Share News

తప్పుల తడకగా ఓటర్ల జాబితా

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:22 AM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని నోటీసులు జారీ చేసినా తాజా ఓటర్ల జాబితా మాత్రం సక్రమంగా తయారు కాలేదు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగానే కనిపిస్తున్నాయి.

తప్పుల తడకగా ఓటర్ల జాబితా
ఒకే బూత్‌లో రెండుసార్లు ఓటరుగా నమోదైన శివ

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అత్తగారికి రెండు ఓట్లు

చంద్రగిరి రంగంపేటలో డబుల్‌ ఎంట్రీలు

పనిచేయని ఈసీ హెచ్చరికలు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని నోటీసులు జారీ చేసినా తాజా ఓటర్ల జాబితా మాత్రం సక్రమంగా తయారు కాలేదు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగానే కనిపిస్తున్నాయి. రోజులు గడిచేకొద్దీ క్షేత్రస్థాయి పరిశీలనలో ఓటర్ల జాబితా అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి.

తిరుపతి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి అత్తగారి(భార్య తల్లి) పేరిట రెండు ఓట్లు నమోదయ్యాయి. పట్టణంలోని ఏఎం పుత్తూరు పోలింగ్‌ కేంద్రం నంబరు 104 పరిధిలో ఇంటి నంబరు 15-507 చిరునామాపై సామాను అనసూయమ్మ (70)కు ఓటరు సీరియల్‌ నంబరు 840, ఎపిక్‌ నంబరు యూసీజీ 0032995లతో ఓటరుగా జాబితాలో నమోదైంది. అయితే అదే పోలింగ్‌ కేంద్రం పరిధిలోనే ఇంటి నంబరు 15-371 చిరునామాపై ఓటరు సీరియల్‌ నంబరు 459, ఎపిక్‌ నంబరు ఎంఎన్‌వీ 2684942లతో మరో ఓటు కూడా నమోదై వుంది. ఇందులో ఆమె వయసు 52గా పేర్కొని వుంది.రెండు వేర్వేరు ఎపిక్‌ కార్డులు జారీ కాగా మొదటి కార్డు ఒరిజినల్‌గా భావించాల్సి వుంది. ఎందుకంటే మొదటి ఎపిక్‌ కార్డులో పేర్కొన్న చిరునామా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి ఇంటిది. అందులోనే ఆయన అత్తగారైన అనసూయమ్మ కూడా నివాసముంటున్నారు. రెండవ ఎపిక్‌ కార్డులో నమోదైన చిరునామాలో వాస్తవంగా పెత్తం పార్వతమ్మ, గంగరామిరెడ్డి దంపతులు నివాసముంటున్నారు. అది వారి సొంతిల్లు. అదే చిరునామాతో ఆ దంపతులిద్దరూ ఓటర్లుగా నమోదై వున్నారు. దీంతో ఎమ్మెల్యే అత్తగారి పేరిట నమోదైన రెండవ ఓటు నకిలీదిగా భావించాల్సి వస్తోంది.

ఎ. రంగంపేటలో పలు డబుల్‌ ఎంట్రీలు

చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అవకతవకల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో పోలింగ్‌ కేంద్రం నంబరు 111 పరిధిలో పలు డబుల్‌ ఎంట్రీలు వెలుగులోకి వచ్చాయి. 2-30 నంబరు ఇంటిలో నివాసముంటున్న అరిగల సుధాకర్‌ కుమారుడు అరిగల శివ (29) పేరు ఓటరు సీరియల్‌ నంబరు 316, ఎపిక్‌ నంబరు ఐఏఎక్స్‌ 3248986లతో జాబితాలో నమోదై వుంది. అయితే అదే పోలింగ్‌ కేంద్రం పరిధిలో అదే చిరునామాతో ఓటరు సీరియల్‌ నంబరు 317, ఎపిక్‌ నంబరు ఐఏఎక్స్‌ 2024826లతో అతడి పేరు జాబితాలో రెండవసారి నమోదైంది. రెండు చోట్లా ఫొటో ఒకటే అప్‌లోడ్‌ అయింది. అలాగే పోలింగ్‌ కేంద్రం 111 పరిధిలోనే 1-66-1 ఇంటి నంబరు చిరునామాతో ఎ.సుబ్రమణ్యం కుమార్తె ఎ.మమత (19) ఓటరు సీరియల్‌ నంబరు 160, ఎపిక్‌ నంబరు ఐఏఎక్స్‌ 3232675లతో ఓటరుగా నమోదయ్యారు. అదే జాబితాలో మమత పేరు అదే చిరునామాతో ఓటరు సీరియల్‌ నంబరు 857, ఎపిక్‌ నంబరు ఐఏఎక్స్‌ 3346913లతో మరో చోట కూడా నమోదై వుంది. ఆ పోలింగ్‌ కేంద్రంలోనే 2-88 ఇంటి నంబరు చిరునామాతో చిత్తూరు ధనరాజ కుమారుడు చిత్తూరు రాజవర్ధన్‌ (19) పేరు ఓటరు సీరియల్‌ నంబరు 440, ఎపిక్‌ నంబరు ఐఏఎక్స్‌ 3208618లతో ఓటరు జాబితాలో నమోదైంది. అదే పోలింగ్‌ స్టేషన్‌, అదే చిరునామాతో ఇతడి పేరు ఓటరు సీరియల్‌ నంబరు 543, ఎపిక్‌ నంబరు ఐఏఎక్స్‌ 3254455లతో మళ్ళీ జాబితాలో నమోదైంది. ఇవన్నీ కూడా గతేడాది అక్టోబరు 27 - ఈనెల 22 తేదీల మధ్యలో నమోదైనవే కావడం గమనార్హం. ఇదివరకే తిరుపతి రూరల్‌ మండల పరిధిలో ఈ తరహా డబుల్‌ ఎంట్రీలను పెద్దసంఖ్యలో గుర్తించిన నేపధ్యంలో తాజాగా చంద్రగిరి మండలంలోనూ బయటపడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తయారు చేసిన అధికారులు, ఉద్యోగులపై ప్రభావం చూపలేదనే భావించాల్సి వస్తోంది.

Updated Date - Jan 30 , 2024 | 01:22 AM