ఎన్నికల బదిలీలు మొదలు
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:46 AM
డీఆర్వోగా దేవేంద్రరెడ్డి నియామకం నలుగురు తహసీల్దార్లకు స్థానచలనం
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 17: కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారుల బదిలీలు ప్రారంభమయ్యాయి. జిల్లా రెవెన్యూ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ వి.దేవేంద్రరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డీఆర్వోగా ఎస్.రాజశేఖర్ వ్యవహరిస్తున్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంత జిల్లాతో పాటు మూడేళ్లకుపైగా జిల్లాలో తహసీల్దార్ హోదాలో విధులు నిర్వహిస్తున్న నలుగురు తహసీల్దార్లు పొరుగుజిల్లాలకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ నుంచి మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో తొలి విడత ఎన్నికల బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 22న ఓటర్ల తుదిజాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఈనెలాఖరుకల్లా మిగిలిన తహసీల్దార్లతో పాటు ఎంపీడీవోలు, జిల్లా అధికారులకు కూడా స్థానచలనం కానుంది. ప్రస్తుతం ఓటరు జాబితా తయారీతో సంబంధం లేకుండా ఇతరత్రా పోస్టుల్లో ఉన్న తహసీల్దార్లను తొలివిడతగా ఇతర జిల్లాకు బదిలీచేశారు. గత ఎన్నికల సమయంలో తహసీల్దార్లను జిల్లాలకు కేటాయిస్తే కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చేవారు. ఈసారి నేరుగా మండలాల పోస్టింగ్స్ కూడా సీసీఎల్‌ఏ చేసింది. చిత్తూరు కలెక్టరేట్‌లో ల్యాండ్ రికార్డ్స్ (ఎల్‌ఆర్) ఏవో కె.పద్మజను కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్‌గా, కలెక్టరేట్ భూవిభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పి.మురళిని కర్నూలు జిల్లా కోసిగి, చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బి.రామాంజుల నాయక్‌ను కర్నూలు జిల్లా చిప్పగిరి తహసీల్దారుగా బదిలీ చేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని కేఆర్‌సీసీ తహసీల్దారుగా పనిచేస్తున్న టి.జి.మోహనవళ్లిని అనంతపురం జిల్లా యాడికి తహసీల్దారుగా బదిలీచేశారు.