Share News

కలెక్టర్‌ లక్ష్మీశపై ఈసీ బదిలీ వేటు

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:38 AM

జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. విధుల్లో చేరిన రెండు నెలలకే అవమానకరమైన రీతిలో బదిలీకి గురి కావడంతో పాటు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఎన్నికలకు సంబంధించిన విధులు,బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ ఆదేశించడం గమనార్హం.

కలెక్టర్‌ లక్ష్మీశపై ఈసీ బదిలీ వేటు

తిరుపతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. విధుల్లో చేరిన రెండు నెలలకే అవమానకరమైన రీతిలో బదిలీకి గురి కావడంతో పాటు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఎన్నికలకు సంబంధించిన విధులు,బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ ఆదేశించడం గమనార్హం.

ఎమ్మెల్యేని ఇంటికెళ్ళి కలిసి....

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో గత జనవరి ఆఖర్లో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించే జిల్లా, డివిజన్‌, మండల స్థాయి ఽఅధికారులంతా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేస్తుండిన లక్ష్మీశ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల నేపధ్యంలో వచ్చినందున జిల్లా ఎన్నికల అధికారిగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని ప్రజలకు, రాజకీయ పార్టీల నేతలకు నమ్మకం కలిగించే విధంగా ఆయన నడుచుకోవాల్సి వుండింది. కానీ గత జనవరి 31వ తేదీన బాద్యతలు చేపట్టగా అదే రోజు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. ఆ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అది తిరుపతిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. టీడీపీతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులంతా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆయన తీరుపై విమర్శలు, ఆరోపణలు చేశారు. జిల్లాలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తారని కలెక్టర్‌పై తమకు నమ్మకం లేదంటూ ప్రకటించారు.ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన జిల్లాలో తొలి అడుగే వివాదాస్పదమైంది.

చంద్రగిరి టీడీపీ నేతల ఫిర్యాదులపై ఈసీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అనేక అంశాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.ఈఆర్వో కార్యాలయంలో పలువురు అధికారులు, సిబ్బంది అధికార పార్టీ ఎమ్మెల్యేకి అనుకూలంగా పనిచేస్తున్నారనే అంశంపై ప్రధానంగా ఫిర్యాదులు చేశారు. వీటిపై కలెక్టర్‌ను ఈసీ వివరణ కోరగా ఫిర్యాదుల్లో స్పష్టత లేదని ఆయన ఈసీకి సమాధానం ఇచ్చినట్టు సమాచారం.అయితే తాము చేసిన ఫిర్యాదులకు సంబంధించి టీడీపీ నేతలు ఆధారాలను కూడా ఈసీకి సమర్పించి వుండడంతో కలెక్టర్‌ పనితీరుపై ఈసీ అసంతృప్తికి లోనైనట్టు తెలిసింది.

వైసీపీ ప్రచార సామగ్రి ఉదంతంలో నిర్లక్ష్యం

రేణిగుంట శివార్లలో గత నెల 26వ తేదీన నాలుగు గోదాముల్లో రూ. కోట్ల విలువైన వైసీపీ ప్రచార సామగ్రి పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనిపై తొలుత రేణిగుంట టీడీపీ నేతలు గోదాముల వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత చంద్రగిరి టీడీపీ నేతలు గోదాముల వద్దే రాత్రంతా కాపలా కాశారు. ఆపై శ్రీకాళహస్తి టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.వారూ గోదాముల వద్ద ఆందోళన చేపట్టారు. తిరుపతి టీడీపీ నేతలు కలెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. గోదాముల్లో నేరుగా పార్టీకి సంబంధించిన ప్రచార సామగ్రిపై ఎవరికీ పెద్దగా అభ్యంతరాల్లేవు. కానీ కొన్ని గోదాముల్లో ఒకరిద్దరు వైసీపీ నాయకుల వ్యక్తిగత ప్రచారానికి సంబంధించిన సామగ్రి, అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే సామగ్రి పట్టుబడ్డాయి. వాటిపై పేర్లు, ఫొటోలు కూడా స్పష్టంగా కన్పిస్తున్నా అధికారులు అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారు. రేణిగుంట మండల అఽధికారుల నుంచీ శ్రీకాళహస్తి రిటర్నింగ్‌ అధికారి దాకా, అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్‌, ఎస్పీలు కూడా బాధ్యతగా స్పందించలేదు. నాలుగు రోజుల పాటు వివాదం కొనసాగినా కలెక్టర్‌ గానీ, ఎస్పీ గానీ గోదాములను పరిశీలించకపోవడం విమర్శలకు దారి తీసింది. ఓటర్లను ప్రలోభపెట్టే సామగ్రి దొరికినపుడు లోతుగా విచారణ జరపడం అటుంచి ఆధారాలు దొరికిన మేరకైనా బాధ్యులకు నోటీసులు జారీ చేయడం, వారిపై చర్యలకు ఉపక్రమించకపోవడం అందరిలో అనుమానాలు రేకెత్తించింది. చివరికి మీడియా ద్వారా కూడా జిల్లా అధికారులు ప్రజలకు స్పష్టమైన సమాచారం, సమాధానం ఇవ్వలేదు. ఇతర జిల్లాల్లో ఇలాంటి వస్తువులు పట్టుబడినప్పుడు వాటిని కోర్టులకు స్వాధీన పరిచి, కోర్టుల అనుమతితో వాటిని రిలీజ్‌ చేయడం జరుగుతోంది. అయితే రేణిగుంట ఉదంతంలో జిల్లా అధికారులు ఆ పద్ధతి పాటించకుండా బిల్లులు చూపించారని చెప్పి నేరుగా సామగ్రిని విడుదల చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలతో పాటు విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ముఖ్యనేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలసి ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్‌ కలెక్టర్‌ లక్ష్మీశ తీరు సక్రమంగా, పారదర్శకంగా లేదని భావించి బదిలీ వేటు వేసింది.

జిల్లాలో మరికొందరిపైనా చర్యలు?

ప్రస్తుతానికి జిల్లా ఎన్నికల అధికారి హోదాలో వున్న కలెక్టర్‌ లక్ష్మీశ బదిలీ వేటుకు గురి కాగా తదుపరి జిల్లాలో మరికొందరు అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు చెందిన కీలక అధికారుల తీరు పట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి తీరుపై ఆధారాలతో ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాగే మండల, డివిజన్‌ స్థాయి కార్యాలయాల్లో పలువురు అధికారులు, ఉద్యోగులు అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చాలావరకూ ఆధారాలు జతచేసి మరీ టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఆ క్రమంలో రానున్న కొద్ది రోజుల్లో మరికొందరిని కూడా ఎన్నికల విధుల నుంచీ తప్పించే అవకాశముంది.

జిల్లా పరువు తీస్తున్న అధికారులు

నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిజాయితీగా పనిచేయాల్సిన అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులు తాము తప్పటడుగులు వేయడంతో పాటు ఏకంగా జిల్లా పరువు కూడా తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 2020-21లో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా అరాచక పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు, శ్రేణులు పలుచోట్ల రెచ్చిపోయి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, పుంగనూరు, శ్రీకాళహస్తి సీఐలు తమ పరిధిలో జరిగిన ఈ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. దీంతో 2021 జనవరి 27న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అప్పటి కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డిలతో పాటు పలమనేరు డీఎస్పీ, పుంగనూరు, శ్రీకాళహస్తి సీఐలపై బదిలీ వేటు వేశారు. ఈ పరిణామంతో జిల్లా ప్రతిష్ట దెబ్బతింది. అదే ఏడాది జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటరు కార్డులతో దేశవ్యాప్తంగా జిల్లా పరువు పోయిన సంగతీ తెలియంది కాదు. ఆ ఎన్నికల్లో దారుణమైన తప్పిదాలకు బాధ్యులుగా మారడంతో అప్పటి తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసి తదుపరి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా వుండిన గిరీశపై ఈ ఏడాది జనవరి 19న ఈసీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆ క్రమంలో తిరుపతి డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి సహా ఇద్దరు సీఐలు, కిందిస్థాయి సిబ్బంది కూడా సస్పెండయ్యారు. ఈ రెండు ఘటనలతో జిల్లా ప్రతిష్ట దెబ్బతిందని ప్రజానీకం బాధపడుతున్న తరుణంలో తాజాగా కలెక్టర్‌ లక్ష్మీశ సస్పెన్షన్‌ జిల్లా పరువు మరోసారి గంగలో కలిసినట్టయింది. ఐఏఎస్‌ కెరీర్‌లో తొలిసారి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన లక్ష్మీశ 60 రోజుల స్వల్ప వ్యవధిలోనే ఈసీ కన్నెర్రకు గురై బదిలీ కావడం, ఎన్నికల ప్రక్రియ ముగిసే దాకా ఎన్నికలకు సంబంధించిన విధులు, బాద్యతలు అప్పగించవద్దని ఈసీ ఆదేశించే పరిస్థితి రావడం జిల్లా అధికార, ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది.మూడేళ్ళ వ్యవధిలో మూడు పర్యాయాలు జిల్లా వేదికగా జరిగిన ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి కీలక అధికారులు ఎన్నికల కమిషన్‌ చర్యలకు గురి కావడం మాత్రం నిస్సందేహంగా జిల్లా ప్రతిష్టను మసకబారేలా చేసింది.

Updated Date - Apr 03 , 2024 | 01:38 AM