అమరావతికి నామినేటెడ్ పోస్టుల వివరాలు
ABN , Publish Date - Jul 15 , 2024 | 01:24 AM
నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ఉన్న పోస్టుల వివరాలు పంపాలని సీఎంవో కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయ్యింది.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 14: నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ఉన్న పోస్టుల వివరాలు పంపాలని సీఎంవో కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయ్యింది. గత ఐదేళ్ళ వైసీపీ పాలన కాలంలో ఎవరెవరు? ఏయే పోస్టుల్లో వున్నారు? ఎంతకాలం పనిచేశారన్న వివరాలు కోరింది. దాని ఆధారంగా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు సంబంధించి ఒక సలహాదారుడు, 15 కార్పొరేషన్ల చైర్మన్ల పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ సలహాదారుడు (ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు), చిత్తూరు మాజీ ఎంపీ, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్, ఈడిగ వెల్ఫేర్ కార్పొరేషన్, వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్, పాలఏకరి కార్పొరేషన్, ఏపీఎంబీసీ, ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్, ఫోక్ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, సీడీసీఎంఎస్ చైర్మన్, చుడా చైర్మన్, ఐసీడీసీఎస్ రీజనల్ ఆర్గనైజర్, పి.కె.ఎం అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్, జిల్లా కోఆపరేటివ్ ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా పరిషత్ స్త్రీ శిశు సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలోని 76 సింగిల్ విండోల త్రిసభ్య కమిటీలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మండలస్థాయిలో ఉన్న పోస్టుల వివరాలను కూడా అఽధికారులు సేకరించారు. గతంలో ఈ కమిటీల చైర్మన్లు జూలై తొలివారంలో తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ జాబితాను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. మూడు పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ప్రతి నామినేటెడ్ పోస్టు భర్తీకై ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.