Share News

దోషం దందా..!

ABN , Publish Date - Apr 07 , 2024 | 02:07 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదేళ్లుగా అవినీతికి అంతే లేకుండా పోయింది. ప్రత్యేకించి రాహు-కేతు పూజల్లో భక్తుల నుంచి బలవంతపు వసూళ్లు విచ్చలవిడిగా సాగిస్తూనే ఉన్నారు.

దోషం దందా..!

రాహు-కేతు పూజల్లో ఆగని బలవంతపు వసూళ్లు

ముక్కంటీశుడి ఆలయంలో ఐదేళ్లుగా అంతులేని అవినీతి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదేళ్లుగా అవినీతికి అంతే లేకుండా పోయింది. ప్రత్యేకించి రాహు-కేతు పూజల్లో భక్తుల నుంచి బలవంతపు వసూళ్లు విచ్చలవిడిగా సాగిస్తూనే ఉన్నారు. ఈ ఒక్క విభాగంలోనే రూ.50 కోట్లకుపైగా

అక్రమ సొమ్మును పోగేసి.. వాటాలు వేసుకుని మరీ పంచుకున్నారు. నిత్యం ఇది బాహాటంగా జరుగుతూనే ఉన్నా ఏ ఒక్క అధికారి కూడా ఈ అక్రమ వసూళ్లను అడ్డుకోలేదన్న అపవాదు నేటికీ కొనసాగుతూనే ఉంది. గ్రహణకాల సమయంలో అన్నిచోట్లా ఆలయాలను మూత వేసి.. విడుపు తర్వాత తిరిగి తెరుస్తుంటారు. కానీ శ్రీకాళహస్తిలో నవగ్రహాలను కవచంగా ధరించి కొలువుదీరిన వాయులింగేశ్వరుడికి అన్ని గ్రహణకాల సమయాల్లోనూ విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ఈ సమయంలో ఆలయాన్ని తెరచి భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. ఈ గ్రహణ కాల అభిషేకాలను దర్శించుకోవడానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రం కావడంతో ముక్కంటి ఆలయంలో రాహు-కేతు సర్ప దోష నివారణ పూజలు జరిపించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఇటీవల దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో రాహు-కేతు పూజలు చేసుకునేందుకు విచ్చేస్తున్నారు.

దక్షిణ పెడితేనే దోషం పోతుందంటూ..

ఆలయంలో రాహు- కేతు పూజలను ఐదు ధరల టికెట్లపై నిర్వహిస్తుంటారు. రూ.500, రూ.750, రూ.1500, రూ.2500, రూ.5000 టికెట్లుగా విభజించి ఆయా మండపాల్లో బ్యాచ్‌ల వారీగా పూజలు చేస్తుంటారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రోజూ ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి. మండపాల్లో ఆశీనులైన భక్తులతో సామూహికంగా సంకల్పాన్ని మైక్‌లో అనౌన్స్‌ చేస్తూ రాహు-కేతు పూజలు జరిపిస్తారు. ఇదే మైక్‌ నుంచే ప్రతి ఒక్కరూ.. దక్షిణ ఇస్తేనే మీ దోషం పోతుందంటూ భక్తులను మానసికంగా భయపెడుతున్నారు. రూ.2,500 పూజలో అయితే రూ.201, రూ.5,000 పూజలో అయితే రూ.501 దక్షిణ పెట్టాలంటూ బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఆలయంలో నెలకు అన్నిరకాల టికెట్లు కలిపి మొత్తం సుమారు లక్ష రాహు-కేతు పూజలు జరుగుతాయని అంచనా. అంటే సగటున రూ.100 చొప్పున లెక్కేసినా నెలకు రూ.కోటి సునాయాసంగా పోగేస్తున్నారు. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రూ.50 కోట్లకు ఈ దందా చేరిందన్నమాట. ఈ అక్రమ సొమ్మును నియోజకవర్గ ముఖ్య నేత నుంచి, కిందిస్థాయి ఆలయ సిబ్బంది వరకు బొక్కేస్తున్నారన్న విమర్శలున్నాయి.

భక్తులు నిలదీసినా..

ఈ అక్రమ వసూళ్లపై పలుమార్లు భక్తులు నిలదీశారు. దీనిపై లిఖితపూర్వకంగా దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా ఇలా మండపాల్లో అక్రమ వసూళ్లపై నిలదీసిన భక్తులను కొన్ని సందర్భాల్లో ఆలయ ఉద్యోగులు చేయి చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి.

ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరించినా..

బలవంతపు వసూళ్లు చేయడం మంచి పద్ధతి కాదని ఎందరో ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరించారు. ఏడాది క్రితం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆలయాన్ని దర్శించుకున్నారు. బహిరంగంగా మీడియా ఎదుటే రాహు-కేతు పూజల్లో వసూళ్లు తగదంటూ పాలకులకు, అధికారులకు హితవు పలికారు.

Updated Date - Apr 07 , 2024 | 02:07 AM