Share News

కూటమిలో ధీమా!

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:33 AM

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఎన్డీఏ కూటమి పార్టీల్లో విజయం పట్ల ధీమా పెరిగింది.పేరు ప్రతిష్టలు, విశ్వసనీయత కలిగిన 24 సర్వే సంస్థలు రాష్ట్రంతో పాటు జిల్లాల కూడా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే మెజారిటీ స్థానాలు దక్కుతాయని ప్రకటించడంతో మూడు పార్టీల శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

కూటమిలో ధీమా!

ఫఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఫుల్‌ జోష్‌లో టీడీపీ, జనసేన. బీజేపీ

తిరుపతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఎన్డీఏ కూటమి పార్టీల్లో విజయం పట్ల ధీమా పెరిగింది.పేరు ప్రతిష్టలు, విశ్వసనీయత కలిగిన 24 సర్వే సంస్థలు రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే మెజారిటీ స్థానాలు దక్కుతాయని ప్రకటించడంతో మూడు పార్టీల శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.పయనీర్‌ సంస్థ విడుదల చేసిన ఫలితాలు తిరుపతి ఎంపీతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాలు కూటమి ఖాతాలో వేశాయి.కేవలం రెండు స్థానాలనే వైసీపీ ఖాతాలో వేశాయి. గూడూరు, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి సీట్లు కూటమికి దక్కుతాయని, సూళ్ళూరుపేట, సత్యవేడు మాత్రం వైసీపీకి దక్కుతాయని ఆ సంస్థ ఫలితాలు చెబుతున్నాయి. పల్స్‌ టుడే సర్వే ఫలితాలు కూటమికి 4 సీట్లు, వైసీపీకి 3 సీట్లు దక్కుతాయని వెల్లడించాయి. గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి స్థానాలు కూటమి ఖాతాలో, సూళ్ళూరుపేట, చంద్రగిరి, సత్యవేడు స్థానాలు వైసీపీ ఖాతాలో వేశాయి. చాణక్య స్ట్రాటజీస్‌ సంస్థ తిరుపతి ఎంపీ సీటు వైసీపీకి దక్కుతుందని చెబుతోంది. అయితే ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమికి 3, వైసీపీకి 2 చొప్పున దక్కుతాయని, మిగిలిన రెండు స్థానాల్లో గట్టి పోటీ వుందని చెబుతోంది. స్థానాల వారీగా శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి కూటమికి దక్కుతాయని, చంద్రగిరి, సూళ్ళూరుపేట వైసీపీకి దక్కుతాయని, తిరుపతి, సత్యవేడుల్లో గట్టి పోటీ వుంటుందని వెల్లడించింది. చాణక్య ఎక్స్‌ అనే సంస్థ వెలువరించిన ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. తిరుపతి ఎంపీ సీటు వైసీపీ వైపు మొగ్గు వుందని వెల్లడిస్తోంది. శ్రీకాళహస్తి, తిరుపతి స్థానాలు టీడీపీకి, సూళ్ళూరుపేట, సత్యవేడు స్థానాలు వైసీపీకి దక్కుతాయని చెబుతోంది. అలాగే గూడూరులో టీడీపీ వైపు మొగ్గు కనిపిస్తుండగా వెంకటగిరి, చంద్రగిరిల్లో వైసీపీ వైపు మొగ్గు కనిపిస్తోందని ఈ సంస్థ ఫలితాలు చెబుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలలో ఏడు అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి, వైసీపీ నడుమ ఒకటి రెండు స్థానాల తేడాయే కనిపిస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా కూటమికి అధికారం దక్కుతుందనే అంశం కూటమి పార్టీల శ్రేణుల్ని సంబరపరుస్తోంది.

అత్యధిక సర్వే సంస్థల మొగ్గు కూటమి వైపే!

ఇండియా టుడే, సీఎన్‌ఎన్‌ న్యూస్‌, ఏబీపీ న్యూస్‌, న్యూస్‌ ఎక్స్‌, ఇండియా టీవీ, జీ న్యూస్‌, బిగ్‌ టీవీ, పయనీర్‌ పోల్‌ స్ట్రాటజీస్‌ వంటి పేరున్న 24 సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల ఫలితాలను శనివారం రాత్రి వెల్లడించగా ఇంచుమించు వాటన్నింటి సారాంశం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాల కోసం జిల్లావ్యాప్తంగా ఇటు రాజకీయ పక్షాలు, అటు ప్రజానీకం కూడా ఉత్కంఠగా వేచి చూశాయి. మెజారిటీ సంస్థల ఫలితాలు కూటమికి అనుకూలంగా వెలువడడంతో కూటమి పార్టీల నేతల్లో సంబరం నెలకొంది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ నడిచింది. 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో ఫలితాలు లాంఽఛనప్రాయమేనన్న ధీమా కూటమి పార్టీల శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రాచుర్యం లేని కొన్ని సంస్థలు మాత్రమే వైసీపీకి అధిక స్థానాలు దక్కుతాయని ప్రకటించాయి. పేరున్న సంస్థలన్నీ వైసీపీ ఓటమిని నిర్ధారించగా ఆ పార్టీ శ్రేణులు డీలా పడిపోయాయి. నాయకులు పైకి బింకంగా కనిపిస్తున్నా అంతర్గతంగా గెలుపుపై అనుమానాలు పెరిగిపోయే పరిస్థితులను ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు సృష్టించాయి.

చిత్తూరులో నాలుగు కూటమికి.. మూడు వైసీపీకి..

చిత్తూరు జిల్లా విషయానికి వస్తే దాదాపు అన్ని సంస్థలూ ఒకే తరహా ఫలితాలను విడుదల చేశాయి. కుప్పం, పలమనేరు, నగరి, చిత్తూరు స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని.. పుంగనూరు, పూతలపట్టు, జీడీనెల్లూరులో వైసీపీ విజయం సాధిస్తుందని చాణక్య స్ర్టాటజీస్‌, చాణక్య ఎక్స్‌, పల్స్‌ టుడే, సర్వే ఫ్యాక్టరీ సంస్థలు చెప్పాయి. పయనీర్‌ పోల్‌ స్ర్టాటజీ పూతలపట్టు కూడా టీడీపీకే అంటోంది. సర్వే ఫ్యాక్టరీ అయితే జీడీనెల్లూరు టఫ్‌ అంటోంది. మొత్తంగా జిల్లాలో సింహభాగం స్థానాలు కూటమి దక్కించుకుంటుందని సర్వేలు చెప్తున్నాయి. ప్రముఖ సంస్థ ఆరా సర్వే మాత్రం రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి రానుందని చెప్తోంది.

Updated Date - Jun 02 , 2024 | 08:42 AM