అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించొద్దు
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:03 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.
- చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి
చిత్తూరు, మార్చి 2: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు 30 యాక్టు అమల్లోకి వచ్చిందన్నారు. చిత్తూరు ఒకటి, రెండో పోలీసుస్టేషన్లతోపాటు తాలూకా పోలీసుస్టేషన్, జీడీ నెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, పెనుమూరు, యాదమరి, గుడిపాల, తవణంపల్లె, కాణిపాకం, పూతలపట్టు, ఐరాల, కల్లూరు, రొంపిచెర్ల పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ యాక్టు అమలులో ఉంటుందన్నారు. ఈ స్టేషన్ల పరిధిలో సభలు, సమావేశాలు జరపాలనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో సీఐ విశ్వనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.