Share News

అంతా తొండాట

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:46 AM

ఆడుదాం ఆంధ్ర’లో తొండాట జరుగుతోందా? ఇతర రాష్ట్రాల క్రీడాకారులనూ ఆడిస్తున్నారా? ఎవరు.. ఎవరిని ఆడిస్తున్నారో తెలియని నిర్లక్ష్య స్థితిలో అధికారులు ఉన్నారా? గురువారం నాటి పరిణామాలు.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.

అంతా తొండాట
క్రీడాప్రాధికార సంస్థ అధికారులతో క్రీడాకారుల వాగ్వాదం

ఆడుదాం ఆంధ్రలో ఇతర రాష్ట్రాల క్రీడాకారులను ఆడిస్తున్న జట్లు

పట్టించుకోని అధికారులు

‘ఆడుదాం ఆంధ్ర’లో తొండాట జరుగుతోందా? ఇతర రాష్ట్రాల క్రీడాకారులనూ ఆడిస్తున్నారా? ఎవరు.. ఎవరిని ఆడిస్తున్నారో తెలియని నిర్లక్ష్య స్థితిలో అధికారులు ఉన్నారా? గురువారం నాటి పరిణామాలు.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.

- చిత్తూరు క్రీడలు

ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణలో జరిగిన అక్రమాలు జిల్లా స్థాయి పోటీల్లో ఒక్కొక్కటిగా వెలుగు చుస్తున్నాయి. బుధవారం జీడీనెల్లూరు, కుప్పం జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీల్లో కుప్పానికి చెందిన జట్టులో తమిళనాడుకు చెందిన క్రీడాకారులను ఆడించారని జీడీ నెల్లూరు జట్టు సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కుప్పం జట్టు సభ్యులను పరిశీలించాలని అధికారులు మళ్లీ చిత్తూరుకు రావాలని కోరారు. అయితే వారు రాకపోవడంతో రెండో సెమీఫైనల్‌లో పూతలపట్టు జట్టుతో ఆడి గెలిచిన నగరి జట్టును అధికారులు విజేతలుగా ప్రకటించారు. దీంతో జీడీనెల్లూరు నియోజకవర్గ జట్టు సభ్యులు మెసానికల్‌ మైదానం ఎదుట నిరసన తెలిపారు. కుప్పం జట్టులో ఆడిన క్రీడాకారులు బోగస్‌ అని తెలిసే వారు గురువారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు రాలేదని, వారిని డిస్‌క్వాలిఫై చేసి తమతో నగరి జట్టును ఆడించాలని మెసానికల్‌ మైదానం ఎదుట కూర్చొని ధర్నా చేశారు. పోలీసుల రంగప్రవేశంతో ధర్నాను విరమించి అధికారులతో చర్చించారు.

ఫ అదేవిధంగా, బుధవారం క్వార్టర్‌ ఫైనల్‌లో నగరితో చిత్తూరు జట్టు తలపడింది. ఇందులో నగరి జట్టు విజేతగా నిలిచింది. అయితే నగరి జట్టులోనూ బోగస్‌ ఆటగాళ్లు ఆడారని చిత్తూరు జట్టు సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

నగరిని గెలిపించాలనే తాపత్రయం

నగరికి చెందిన క్రీడల మంత్రి అయిన రోజా కోసమే రెండో సెమీఫైనల్‌లో నెగ్గిన నగరి జట్టును విజేతలుగా చేయాలని అధికారులు తాపత్రయం పడుతున్నారంటూ జీడీ నెల్లూరు నియోజకవర్గ క్రీడాకారులు ఆరోపించారు. కుప్పం జట్టు డిస్‌క్వాలిఫై అయితే.. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జీడీ నెల్లూరు జట్టును నగరితో ఆడించాలన్నారు. అలా చేయకుండా నగరిని ఎలా విజేతలుగా ప్రకటిస్తారంటూ అధికారుల తీరుపై నిరసన తెలిపారు. వీరి నిరసనను పట్టించుకోని అధికారులు నగరి కబడ్డీ జట్టును విజేతగా ప్రకటించారు. పూతలపట్టు జట్టుతో రెండో సెమీఫైనల్స్‌ ఆడిన నగరి జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. పూల్‌ ఏ ఫైనల్స్‌కు చేరిన కుప్పం జట్టు రాకపోవడంతో నగరి జట్టును విజేతగా ప్రకటించారు. కుప్పం జట్టులో ఇతర క్రీడాకారులను ఆడించారని కారణంగా కుప్పంను డిస్‌క్వాలిఫై చేస్తూ వారితో ఆడి ఓడిన జీడీనెల్లూరు జట్టుకు రెండు.. రెండో సమీఫైనల్‌లో ఓడిన పూతలపట్టుకు మూడోస్థానం ఇచ్చారు.

Updated Date - Feb 02 , 2024 | 12:46 AM