Share News

ఇసుక అక్రమ రవాణాను పట్టించుకోరా?

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:02 AM

ఏర్పేడు మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్న కలెక్టర్‌, ఎస్పీ కూడా పట్టించుకోవడం లేదని గోవిందవరం, మునగలపాళెం, వికృతమాల రైతులు శనివారం రిలే నిరాహార దీక్షకు దిగారు.

ఇసుక అక్రమ రవాణాను పట్టించుకోరా?
స్వర్ణముఖి నది ఒడ్డున రైతుల రిలే దీక్ష

ఫ రిలే దీక్షకు దిగిన మూడు గ్రామాల రైతులు

ఏర్పేడు, మార్చి 23: ఏర్పేడు మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్న కలెక్టర్‌, ఎస్పీ కూడా పట్టించుకోవడం లేదని గోవిందవరం, మునగలపాళెం, వికృతమాల రైతులు శనివారం రిలే నిరాహార దీక్షకు దిగారు. వారు మాట్లాడుతూ.. తమ గ్రామాల సరిహద్దులో ఉన్న స్వర్ణముఖి నది ప్రాంతం నుంచి ఇసుకను రాత్రి వేళల్లో ఒడ్డుకు చేర్చి, పగటిపూట టిప్పర్లతో చెన్నై ప్రాంతానికి తరలిస్తున్నారని చెప్పారు. రోజుకు 30 నుంచి 50 టిప్పర్ల ఇసుక చెన్నైకి తరలిపోతోందన్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. 25రోజుల కిందట కలెక్టర్‌ లక్ష్మీశకు, పూర్వపు ఎస్పీ మలికా గర్గ్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారు కూడా పట్టించుకోక పోవడంతో గోవిందవరం, మునగలపాళెం గ్రామాల వద్ద స్వర్ణముఖి నది ఒడ్డున టెంటు వేసుకుని శాంతియుతంగా రిలే దీక్షకు దిగామని చెప్పుకొచ్చారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా టీడీపీ సీనియర్‌ నాయకుడు పేరం చిరంజీవులునాయుడు మాట్లాడుతూ.. స్వర్ణముఖి నది ప్రాంతంలో ఇసుకను తోడేయడం వల్ల సమీపంలో ఉన్న రైతుల బోర్లు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇలాగే తవ్వుతూ పోతే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 02:02 AM