Share News

చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమళ్ల

ABN , Publish Date - Mar 23 , 2024 | 12:59 AM

చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల ప్రసాద్‌రావును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.

చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమళ్ల

చిత్తూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల ప్రసాద్‌రావును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఈయన కొన్నాళ్లుగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ప్రసాద్‌రావును చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయనున్నట్లు ఈనెల 7వ తేదీన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం విడుదల చేసిన అభ్యర్థుల మూడో జాబితాలో ఆయన పేరును టీడీపీ ప్రకటించింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో కుప్పం నియోజకవర్గం ఉండడం.. అక్కడ ప్రతిసారీ చంద్రబాబుకు అత్యధిక మెజార్టీ రావడం.. వంటి కారణాలతో ఇక్కడి నుంచి పోటీ టీడీపీ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం అప్పటి వేవ్‌ కారణంగా వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో శివప్రసాద్‌ ఓటమి చెందారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన మరణించారు. అప్పట్నుంచి చిత్తూరు ఎంపీ స్థానం ఎవరికి కేటాయిస్తారా అన్న ఆసక్తి శ్రేణుల్లో నెలకొంది. సినీ నటుడు సప్తగిరి ఎంపీ టికెట్‌ కోసం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ద్వారా ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎస్పీ (కేంద్ర భద్రతా దళం) పీసీ స్వామి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. చివరిగా మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ప్రసాద్‌రావు తెరపైకి వచ్చారు. ఈయన ఐఆర్‌ఎస్‌ అధికారిగా 2019లో ముందస్తు పదవీ విరమణ పొంది తన కుమారుడు రాధే పేరుతో హైదరాబాదులో కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ స్థాపించారు. ముందుగా బాపట్ల ఎంపీ స్థానం కోసం ప్రయత్నించిన ఆయన.. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశంతో చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పది రోజులుగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

Updated Date - Mar 23 , 2024 | 12:59 AM