Share News

పంట చేతికందే వేళ తొక్కేస్తున్న ఏనుగులు

ABN , Publish Date - May 27 , 2024 | 12:40 AM

దిగుబడి తక్కువ. ధరలు ఎక్కువ. ఈసారైనా లాభాల పంట పండుతుందని మామిడి, టమోటా రైతులు భావించారు. కానీ, పంట చేతికందేవేళ ఏనుగుల విధ్వంసంతో తీవ్రంగా నష్టపోతున్నారు. తోటలపై ఏనుగులు పడి.. కాయలు నేలరాల్చి.. తొక్కి ధ్వంసం చేస్తున్నాయి. దీంతో కన్నబిడ్డల్లా పంటలను కాపాడుకొంటూ వస్తున్న రైతులు కుమిలిపోతున్నారు.

పంట చేతికందే వేళ తొక్కేస్తున్న ఏనుగులు
ఏనుగుల దాడిలో ధ్వంసమైన మామిడి చెట్లు, నేల రాలిన కాయలు

దిగుబడి తక్కువ. ధరలు ఎక్కువ. ఈసారైనా లాభాల పంట పండుతుందని మామిడి, టమోటా రైతులు భావించారు. కానీ, పంట చేతికందేవేళ ఏనుగుల విధ్వంసంతో తీవ్రంగా నష్టపోతున్నారు. తోటలపై ఏనుగులు పడి.. కాయలు నేలరాల్చి.. తొక్కి ధ్వంసం చేస్తున్నాయి. దీంతో కన్నబిడ్డల్లా పంటలను కాపాడుకొంటూ వస్తున్న రైతులు కుమిలిపోతున్నారు.

- పుంగనూరు

ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత, పూత సక్రమంగా రాకపోవడం, వచ్చిన పూత రాలిపోవడం, వర్షాలు సక్రమంగా కురవకపోవడం తదితర కారణాలతో మామిటి పంట దిగుబడి 20 శాతం కూడా రాలేదు. గతేడాది మామిడికాయలు అధిక దిగుబడి ఉన్నా ధరలు చాలా తక్కువగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. బంగారుపాళ్యం మార్కెట్‌లో ఆదివారం టన్ను మామిడి రకం ఇమాంపసందు రూ.లక్ష నుంచి రూ.1.40లక్షలు, చెక్కరరకం టన్ను రూ.లక్ష నుంచి రూ.1.20లక్షలు, ఖాదర్‌ రకం రూ.51 వేల నుంచి రూ.57 వేలు, మల్లిఖా రూ.50 వేల నుంచి రూ.65 వేలు, బేనీషా రూ.56 వేలు, పుల్లూరా రకం రూ.31 వేల నుంచి రూ.37 వేలు ధరలు పలికాయి. జిల్లాలో మామిడి పంట దిగుబడి చాలా తక్కువగా ఉండటంతో బయటప్రాంతాలకు ఎగుమతి తక్కువగా ఉంది. స్థానికంగా నాణ్యతసరిగా లేకపోయినా మామిడిపంట లేకపోవడంతో కిలో రూ.100 నుంచి రూ.140 వరకు పలుకుతోంది. ఈ క్రమంలో పంట చేతికి అందే సమయంలో గజరాజులు మామిడి పంట, తోటలపై విరుచుకుపడుతున్నాయి. చెట్లను విరిచేసి, కాయలను నేలరాల్చి తొక్కేస్తున్నాయి. ఇలా.. పులిచెర్ల మండలంలో 20 టన్నులు, సదుం మండలంలో 2 0టన్నులు, సోమల మండలంలో 20టన్నులు, బంగారుపాళ్యం మండలంలో 30టన్నులు, ఐరాల మండలంలో 30 టన్నులు, తవణంపల్లె మండలంలో 30 టన్నుల మామిడి కాయలు నాశనమయ్యాయి. వందల సంఖ్యలో మామిడిచెట్లు ధ్వంసమయ్యాయి. టన్నుకు సగటున రూ.80వేలు ప్రకారం లెక్కకట్టినా 150 టన్నులకు గానూ రూ.1.20 కోట్లు మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. డిమాండు వల్ల అధిక ధరలున్నా ఏనుగుల వల్ల మామిడి రైతులు పంటను కాపాడుకోలేకపోయారు.

55 ఎకరాల్లో టమోటా పంటకు నష్టం

పుంగనూరు నియోజకవర్గంలోని సోమలలో 20 ఎకరాలు, సదుంలో 15 ఎకరాలు, పులిచెర్లలో 20 ఎకరాలు చొప్పన టమోటా పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. టమోటా పంట తక్కువగా ఉండటంతో గత ఏడాది వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కొచ్చని కొండంత ఆశగా టమాటాను రైతులు సాగుచేశారు. ఎకరం టమోటా పంట సాగుచేయడానికి రైతులు రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఏనుగుల దాడులతో పులిచెర్ల, సోమల, సదుం మండలాల్లోనే ఎకరానికి రూ.1.50లక్షల చొప్పన 55 ఎకరాలకు రూ.82.50 లక్షలు నష్టం సంభవించింది. ప్రస్తుతం కిలో టమోటా రూ.39 నుంచి రూ.41 వరకు పలుకుతోంది. ఏనుగులు తొక్కడం, పంట తినడం వల్ల టమోటా ఏమాత్రం పనికి రాకుండా నేలపాలైనట్లు బాధితరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మామిడి, టమోటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

మంచి ధరలున్న సమయంలో ఏనుగుల దాడులతో నష్టపోయిన మామిడి, టమోటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ఇచ్చే నామమాత్రపు పరిహారం కాకుండా ప్రస్తుత పంటల ధరలు, జరిగిన నష్టం అంచనా వేసి ఇవ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

మంత్రి ఇలాకాను వదలని గజరాజులు

రాష్ట్ర అటవీశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఏనుగుల గుంపు ఏడాదికిపైగా తిష్ట వేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అటవీప్రాంతాల నుంచి పంటపొలాల మీదుగా పల్లెల్లోకి వచ్చేస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఏనుగుల బారి నుంచి పంటలు, చెట్లు, ఆస్తులు, చివరకు మనుషుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం వాటిని నివారించే ప్రయత్నం చేయడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరు నియోజవర్గంలో అధిక శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుండగా ఏనుగులు ఏడాపెడా పంటలపై దాడి చేసి వందల ఎకరాల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రైతులకు రూ.కోట్లలో నష్టం కలిగిస్తున్నాయి. ప్రధానంగా పుంగనూరు నియోజకవర్గంలో నిత్యం ఏనుగుల దాడుల్లో పంటలు, ఆస్తులు నాశనమవుతూ రైతులు, పొలాల వద్ద కాపలాఉన్న కూలీలు, గొర్రెల కాపరులు దాడుల్లో గాయపడటం, చనిపోవడం జరుగుతోంది. ఇంతటి నష్టం జరుగుతున్నా పుంగనూరు, పూతలపట్టు నియోజకవర్గాలతోపాటు పెద్దపంజాణి, పలమనేరు, బైరెడ్డిపల్లె, రామకుప్పం, వి.కోట, కుప్పం మండలాల్లో ఏనుగులను కట్టడిచేసి రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు.

ఆగని గజదాడులు

కల్లూరు, మే 26: పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. దేవళంపేట పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లి (గెండేవారిపల్లి) సమీపంలో శనివారం రాత్రి ఏనుగుల గుంపు మామిడిచెట్లను ధ్వంసం చేశాయి. నాగరాజమ్మ మామిడితోటలోకి ముందుగా ప్రవేశించిన ఏనుగుల గుంపు 25 ఏళ్ల క్రితం నాటిన మామిడిచెట్లను విరిచేశాయి. సుమారు 3 టన్నుల మామిడికాయలు నేలరాల్చాయి. మామిడితోట కంచెకు ఏర్పాటుచేసిన 20 రాతి కూసాలను, ముళ్ల కమ్మీని విరిచేశాయి. అనంతరం మిట్టమీదరాచపల్లికి చెందిన వెంకటరమణారెడ్డి మామిడితోటలోకి వెళ్లిన ఏనుగులు మామిడిచెట్లను ధ్వంసం చేశాయి. కుమారస్వామినాయుడు మామిడితోట గుండా ఏనుగులు అడవిలోకి వెళ్లినట్లు రైతులు తెలిపారు. ఏనుగుల గుంపు దాడులు చేసిన మామిడితోటలను అటవీశాఖ సిబ్బంది పరిశీలించారు.

Updated Date - May 27 , 2024 | 12:40 AM