Share News

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎర్రచందనం, ఇసుక స్మగ్లర్లు

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:45 AM

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎర్రచందనం, ఇసుక స్మగ్లర్లే ఉన్నారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు.

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎర్రచందనం, ఇసుక స్మగ్లర్లు
మీడియాతో మాట్లాడుతున్న అమరనాథరెడ్డి

చిత్తూరు సిటీ, జనవరి 20: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎర్రచందనం, ఇసుక స్మగ్లర్లే ఉన్నారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని వాపోయారు. స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందని చెప్పారు. దొంగ ఓట్లు వేయడం, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి అక్రమ మార్గంలో పదవులు సంపాదించుకున్నారని విమర్శించారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించినా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పుడు చొరవ తీసుకుని.. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన కొందరు అధికారులను సస్పెండ్‌ చేయడం హర్షనీయమన్నారు. దీనిప్రకారం చూస్తే వైసీపీ ప్రజా ప్రతినిధుల ఎన్నిక అప్రజాస్వామికమని, వారిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని వైసీపీ నేతలు లూటీ చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఎన్ని కేసులు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే అడవుల్లో ఉన్న పులులు, ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయంటే కారణమేమిటో చెప్పాలన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించి సరైన నిర్ణయం తీసుకుని.. ఓట్లు వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ.. చిత్తూరు నియోజకవర్గంలో సుమారు 13,600 ఓట్లు చేర్చారని, 15వేలకుపైగా ఓట్లు తీసివేశారని, షిఫ్టింగ్‌ ఓట్లు 15వేల వరకు ఉన్నాయని చెప్పారు. 22వ తేదీన ఓటర్ల జాబితా వస్తుందని.. దాని ఆధారంగా దొంగ ఓట్లను గుర్తించి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతామని అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓ ఎర్రచందనం స్మగ్లర్‌కు వైసీపీ టికెట్‌ ఇచ్చిందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లకంతా కింగ్‌ పిన్‌ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అని ఆరోపించారు.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత సీఎం జగన్‌కు లేదు

పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జి మురళీ మోహన్‌ మాట్లాడుతూ.. వైసీపీ అరాచకాలకు దళితులు బలవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 7,500 మందిపైన దాడులు, 500 మంది మహిళలపై అత్యాచారాలు జరగ్గా, 188 మందికిపైగా హత్యకు గురయ్యారని చెప్పారు. అయినా ఏ ఒక్క బాధిత దళితుడినైనా సీఎం జగన్‌ పరామర్శించారా అని ప్రశ్నించారు. అటువంటి సీఎంకు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదన్నారు. సమావేశంలో నేతలు సురేంద్రకుమార్‌, చంద్రప్రకాష్‌, కటారి హేమలత, కాజూరు బాలాజి, సీఆర్‌ రాజన్‌, గురజాల చెన్నకేశవులు నాయుడు, బద్రినారాయణ, కోదండయాదవ్‌, మోహన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 01:45 AM