబితా పక్కనపెట్టుకుని కొందరు వలంటీర్లు, నేతల ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో ఎక్కడ తమకు పింఛను రాకుండా పోతుందోనన్న ఆందోళనతో గురువారం ఉదయాన్నే అందరూ ఒక్కసారిగా సచివాలయాలకు చేరుకున్నారు. అధికారులు వచ్చి పింఛన్లు ఇచ్చే వరకు పడిగాపులు కాశారు. జిల్లాలో ఏ మండలంలో చూసినా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇంతటి ఎండల్లో సచివాలయాలకు వచ్చిన వృద్ధులు గంటలకొద్దీ నిలబడలేక.. నీరసించి పోయారు. ప్రతినెలా 1 నుంచి 5వ తేది వరకు పెన్షన్లను పంపిణీ చేసవారు. ఈసారి ప్రభుత్వ ఖజానాలో నిధుల్లేక.. మూడో తేది నుంచి పంపిణీ ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసే యంత్రాంగం సచివాలయ ఉద్యోగుల రూపంలో ఉన్నా, ప్రతిపక్షాల మీద బురద జల్లేందుకు వైసీపీ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఇలా ఇబ్బంది పెడుతోంది. పంపిణీలో తొలిరోజైన బుధవారం డబ్బులు బ్యాంకులకు రాక, సాయంత్రం వరకూ లబ్ధిదారులు సచివాలయాల వద్దే బారులు తీరిన విషయం తెలిసిందే. తొలిరోజు 35.95శాతం పెన్షన్లను పంపిణీ చేశారు. రెండో రోజు గురువారం 52 శాతం పెన్షన్లను పంపిణీ చేయగా, మొత్తంగా 88 శాతం పంపిణీ పూర్తయింది. నడవలేని వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి రెండు రోజుల్లో పింఛను అందిస్తామని కలెక్టరు షన్మోహన్‌ బుధవారం చెప్పారు. దీనిపై పెద్దగా ప్రచారం లేదు. సచివాలయాలకే రావాలంటూ వైసీపీకి చెందిన కొందరు చెబుతుండటంతో లబ్ధిదారులు అవస్థలు పడి వస్తున్నారు.

అవ్వాతాతల్లో భయం ఎందుకంటే..

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలల పాటు పింఛను తీసుకోకున్నా.. ఆ తర్వాతి నెలలో ఈ మొత్తాన్నీ కలిపి ఇచ్చేవారు. జగన్‌ సీఎం అయ్యాక ఏ నెలకా నెలలో పింఛను తీసుకోవాలి. లేదంటే ఆ తర్వాతి నెలలో ఇవ్వరు. దీంతో ఎక్కడ లేటైతే పింఛను రాకుండా పోతుందో, తమ మెడిసిన్‌, ఇంటిఖర్చులకు ఇబ్బంది అవుతుందోనన్న భయంతో అవ్వాతాతలు, దివ్యాంగులు సచివాలయాలకు బారులు తీరారు. లేదంటే తర్వాతి నెలలో తీసుకోవచ్చని కొందరైనా అనుకుని ఉండేవారు.

వలంటీరు హల్‌చల్‌

పుంగనూరు: పుంగనూరు ఎన్‌ఎ్‌సపేట సచివాలయం వద్ద గురువారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీరు హరి హల్‌చల్‌ చేశారు. అధికారులు పింఛన్లు ఇస్తుంటే.. ఇతడు పింఛన్‌దారులకు తాగునీరు ఇస్తూ.. వారికి ఏదేదో చెబుతూ కనిపించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక్కడ వలంటీరు ఎందుకు ఉన్నారని కొందరు అడిగేలోపే ఆయన వెళ్లిపోయారు.

పింఛను కోసం వెళుతూ..!

ఫ సొమ్మసిల్లి మృతి చెందిన వృద్ధుడు మురుగేష్‌

గుడిపాల, ఏప్రిల్‌ 4: గుడిపాల మండలం చుక్కావారిపల్లెకు చెందిన మురుగేష్‌ గౌండర్‌(70) గురువారం పింఛను కోసం వెళుతూ సొమ్మసిల్లి.. మృతిచెందారు. తన స్వగ్రామం నుంచి రామభద్రాపురంలోని గ్రామ సచివాలయానికి వెళ్లాలంటే కిలోమీటరు దూరముంది. మధ్యాహ్నం ఆయన వంకలో నడిచి వెళ్తుండగా మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయన్ను గమనించిన స్థానికులు వెంటనే గుడిపాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే మురుగేష్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, 70 ఏళ్లు దాటిన వారికి ఇళ్ల వద్దకే పింఛను పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని స్థానికులు అంటున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 01:21 AM